logo

పలాసలో ప్రత్యేక స్పందన

పలాస పురపాలక సంఘం సమావేశ మందిరంలో బుధవారం ప్రత్యేక రెవెన్యూ స్పందన కార్యక్రమం నిర్వహించారు.

Published : 30 Mar 2023 03:33 IST

ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న జేసీ నవీన్‌కుమార్‌, చిత్రంలో మంత్రి అప్పలరాజు

పలాస, న్యూస్‌టుడే: పలాస పురపాలక సంఘం సమావేశ మందిరంలో బుధవారం ప్రత్యేక రెవెన్యూ స్పందన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి సీదిరి అప్పలరాజు, జేసీ నవీన్‌ వినతులు స్వీకరించారు. పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాలతో పాటుగా పురపాలక సంఘానికి చెందిన భూ సమస్యలు, ఆక్రమణలపై 135 ఫిర్యాదులు అందాయి. నియోజకవర్గంలో పలుచోట్ల గతంలో ఆక్రమణలు జరిగాయని మున్సిపల్‌ కౌన్సిలర్లు, వైకాపా నాయకులు, ఇటీవల కాలంలో భూ ఆక్రమణలు చోటు చేసుకున్నాయని తెదేపా నాయకులు ఫిర్యాదు చేశారు. వినతులు ఇచ్చేందుకు వందలాది మంది రావడంతో సమావేశ మందిరం కిక్కిరిసిపోయింది. కార్యక్రమంలో ఆర్డీవో సీతారామ్మూర్తి, తహసీల్దార్లు ఎల్‌.మధుసూదన్‌, బి.పాపారావు, బి.అప్పలస్వామి, కాశీబుగ్గ సీఐ జి.శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.


‘నిరూపిస్తే రాజకీయాలు విరమిస్తాను’

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: తాను ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఆక్రమించానని నిరూపిస్తే రాజకీయాలు విరమిస్తానని మంత్రి అప్పలరాజు సవాల్‌ విసిరారు. పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ ప్రత్యేక స్పందన కార్యక్రమంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తనపై ఆరోపణలకు ఆధారాలుంటే రుజువు చేయాలన్నారు. తాడివాడ, బెండికొండలు తాను రాజకీయాల్లోకి రాకముందే కరిగించేశారని పేర్కొన్నారు. నల్లబొడ్లూరు కొండను ఉద్దానం ప్రాంతీయులకు ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం చదును చేశామని చెప్పారు. ఉండ్రుకుడియా కొండ గ్రావెల్‌ అనుమతులు రద్దు చేసినట్లు వివరించారు. ప్రత్యేక స్పందనలో ఎక్కువగా తెదేపా నాయకుల ఆక్రమణల గురించే ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని