logo

బరితెగింపు..!

పాలబంద చెరువు సర్వే నంబరు 129లో 5.27 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీనిని ఆనుకుని ఉన్న పాలపోలమ్మ తల్లి దేవాలయానికి వెళ్లే సీసీ రహదారికి ఆనుకొని ఉన్న రూ.లక్షల విలువైన ప్రభుత్వ...

Published : 31 Mar 2023 06:13 IST

ఆమదాలవలసలో ఆగని ఆక్రమణల పర్వం
రాత్రికి రాత్రే వెలిసిన బడ్డీలు
న్యూస్‌టుడే, ఆమదాలవలస పట్టణం

పాలబంద చెరువుకు ఆనుకొని ఇదే స్థలంలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు

పాలబంద చెరువు సర్వే నంబరు 129లో 5.27 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీనిని ఆనుకుని ఉన్న పాలపోలమ్మ తల్లి దేవాలయానికి వెళ్లే సీసీ రహదారికి ఆనుకొని ఉన్న రూ.లక్షల విలువైన ప్రభుత్వ భూమిలో కొందరు బడ్డీలు, దుకాణాలు ఏర్పాటు చేస్తూ కబ్జాలకు తెరలేపారు. చెరువును ఆనుకుని పాకలు వేసిన విషయమై ఇటీవల ‘ఈనాడు’లో కథనాలు ప్రచురితం కావడంతో రెవెన్యూ అధికారులు వాటిని తొలగించి, చెరువు గర్భం, ప్రభుత్వ స్థలం అని హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. అయినా వీటిని బేఖాతరు చేస్తూ బుధవారం అర్ధరాత్రి వేళ ఇనుప రేకులతో తయారు చేసిన ఏడు బడ్డీలను ఏర్పాటు చేశారు. అయినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. కొందరు అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల అండతో ఇలా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బడ్డీల ఏర్పాటుకు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు చెబుతున్నారు.

చెరువు వద్ద అక్రమాలపై ఫిబ్రవరి 17న ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనం

అధికారం ఉందనే అండో.. అడిగేవారెవరనే బరితెగింపో.. ఆమదాలవలస పట్టణంలో ఆక్రమణలు మాత్రం ఆగలేదు.. అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా, ప్రభుత్వ స్థలమని ప్రకటించినా భయపడలేదు.. ఎవరేం చేస్తారులే అన్నట్లుగా యథేచ్ఛగా స్థలాలను కబ్జాచేసేస్తున్నారు... రూ.లక్షల విలువైన ప్రభుత్వ భూమిలో పాగా వేస్తున్నారు.. అక్రమ పర్వానికి  ఉదాహరణ పాలబంద చెరువే.. కొందరి స్థానిక నాయకుల అండతోనే ఇదంతా  జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


చోద్యం చూస్తున్నారు...

ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదు. పట్టణంలో జరుగుతున్న ఆక్రమణలపై పలుమార్లు తహసీల్దారు, మున్సిపల్‌ కమిషనర్‌లకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, కమిటీలతో కాలయాపన చేస్తున్నారే తప్ప చేసేది ఏమీ లేదని పేర్కొన్నారు.

ఏర్పాటు చేసిన బడ్డీలు


తొలగించకుంటే దీక్షలు చేస్తాం..
- పేడాడ రామ్మోహనరావు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, ఆమదాలవలస

పురపాలిక పరిధిలోని ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటిని కాపాడాలని, దానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపితే తప్ప ఆక్రమణల పర్వం ఆగదు. బడ్డీలను తొలగించకుంటే జనసేన తరఫున కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం. అప్పటికీ తొలగించకుంటే ఆక్రమణలు జరిగేచోటే నిరాహార దీక్షలు చేపడతాం.


చట్టపరంగా చర్యలు
- ఎస్‌.గణపతిరావు, తహసీల్దార్‌, ఆమదాలవలస

పాలబంద చెరువు వద్ద నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేవు. ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. పరిశీలించి ఆక్రమణలు తొలగిస్తాం. కొన్ని చోట్ల అక్రమణలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు వచ్చిన వెంటనే సిబ్బందిని పంపించి ఆక్రమణలు తొలగించి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వ స్థలాలు, చెరువు గర్భాల్లో ఎవరైనా నిర్మాణాలు, ఆక్రమణలు చేపడితే ఊరుకోం. ఉన్నతాధికారులకు తెలియపరిచి, రెవెన్యూ, మున్సిపల్‌ యంత్రాంగం సంయుక్తంగా వాటిని తొలగిస్తాం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని