logo

కలుషితమవుతున్నా పట్టించుకోరా ?

శ్రీకాకుళం నగరంలోని మురుగు నీరు నాగావళి నదిలో చేరి జలాలు కలుషితమవుతున్నాయి

Published : 26 May 2023 05:50 IST

నాగావళి నదిలో కలిసిపోతున్న మురుగునీరు

అసంపూర్తి పనులతో దొరకని పరిష్కారం

న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం

వాంబేకాలనీ వద్ద అసంపూర్తిగా నిలిచిన మురుగునీటి నిల్వ బావి పనులు

శ్రీకాకుళం నగరంలోని మురుగు నీరు నాగావళి నదిలో చేరి జలాలు కలుషితమవుతున్నాయి. అలా మురుగు నేరుగా కలవకుండా శుద్ధి చేసి ఆ నీటిని నదిలో విడిచిపెట్టాలనే లక్ష్యంతో నగరపాలక సంస్థ ప్రజారోగ్యశాఖ ఆధ్వర్యంలో రూ.28.14 కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. 2018లో అమృత్‌ పథకంలో భాగంగా వాటిని ప్రారంభించారు. కొంతమేర జరిగిన తరువాత పనులు మధ్యలో నిలిచిపోయాయి. ఏళ్లు గడుస్తున్నా పునఃప్రారంభం జరగలేదు. ఎప్పటిలాగే రోజూ లక్షలాది లీటర్ల మురుగునీరు నేరుగా కాలువల ద్వారా నదిలో కలిసిపోతోంది.

శ్రీకాకుళం నగరంలోని మిర్తిబట్టితో పాటు ఆదివారంపేట నుంచి కలెక్టరేట్‌ వరకు నదికి ఓ వైపున ఉన్న ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీటి కాలువలను వాంబేకాలనీ వద్ద నిర్మించే మురుగు నీటి నిల్వ బావి(స్లంపు) వద్దకు చేర్చాలని భావించారు. అక్కడి నుంచి పైపులైను ద్వారా పొన్నాడ కొండ వద్ద నిర్మించే శుద్ధి కేంద్రానికి తరలించి.. అక్కడ మురుగునీటిని శుద్ధి చేసి అనంతరం నదిలో విడిచిపెట్టాలనుకున్నారు. దీంతో పాటు మురుగునీరు శుద్ధి చేయడం ద్వారా వచ్చిన వ్యర్థాలతో సేంద్రియ ఎరువులు తయారు చేయాలనే ఉద్దేశంతో మొదటి దశ పనులు మొదలుపెట్టారు. అవి పూర్తయితే రెండో దశలో నదికి రెండో వైపున ఉన్న గుజరాతీపేట, పి.ఎన్‌.కాలనీ పరిసర ప్రాంతాల మురుగునీటిని గుజరాతీపేట వద్ద మరో శుద్ధి కేంద్రం నిర్మించి అక్కడికి తరలించాలని అప్పట్లో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ మొదట దశ పనులే నిలిచిపోవడంతో రెండో దశకు అతీగతీ లేని పరిస్థితి నెలకొంది.

ఎన్జీటీ హెచ్చరించినా ఇంతే..

నాగావళి జలాలు కలుషితం కాకుండా చూడాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని గతేడాది జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పురపాలకశాఖ ఉన్నతాధికారులు జిల్లా ప్రజారోగ్యశాఖ ఇంజినీరింగ్‌ అధికారుల నుంచి పనులను సంబంధించిన నివేదికను తీసుకున్నారు. పనులు చేస్తామని ట్రైబ్యునల్‌కు చెప్పి ప్రభుత్వం తప్పించుకుంది. తరువాత పనుల విషయంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు.

మురుగునీటి నుంచి మోక్షం లేదు..

నదిలో నగరానికి చెందిన తాగునీటి పథకాలు, ఎచ్చెర్ల, శ్రీకాకుళం గ్రామీణ మండలాల పరిధిలోని పలు మంచినీటి పథకాల ఊటబావులున్నాయి. నదిలో కలిసిపోతున్న మురుగునీరు వాటిల్లో చేరి కలుషితమవుతున్నాయి. వేసవిలో నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో నది మురికి కూపంగా మారుతోంది. ఈ సమస్య పరిష్కారానికి నగరంలోని వాంబే కాలనీ వద్ద బావి(స్లంపు), పొన్నాడలో మురుగు నీటిశుద్ధి కేంద్రం ప్లాంట్‌ పనులు ప్రారంభించారు. అవి 25 శాతం జరిగిన తరువాత బిల్లులు చెల్లింపుల్లో జాప్యం జరగటంతో గుత్తేదారు పనులు నిలిపేశారు. తరువాత రూ.5.75 కోట్ల మేర బిల్లులు చెల్లించినా పనులు పూర్తి చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వం టెండరును రద్దు చేసింది. మళ్లీ ఇంతవరకు ప్రారంభించకపోవడంతో సమస్యకు పరిష్కారం దొరకడం లేదు.


కొత్త ప్రతిపాదనలు నివేదించాం..

పనులను పూర్తి చేసేందుకు గుత్తేదారు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం ఒప్పందం రద్దు చేసింది. మళీ కొత్తగా ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
పి.సుగుణాకరరావు, ప్రజారోగ్యశాఖ ఈఈ, శ్రీకాకుళం


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని