logo

కరిగిపోతోంది తీరం..!

వంశధార నదికి వరదలొస్తే చాలు.. నదీతీర గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు ఉండని పరిస్థితి. అలాంటిది నదీ ప్రవాహం ఒకవైపు చేరుకొని గట్టు కరిగిపోతూ గ్రామం సమీపంలోకి చేరుతుంటే ఆ గ్రామస్థుల ఆవేదన వర్ణనాతీతం.

Published : 31 Mar 2023 06:22 IST

గ్రోయిన్లు నిర్మించాలని అంధవరం గ్రామస్థుల వేడుకోలు

గ్రామ సమీపానికి చేరుకున్న నదీ జలాలు, కోతకు గురవుతున్న గట్టు

జలుమూరు, న్యూస్‌టుడే: వంశధార నదికి వరదలొస్తే చాలు.. నదీతీర గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు ఉండని పరిస్థితి. అలాంటిది నదీ ప్రవాహం ఒకవైపు చేరుకొని గట్టు కరిగిపోతూ గ్రామం సమీపంలోకి చేరుతుంటే ఆ గ్రామస్థుల ఆవేదన వర్ణనాతీతం. ఏళ్లు గడుస్తున్నా గ్రోయిన్లు ఏర్పాటుచేయాలని గ్రామస్థులు కోరుతున్నా ఎలాంటి ప్రయోజనం లేదు. కరకట్ట నిర్మాణం చేపడతామని, దానిలోభాగంగా గ్రోయిన్లు నిర్మిస్తామని చెప్పిన అధికారులు ఏళ్లు గడిచినా ఇంతవరకు ఎలాంటివి  ఏర్పాటు చేయలేదు. జలుమూరు మండలంలోని అంధవరం వద్ద కిలోమీటరు దూరంలో ఉన్న నది, వరదలకు గట్టు కరిగిపోయి గ్రామానికి 20 మీటర్ల దూరానికి చేరుకుంది. మరో రెండు వరదలొస్తే గ్రామంలోకి నీరు చేరుకుంటుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంశధార నదికి వరదలు వచ్చే సమయంలో అధికారులు, పాలకులు వచ్చి హామీలు ఇచ్చి వెళ్లిపోతున్నారే తప్ప, చేసేది ఏమీ లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రోయిన్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.  


ప్రతిపాదనలు పంపించాం..
- ఎస్‌.హరీష్‌, ఏఈ కరకట్టల విభాగం

వంశధార ఎడమ కాలువ గట్టు వైపు గ్రామాల వద్ద గట్టు కరిగి గ్రామాల వైపు వెళుతున్న ప్రదేశాలు, చిన్నపాటి వరదలొచ్చినా  గ్రామాల్లోకి నీరు వెళుతున్న ప్రదేశాలను గుర్తించాం. ఈ పరిస్థితి మారాలంటే గ్రోయిన్లు నిర్మించాలని నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. రెండేళ్ల కిందట కలెక్టరు ప్రత్యేక నిధులు మంజూరు చేసినా గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో పనులు చేయలేకపోయాం. ఈ ఏడాది నిధులు మంజూరైన వెంటనే గ్రోయిన్ల నిర్మాణంతో పాటు, అవసరమైన చోట మట్టికట్టల ఏర్పాటుకు చర్యలు చేపడతాం.


అధికారులు స్పందించాలి...
- రాయవరపు లింగమూర్తి, అంధవరం

నా చిన్నప్పుడు వంశధార నది గ్రామానికి కిలోమీటరు దూరంలో ఉండేది. స్నానం చేసేందుకు అక్కడికి కాలినడకన వెళ్లేవాళ్లం. వరదల సమయంలో గ్రామం వైపు గట్టు కరిగిపోయి, చెట్లు కూలిపోయాయి. ప్రస్తుతం గ్రామానికి 20 మీటర్ల దూరానికి నది చేరుకుంది. మరో రెండు వరదలు వస్తే ఇళ్ల్ల వద్దకు నీరు వస్తుంది. దీనిపై అధికారులు స్పందించి గ్రామం ముందు గ్రోయిన్లు ఏర్పాటుచేస్తే ఏ సమస్య ఉండదు.


కంటిమీద కునుకు ఉండదు
- పైల పార్వతి, అంధవరం

ఒడిశా రాష్ట్రానికి ఎక్కువగా వర్షాలు కురిస్తే నదిలో నీటి ప్రవాహం పెరుగుతుంది. వరదలు ఎక్కువగా ఉంటే మా ఇంట్లోకి నీరొస్తుంది. వరదలు వస్తే కంటిమీద కునుకులేకుండా గడపాల్సిన పరిస్థితి. అధికారులు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి ఆదుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని