logo

కమిటీలతోనే కాలయాపన

గ్రామాల్లో అన్నదాతలకు ఎంతో ఉపయోగపడే సహకార సంఘాలకు ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు. చివరిగా 2013 ఫిబ్రవరిలో జరిగాయి.

Published : 06 Feb 2023 06:20 IST

పీఏసీఎస్‌ల ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే..!

జి.సిగడాం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం

న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్‌: గ్రామాల్లో అన్నదాతలకు ఎంతో ఉపయోగపడే సహకార సంఘాలకు ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు. చివరిగా 2013 ఫిబ్రవరిలో జరిగాయి. అయిదేళ్ల కాలపరిమితి ముగిసిన అనంతరం 2018లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. అప్పటి ప్రభుత్వం పాత పాలకవర్గాలనే కొనసాగించింది. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని రద్దు చేసి త్రిసభ్య కమిటీలను తెరపైకి తీసుకువచ్చింది. నేటికీ వాటినే కొనసాగిస్తోంది.

పునర్విభజన తర్వాత..: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 49 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్‌), రణస్థలంలో ఒక రైతు సేవా సహకార సంఘం ఉండేవి. జిల్లాల పునర్విభజన తరువాత విజయనగరం జిల్లాకు 7, పార్వతీపురం మన్యానికి 6 పీఏసీఎస్‌లు వెళ్లిపోవడంతో ప్రస్తుతం 36 మిగిలాయి. వీటి నిర్వహణ బాధ్యతలు చూస్తున్న త్రిసభ్య కమిటీల పదవీకాలం జనవరి 31తో ముగిసింది. వాటిని మరో ఆరు నెలలు కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో ఏర్పాటు చేసిన కమిటీల్లో పెద్దగా మార్పులు చేర్పులు లేకుండానే పాతవారితో కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.

రెండు డివిజన్లలో..: శ్రీకాకుళం డివిజన్‌ పరిధిలో అరసవల్లి, తూలుగు, అంపోలు, ఎస్‌ఎంపురం, లావేరు, పైడిభీమవరం, పొందూరు, బాతువ, జి.సిగడాం, కృష్ణాపురం, కొత్తకోట, ఎల్‌ఎన్‌పేట, నరసన్నపేట, పోలాకి, కోటబొమ్మాళి, అల్లాడ, చల్లవానిపేట, బూర్జ, టెక్కలి డివిజన్‌ పరిధిలో కవిటి, కంచిలి, టెక్కలి, ఇచ్ఛాపురం, సంతబొమ్మాళి, నందిగాం, తెంబూరు, దిమిలాడ, పాతపట్నం, కొసమాల, మందస, బాలిగాం, సోంపేట, పలాస, వజ్రపుకొత్తూరు, సారవకోట, బుడితి, హిరమండలం పీఏసీఎల్‌లున్నాయి.

అంతా సిద్ధం చేసినా..: రెండేళ్ల కిందట సహకార సంఘాల ఎన్నికలకు కసరత్తు చేసినా ఆ ప్రక్రియ అంతలోనే ఆగింది. 2020లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన సమయంలో వీటికి కూడా ఎన్నికలు నిర్వహిస్తారని అంతా ఊహించారు. జిల్లావ్యాప్తంగా పీఏసీఎస్‌ల వారీగా ఓటర్ల జాబితాలు, పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేసినా ఎన్నికలు జరగలేదు. 2019లో వైకాపా అధికారంలోనికి వచ్చిన తరువాత కమిటీలను తెరపైకి తీసుకువచ్చింది. వాటితోనే కాలయాపన చేస్తోంది.

పాలకవర్గంతోనే పరిష్కారం..: గతంలో సహకారం సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతులే వాటి అధ్యక్షులను ఎన్నుకునేవారు. దీంతో వారు రైతులకు అవసరమైన సేవలందించేవారు. రుణాలు, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సకాలంలో అందేలా పాలకవర్గ సభ్యులు కృషి చేసేవారు. మూడున్నరేళ్లుగా అధికార పార్టీకి చెందిన నాయకులే పీఏసీఎస్‌లకు ఛైర్మన్లుగా ఉండటంతో తమ సమస్యలకు పరిష్కారం దొరకడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఉన్నవారికే మరో అవకాశం..
- ఎస్‌.సుబ్బారావు, డీసీవో, శ్రీకాకుళం

సహకార సంఘాల త్రిసభ్య కమిటీలను ఈ ఏడాది జులై 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న కమిటీల్లోని సభ్యులకే మరో అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని