logo

పెద్దల భోగం... పేదలే ఫలహారం..!

పోర్టు నిర్వాసితులకు నౌపడ సమీపంలో నిర్మించే కాలనీ కోసం సేకరిస్తున్న భూమిలో అధికార పార్టీ నాయకుల ఆస్తులకు మినహాయింపు ఇస్తున్నారనే  విమర్శలు వినిపిస్తున్నాయి.

Published : 31 Mar 2023 06:19 IST

భావనపాడు పోర్టు భూసేకరణలో సమిధలవుతున్న రైతులు
న్యూస్‌టుడే, టెక్కలి, సంతబొమ్మాళి

టెక్కలి గ్రామసభలో భూములు ఇవ్వబోమంటూ రైతుల నిరసన

పోర్టు నిర్వాసితులకు నౌపడ సమీపంలో నిర్మించే కాలనీ కోసం సేకరిస్తున్న భూమిలో అధికార పార్టీ నాయకుల ఆస్తులకు మినహాయింపు ఇస్తున్నారనే  విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధి కుటుంబసభ్యుడికి  6 ఎకరాలు ఉండగా, దాన్ని విడిచిపెట్టి దాని పక్కనున్న పేదల భూమిని సేకరిస్తున్నారు. ఎకరాకు రూ.26 లక్షలు ఇవ్వనున్నారు. పక్కనున్న భూములు ఎకరా రూ.1.5 కోట్లకు అధికార పార్టీకి చెందిన నేతలు అమ్మకానికి పెట్టారు.


జాతీయ రహదారి నుంచి మోదుగవలస, బన్నువాడ, వేములవాడ, తలగాం మీదుగా పోర్టు అనుసంధాన రోడ్డు ఏర్పాటుకు అధికారులు ప్రకటన జారీ చేశారు. దీనిపై నిర్వహిస్తున్న గ్రామసభల పైనే విమర్శలు వస్తున్నాయి. ముందురోజు సాయంత్రం గ్రామసభను ప్రకటించి దాన్ని రద్దు చేసి ఏ సమాచారం లేకుండా తర్వాత రోజు ఉదయం టెక్కలిలో గ్రామసభ నిర్వహించారు. అయినా అక్కడికి చేరుకున్న రైతులు భూసేకరణను వ్యతిరేకించారు. సాయంత్రం బన్నువాడలో నిర్వహించిన గ్రామసభలో టెక్కలిలో రైతులు భూసేకరణకు ఒప్పుకున్నారని అధికారులు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు.


భావనపాడు పోర్టు కోసం నర్సిపురం నుంచి బూరగాం మీదుగా రోడ్డు నిర్మాణానికి గతేడాది ఏప్రిల్‌లో భూసేకరణ ప్రకటన ఇచ్చారు. అధికార పార్టీలో ఓ నాయకుడికి చెందిన భూమి అందులో పోతుందని అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో మార్గాన్నే మార్చేశారు.


పోర్టు కోసం ప్రతిపాదించిన పాత, కొత్త రహదారుల రేఖా చిత్రం

..వడ్డించేవాడు మనవాడైతే బంతిలో చివర ఉన్నా లోటుండదన్న నానుడి పోర్టు భూసేకరణలో కనిపిస్తోంది. ముందస్తుగా అధికారుల ఆలోచనలు, ప్రణాళికలను అధికార పార్టీ నేతల ముందుంచి వారి ప్రయోజనాలకు అనుగుణంగా మార్పులు చేస్తూ ముందుడుగు వేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మూలపేట నిర్వాసిత కాలనీలకు నౌపడ కూడలిలో సేకరిస్తున్న భూమిలో నెలకొన్న తీరే స్థానిక రైతుల్ని కలచివేస్తోంది.


ఊరికో మాట.. వ్యక్తికో ఎర..!

భూసేకరణకు గ్రామసభలు నిర్వహిస్తున్న అధికారులు రైతుల్ని తప్పుదారి పట్టిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాత నౌపడలో భూసేకరణకు రైతులంతా ఆమోదించారని అధికారులు చెబుతున్నారు. అయితే ధర తేల్చకుండా తామెవరం అంగీకరించబోమని రైతులు సభ నుంచి వెళ్లిపోయారు. తలగాంలో రైతులు భూసేకరణకు అంగీకరించారని అధికారులు చెబుతున్నారు. రూ.60 లక్షలు ఎకరాకు ఇవ్వకుంటే భూములిచ్చేది లేదని రైతులు సమావేశంలో తేల్చి చెప్పారు. టెక్కలి, బన్నువాడ గ్రామసభల్లో భూసేకరణను వ్యతిరేకించారు. మరోవైపు అధికారులు భూముల మార్కెట్‌ ధరలు నిర్ణయిస్తూ ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నారు. భూములు కోల్పోతున్న రైతుల వివరాలు గ్రామసభల్లో తెలపకుండానే ఇదంతా నడిపిస్తున్నారు.


మారిటోరియం బోర్డు కోరిందే చేస్తున్నాం
- రాహుల్‌కుమార్‌రెడ్డి, సబ్‌కలెక్టర్‌, టెక్కలి

భావనపాడు పోర్టు కోసం చేస్తున్న భూసేకరణలో రోడ్డు సహా ఇతర ప్రతిపాదనలన్నీ మారిటోరియం బోర్డు సర్వే చేసి గుర్తించింది. అందుకనుగుణంగానే రైతులతో సంప్రదించి వారి అంగీకారం పొంది ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ఇందులో ఎవరి ప్రయోజనాలు నెరవేర్చడం కోసం గాని, ఎవరి ప్రమేయంతో గాని కార్యాచరణ జరగడం లేదు. రైతులకు మా పరిధిలో ఉన్నంతవరకు న్యాయం చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని