logo

Andhra News: ఒక్కటయ్యారు.. ఒక్కటిగానే వెళ్లిపోయారు!

మంగళవాయిద్యాలు ఇంకా మదిలోనే మోగుతున్నాయి. ఏడడుగుల నడిచిన క్షణాలు కళ్లముందే కదలాడుతున్నాయి.. ఆ మూడుముళ్ల వేళ కేరింతలు వినిపిస్తూనే ఉన్నాయి..

Updated : 14 Feb 2023 12:47 IST

రోడ్డు ప్రమాదంలో నవ దంపతుల దుర్మరణం

పెళ్లి దుస్తుల్లో వేణు, సుభద్ర దంపతులు

మంగళవాయిద్యాలు ఇంకా మదిలోనే మోగుతున్నాయి. ఏడడుగుల నడిచిన క్షణాలు కళ్లముందే కదలాడుతున్నాయి.. ఆ మూడుముళ్ల వేళ కేరింతలు వినిపిస్తూనే ఉన్నాయి.. ఆత్మీయుల ఆశీర్వాదాలు, స్నేహితుల సందడి... పచ్చని పందిరి సాక్షిగా ఒక్కటైన నవ దంపతులు.. ఆ మధుర క్షణాలను దాచుకుని వైవాహిక జీవితాన్ని గడపాలని భావించారు..   కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నడవాలని ఆశించారు.. కానీ..  ఆ కలలను తుంచేస్తూ, ఆ సంతోషాలను ఆవిరి చేస్తూ.. కాళ్లపారాణి ఆరకే ముందే వారి జీవన ప్రయాణానికి విధి ముగింపు పలికింది. ఇళ్లకు కట్టిన తోరణాలు వాడకముందే ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపేసింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఇద్దరినీ కబళించింది...

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: ఇచ్ఛాపురం నుంచి అత్తవారింటికి ఒడిశా రాష్ట్రానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న నవ దంపతులను సోమవారం సాయంత్రం ట్రాక్టరు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ మృతిచెందారు. ఈ ఘోర ఘటన ఇరు కుటుంబాలు, ఆత్మీయులందరికీ కంటతడి పెట్టించింది. ఇచ్ఛాపురంలో పట్టణంలోని బెల్లుపడ కాలనీలో ఉంటున్న గవలపు వేణు అలియాస్‌ సింహాచలం(26) రత్తకన్న వద్ద ఒక వస్త్రదుకాణంలో పనిచేస్తున్నాడు. ఇతనికి బ్రహ్మపురకు చెందిన సుభద్ర అలియాస్‌ ప్రవల్లిక(23)తో వివాహం జరిగింది. సింహాచలం క్షేత్రంలో ఈనెల 10న జరిగిన వేడుకల్లో బంధుమిత్రులందరూ పాల్గొన్నారు. అటునుంచి వచ్చి 12వ తేదీ (ఆదివారం) ఇచ్ఛాపురంలో విందు ఏర్పాటుచేశారు. అందరూ వచ్చి నవ దంపతులను ఆశీర్వదించారు. పెళ్లి వేడుకలు ముగిశాయని, అత్తవారింటి వెళ్లేందుకు సోమవారం ఇచ్ఛాపురం నుంచి ద్విచక్ర వాహనంపై వారిద్దరూ బయలుదేరారు. గొళంత్రా పోలీస్‌ ఠాణా పరిధిలో ఓ ట్రాక్టర్‌ వీరి బండిని బలంగా ఢీకొనడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. సుభద్ర అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రగాయాలైన వేణును బ్రహ్మపుర ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

కుప్పకూలిన కుటుంబ సభ్యులు: బ్రహ్మపురలో ఎదురుచూస్తున్న వధువు కుటుంబ సభ్యులు, ఇక్కడ వేణు కుటుంబ సభ్యులకు చేదు వార్త చెవిన పడింది. దీంతో వీరంతా కుప్పకూలారు. వేణు తండ్రి రామారావు గతంలోనే చనిపోయారు. అన్నయ్య, అక్క, అమ్మతో కలసి ఉంటున్నారు. అన్యాయం చేసి వెళ్లిపోయాడంటూ బోరున విలపిస్తున్నారు. నిన్నటివరకూ ఆనందంగా గడిపిన వారికి ఇలా జరుగుతుందని ఊహించలేదని కౌన్సిలర్‌ ప్రదీప్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ప్రమాదంపై గొళంత్రా (ఒడిశా) పోలీసులు కేసు నమోదు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని