logo

100 రోజులు పని కల్పించలేమా?

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జాబ్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వంద రోజుల పాటు పని కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు.

Published : 31 Mar 2023 06:13 IST

శ్రీకాకుళం గ్రామీణ మండలం శిలగాం సింగువలసలో ఉపాధి పనులను పరిశీలిస్తున్న పీడీ చిట్టిరాజు

న్యూస్‌టుడే, కలెక్టరేట్(శ్రీకాకుళం): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జాబ్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వంద రోజుల పాటు పని కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. జిల్లాలో గతేడాది కుటుంబానికి సగటున 60 రోజులు మాత్రమే పని చూపగలిగారు. సగటు వేతనం అందుకోవడంలోనూ జిల్లా గతేడాది కంటే వెనుకబడింది. కేంద్ర ప్రభుత్వం గరిష్ఠ వేతనం రూ.257 వరకు ఇచ్చేందుకు అనుమతిచ్చినప్పటికీ మనం కనీసం రూ.200 కూడా దాటలేకపోతున్నాం. ఇదంతా చూస్తుంటే భవిష్యత్తులోనైనా వంద రోజుల పని కల్పించగలరా అనే ప్రశ్న ఉదయిస్తోంది.

ఉపాధి హామీ పథకం వేతనదారులకు సగటు వేతనం అంతంత మాత్రంగానే అందుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో అది రూ.188.12కే పరిమితమైంది. గతేడాది ఇదే సమయానికి చూస్తే సగటు వేతనం రూ.197.25 అందుకున్నారు. అధికారులు విస్తృతంగా పర్యటనలు చేసి అవగాహన కల్పించినప్పటికీ ఫలితం కనిపించ లేదు. క్షేత్ర, సాంకేతిక సహాయకులు, ఏపీవోల మధ్య సమన్వయం లోపం కారణంగానే ఈ పరిస్థితి ఎదురైందనే విమర్శలు వస్తున్నాయి.

క్రమంగా పడిపోతూ..

జిల్లాలో గత అయిదేళ్లలో సగటు వేతనం రూ.200 దాటింది ఒకే ఒక్క ఏడాది మాత్రమే. 2020-21లో రూ.220 వరకు వెళ్లింది. ఆ తర్వాత రోజుల్లో బాగా కిందకు పడిపోయింది. ఈ పరిస్థితి వచ్చిందనే కారణాలను కూడా అన్వేషించకపోవడంతో రెండేళ్లుగా కనీసం రూ.200 సగటు వేతనం కూడా అందుకోలేకపోతున్నాం.


సిబ్బంది సమన్వయంతో పని చేయాలి...
- జి.వి.చిట్టిరాజు, డ్వామా పీడీ, శ్రీకాకుళం

జిల్లాలో గతేడాది ఆగస్టు పదో తేదీ నాటికి సగటు వేతనం రూ.171.92గా ఉండేది. వేతనదారులకు అవగాహన కల్పించి దాన్ని రూ.188.12కు తీసుకెళ్లగలిగాం. క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కొంత ఉన్నప్పటికి వేతనదారులు కూడా పనులకు వచ్చి నిర్ణీత సమయం కంటే త్వరగా వెళ్లిపోతుంటంతో ఎక్కువ రావడం లేదు. సిబ్బంది సమన్వయంతో పని చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. విధులు సక్రమంగా నిర్వర్తించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించాం. ఈ ఏడాదిలో మెరుగైన వేతనం అందించేందుకు కృషి చేస్తాం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని