logo

గ్రానైట్‌ చీకటి వ్యాపారం

ఎలాంటి అనుమతులు లేకుండా జనవరి 29న రెండు గ్రానైట్‌ బ్లాక్‌లను తరలిస్తున్న లారీని విజిలెన్స్‌ అధికారులు టెక్కలిలో పట్టుకున్నారు.

Published : 07 Feb 2023 06:09 IST

గ్రానైట్‌ చీకటి వ్యాపారం
యథేచ్ఛగా  అక్రమ రవాణా
ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్న వైనం

ఎలాంటి అనుమతులు లేకుండా జనవరి 29న రెండు గ్రానైట్‌ బ్లాక్‌లను తరలిస్తున్న లారీని విజిలెన్స్‌ అధికారులు టెక్కలిలో పట్టుకున్నారు. అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. అధికారులు సెలవుల్లో ఉంటారని శని, ఆదివారాల్లో అక్రమార్కులు ఎక్కువగా ఇలాంటి తరలింపులకు పాల్పడుతున్నారు.


టెక్కలి, న్యూస్‌టుడే: జిల్లాలో గ్రానైట్‌ అక్రమ రవాణా రోజురోజుకూ పెరిగిపోతోంది. దొరకనంతసేపు దర్జాగా సాగిపోయినా.. తెరవెనక బాగోతాలు లెక్కలేనన్ని. రాజకీయ పలుకుబడిని పెట్టుబడిగా పెట్టి సాగిస్తున్న దళారీ దందాతో రాత్రికిరాత్రే లావాదేవీలు చేతులు మారిపోతున్నాయి. అధికారంతో అధికారులు చుట్టుముట్టకుండా చూసుకునే నయా వ్యాపార మంత్రం ఇక్కడ అమలవుతోంది. టెక్కలి నియోజకవర్గంలో 100కు పైగా గ్రానైట్‌ పరిశ్రమలు ఉండగా 50 వరకు క్వారీలు నడుస్తున్నాయి. భూగర్భ సహాయ సంచాలకుడి కార్యాలయానికి ఏటా రూ.100 కోట్ల ఆదాయం సమకూరుతోంది. అంతకుమించిన ఆదాయం ప్రభుత్వానికి దక్కకుండా అధికారుల కళ్లుగప్పి దాటిపోతోందని రవాణా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అసలేం జరుగుతోంది?

ప్రభుత్వం గ్రానైట్‌ అక్రమ రవాణాను నియంత్రించేందుకు ఎన్నో విధానాలను ప్రవేశపెడుతూ వస్తోంది. పర్మిట్లు మంజూరు చేసిన దగ్గర నుంచి నిర్ణీత వ్యవధిలో రవాణా జరిగిపోవాలని, రవాణా చేసే వాహనానికి జియోట్యాగింగ్‌ చేసి ఉండాలన్న నిబంధనలు అమలు చేస్తోంది. ఎత్తుకు పైఎత్తు వేయడంలో అక్రమార్కుల లెక్కే వేరు. ఇంతవరకు ఒక పర్మిట్‌ తీసి దానిపై అంతకుమించి రవాణా చేసే ఎత్తుగడ అమలు చేయగా, తాజాగా అసలు పర్మిట్లే అవసరం లేకుండా రాత్రికిరాత్రి తరలించేస్తున్నారు. ఐదు నుంచి 10 కి.మీ. దూరంలో ఉన్న క్వారీల నుంచి సమీపంలోని పాలిషింగ్‌ పరిశ్రమలకు ఈ రవాణా జరిగిపోతోంది. అధికారుల చూపు ఓవైపు మళ్లించి, అక్రమాలు మరోవైపు చేయడంలో సిద్ధహస్తులయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పర్యవేక్షించాల్సిన విజిలెన్స్‌, భూగర్భగనుల శాఖ అధికారులు నామమాత్రంగా వ్యవహరిస్తుండటం, పోస్టింగుల కోసం అక్రమార్కుల చుట్టూ అధికారులు తిరుగుతుండటంతో వారికి మరింత స్వేచ్ఛ దొరికిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


నియంత్రణకు కఠిన చర్యలు     

గ్రానైట్‌ బ్లాక్‌ల అక్రమ రవాణా నియంత్రణకు గట్టి చర్యలు చేపట్టాం. విజిలెన్స్‌ అధికారులు ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్నారు. శాఖ సిబ్బంది ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు. క్వారీల యజమానులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మరిన్ని చర్యలు చేపడతాం.
ఫణిభూషణ్‌రెడ్డి, భూగర్భగనుల శాఖ ఏడీ, టెక్కలి


ఏం చేయాలి..

గ్రానైట్‌ పరిశ్రమలు ఉన్న కూడళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు డివిజన్‌లో రెండుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటుచేస్తే గ్రానైట్‌ అక్రమ రవాణాను దాదాపు నియంత్రించవచ్చని గతంలో అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడంతో అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి. మరోవైపు ఫ్యాక్టరీలకు వచ్చే విద్యుత్తు బిల్లులు, వారు పొందిన అనుమతులకు బేరీజు వేసుకుంటే ఎక్కడ అక్రమాలు జరుగుతున్నాయన్నది స్పష్టంగా వెల్లడవుతుందని, దాన్ని ఎందుకు అమలు చేయరని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.    

పరిచయాలే పెట్టుబడి

జిల్లాలోని ముఖ్య నేతలతో ఉన్న పరిచయాలు తమకు పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. ఇటీవల విజిలెన్స్‌ అధికారులకు టెక్కలిలో పట్టుబడిన లారీ అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత పరిశ్రమకు వెళ్తూ పట్టుబడిందే. పక్కా సమాచారం కాల్‌సెంటర్‌కు వెళ్లడంతో దాన్ని పట్టుకున్నట్లు తెలిసింది. ముందు, తర్వాత రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. కేవలం ఒకటి, రెండు క్వారీల్లో సోదాలు చేయడం, నెలకు మొక్కుబడిగా కొన్ని కేసులు రాయడం మినహా ప్రధాన మార్గాలపై అధికార యంత్రాంగం దృష్టిసారించడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని