logo

నిర్లక్ష్యపు తూటా

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 తుపాకీ తూటాలను ఓ హెడ్‌కానిస్టేబుల్‌ ఆటోలో మరిచిపోయిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది

Published : 07 Feb 2023 06:09 IST

ఆటోలో మరిచిపోయిన 40 తూటాలు
ఏఆర్‌ సిబ్బంది నిర్లక్ష్యంపై ఎస్పీకి ఫిర్యాదు

శ్రీకాకుళం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 తుపాకీ తూటాలను ఓ హెడ్‌కానిస్టేబుల్‌ ఆటోలో మరిచిపోయిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముద్దాయిలను కోర్టుకు తీసుకువెళ్లే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తికి లభించడంతో వాటిని తిరిగి అప్పగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వేరే ఎవరి చేతికైనా చిక్కితే పరిస్థితి మరోలా ఉండేదని సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఏఆర్‌ పార్టీకి చెందిన కొందరు పోలీసు సిబ్బంది తమకు కేటాయించిన బందోబస్తు విధులను ముగించుకుని ఆదివారం తిరుగు ప్రయాణంలో ఆటోలో శ్రీకాకుళం నగరం వైపు వస్తున్నారు. ఈ క్రమంలో ఖాళీ మేగ్‌జైన్‌తో పాటు సుమారు 40 తూటాలను, పోలీసు యూనిఫాంతో కూడిన బ్యాగును ఆటోలో వదిలేసి ఆర్టీసీ కాంప్లెక్‌్్సలో దిగిపోయారు. అనంతరం బ్యాగును వెతుక్కుంటూ కంగారు పడ్డారు. వెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయంపై ఫిర్యాదు చేశారు. రెండు గంటల అనంతరం సదరు ఆటోడ్రైవర్‌ బ్యాగును గుర్తించి ఆర్టీసీ స్టేషన్‌ మేనేజరు శామ్యూల్‌కు అప్పగించారు. అందులో పరిశీలించగా 40 తూటాలు బయటపడ్డాయి. అంతకముందే ఆర్టీసీ కాంప్లెక్స్‌ను పోలీసులు జల్లెడ పట్టడం తెలుసుకున్న ఆయన రెండో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఒకటి, రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది వెళ్లి వాటిని స్వాధీన పర్చుకున్నారు. దీనిపై ఏఆర్‌ విభాగానికి చెందిన డీఎస్పీని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా తూటాలు పోయి తిరిగి దొరికాయని చెప్పారు. ఇప్పటికే ఈ ఉదంతంపై సోమవారం ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని