logo

ఉక్కుపాదం మోపితే ఉద్యమం ఉద్ధృతం

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల ఉద్యమాలపై ఉక్కుపాదం మోపితే ఆగవని, మరింత ఉద్ధృతమవుతాయని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు అన్నారు.

Published : 27 Mar 2023 05:16 IST

ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు వ్యాఖ్య

మాట్లాడుతున్న వెంకటేశ్వరరావు, వేదికపై నాయకులు

పలాస, న్యూస్‌టుడే: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల ఉద్యమాలపై ఉక్కుపాదం మోపితే ఆగవని, మరింత ఉద్ధృతమవుతాయని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు అన్నారు. పలాస రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యూటీఎఫ్‌) 17వ జిల్లా కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోగా వారిపై ఒత్తిడి పెట్టి ఇతర పనులు చేయించుకునేలా చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో 30 వేల పాఠశాలలు ఉండగా.. 17 వేల పాఠశాలల్లో ఒక్కరే పాఠాలు భోదించే పరిస్థితి ఉంది. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామంటున్నారు. మరోవైపు విలీనం పేరిట మూసేస్తున్నారు. ప్రతి నెల ఒకటో తేదీ నాటికి ఉద్యోగులు, పింఛనుదారులకు జీతాలు అందడం లేదని’ వెంకటేశ్వరరావు విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్‌.శర్మ, యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వర్లు, కార్యదర్శి చౌదరి రవీంద్ర, కార్యవర్గ సభ్యులు బి.చిట్టిబాబు, ఎల్‌.వి.చలం, జి.కోదండరావు, కె.రమేష్‌, టి.అప్పారావు, ఎస్‌.వి.రమణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


అధ్యక్షుడు అప్పారావు, కార్యదర్శి కిషోర్‌కుమార్‌

కార్యవర్గ ఎన్నిక: ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (యూటీఎఫ్‌) జిల్లా అధ్యక్షుడిగా పి.అప్పారావును ఎన్నుకున్నారు. పలాసలో ఆదివారం నిర్వహించిన 17వ కౌన్సిల్‌ జిల్లా సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. జిల్లా గౌరవాధ్యక్షుడిగా కె.వైకుంఠరావు, సహాయ గౌరవాధ్యక్షులుగా ఎల్‌.బాబూరావు, బి.ధనలక్ష్మి, అధ్యక్షుడిగా పి.అప్పారావు, ప్రధాన కార్యదర్శిగా ఎస్‌.కిశెర్‌కుమార్‌, కోశాధికారిగా బి.శ్రీరామమూర్తి, 15 మందిని కార్యదర్శులుగా, తొమ్మిది మందిని రాష్ట్ర కౌన్సిలర్లుగా ప్రతిపాదించి బలపరిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని