logo

తాబేళ్ల మృత్యుఘోష!

అరుదైన సముద్ర తాబేళ్ల(ఆలివ్‌రిడ్లేల)కు రక్షణ కరవవుతోంది. రోజూ పదుల సంఖ్యలో కళేబరాలు జిల్లాలో తీరానికి కొట్టుకొస్తుండడమే ఇందుకు నిదర్శనం.

Updated : 27 Mar 2023 06:15 IST

అంతరించిపోతున్న అరుదైన జాతి
కాపాడే చర్యలు అంతంతమాత్రమే

అక్కుపల్లి తీరంలో ఆలివ్‌ రిడ్లే కళేబరం

వజ్రపుకొత్తూరు, న్యూస్‌టుడే: అరుదైన సముద్ర తాబేళ్ల(ఆలివ్‌రిడ్లేల)కు రక్షణ కరవవుతోంది. రోజూ పదుల సంఖ్యలో కళేబరాలు జిల్లాలో తీరానికి కొట్టుకొస్తుండడమే ఇందుకు నిదర్శనం. తీరం పొడవునా మృత్యువాత పడిన తాబేళ్లు కన్పిస్తున్నాయి. గుడ్లు పెట్టే కాలం కావడంతో తీరానికి వస్తూ మృత్యువాత పడుతున్నాయి. అంతంతమాత్రపు రక్షణ చర్యలతో ఈ ప్రకృతి నేస్తాలను కాపాడుకునే పరిస్థితి లేదు. వేగంగా అంతరించిపోతున్న జాతుల్లో ఉన్న వీటిని కాపాడుకోకపోతే పర్యావరణ సమతౌల్యానికీ ప్రమాదమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అనువైన తీరం: శ్రీకాకుళం జిల్లాలో 193 కి.మీ. సముద్ర తీరం ఉంది. విశాలమైన ప్రదేశం.. ఎత్తైన ఇసుక తిన్నెలున్నాయి. ఒడిశా తరువాత ఈ ప్రాంతం తాబేళ్ల సంతతి ఉత్పత్తికి అనువైంది. ఈ నేపథ్యంలో వేల కిలోమీటర్లు ప్రయాణించి రిడ్లేలు గుడ్లు పెట్టేందుకు ఇక్కడకు వస్తున్నాయి. గుడ్లు పెట్టి తిరిగి వెళ్లిపోతుంటాయి. వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, గార, సోంపేట, కవిటి మండలాల్లోని గుణుపల్లి, తోటూరు, అక్కుపల్లి, డోకులపాడు, వజ్రపుకొత్తూరు, కొత్తపేట, దేవునల్తాడ, బారువా, కపాసుకుద్ది, ఇసుకలపాలెం, భావనపాడు, కళింగపట్నం తదితర తీరాలకు ఇవి అధికంగా వస్తున్నాయి. ఏటా డిసెంబరు మొదలుకొని మార్చి చివరి వరకు రోజూ అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము సమయంలో రాకపోకలు సాగిస్తుంటాయి. తీరంలోని ఇసుక దిబ్బల్లో బొరియలు చేసి గుడ్లు పెడుతుంటాయి. ఈ రాకపోకల క్రమంలోనే ఇవి మృత్యువాతపడుతున్నాయి. ప్రతి సీజన్‌లో పెద్ద ఎత్తున మృతిచెందుతున్నాయి.  

ఇవీ కారణాలు

* సముద్ర తీరానికి సమీపం నుంచే మెకనైజ్‌డ్‌ బోట్లు, నిషేధిత వలల వినియోగంతో చేపలవేటకు దిగుతుండడం.

*  పెద్ద ఇంజిన్‌ బోట్లు నిబంధనలు అతిక్రమిస్తూ వేట సాగించడంతో ఇంజిన్లకు తగిలి తీవ్రంగా గాయపడుతున్నాయి.

*  నదులు, ఏర్లు ద్వారా కలుస్తున్న ప్లాస్టిక్‌, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలతో సముద్ర జలాలు కలుషితం కావడం.

*  తాబేళ్లు వస్తున్న కాలంలో తీరం నుంచి కొంత దూరం చేపలవేటకు నిషేధిత ప్రాంతంగా ప్రకటిస్తున్నా కొందరు పాటించకపోవడం.

ప్రాధాన్యం: సముద్రంలో ఆక్సిజన్‌ శాతం పెంచడంతో పాటు మత్స్యసంపద వృద్ధి చేయడంలో సముద్ర తాబేళ్లు కీలకపాత్ర పోషిస్తాయి. చేప గుడ్లను తినేసే జెల్లీ ఫిష్‌ని ఇవి తిని చేపల ఉత్పత్తి పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా సముద్రంపై ఆధారపడి జీవించే లక్షలాది మంది జీవనోపాధికి మేలు చేస్తున్నాయి. అంతటి ప్రాధాన్యమున్న వీటిని కాపాడుకోవాల్సి అవసరముంది.

అక్కుపల్లి తీరంలో తాబేలు కళేబరాన్ని పూడ్చుతున్న దృశ్యం


అందరి బాధ్యత: పలు కారణాలతో సముద్ర తాబేళ్ల కళేబరాలు ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. అందుకు అవసరమైన చర్యలు తీసుకుందాం. ఇందుకు అందరి సహకారం అవసరం.

నిషాకుమారి, జిల్లా అటవీశాఖాధికారి(అటవీ, మత్స్యశాఖ, వివిధ స్వచ్ఛంద సంస్థలతో శనివారం శ్రీకాకుళంలో నిర్వహించిన సమావేశంలో..)


స్వచ్ఛంద సంస్థల అంచనా ప్రకారం..

(వీటికి రెండింతలు మృతిచెందుతున్నట్లు మత్స్యకారులు అంటున్నారు. నివారణ చర్యలు లేకపోవడంతో ఏటా మరణాల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో ప్రధానంగా వజ్రపుకొత్తూరు, ఇచ్ఛాపురం, సోంపేట, సంతబొమ్మాళి, పోలాకి, గార, ఎచ్చెర్ల, శ్రీకాకుళం మండలాల సముద్ర తీరాల పరిధిలో తాబేళ్ల మృతి ఎక్కువగా ఉంది.)


ప్రత్యేక చర్యలు తీసుకుంటాం

తాబేళ్ల సంతతి పెరుగుదలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే పలు తీరాల్లో హేచరీలను ఏర్పాటు చేశాం. సంరక్షణ బృందాలను నియమించి వేల సంఖ్యలో గుడ్లను సేకరించి కాపాడుతున్నాం. అలాగే జిల్లా మత్స్యశాఖ అధికారులతో సమీక్షించి బోట్ల యాజమాన్యాలతో మాట్లాడి నష్ట నివారణ చర్యలు తీసుకుంటాం. అవసరమైతే వన్యప్రాణి చట్టం కింద క్రిమినల్‌ కేసులు పెడతాం.

మురళీకృష్ణం నాయుడు, అటవీ రేంజర్‌, కాశీబుగ్గ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు