logo

ఎవరికీ పట్టని గిరిజన గోడు..

పాతపట్నం మండలంలో కిమిడి-రుగడ రహదారి నుంచి సోభ, సోద పంచాయతీలకు వెళ్లే దారి తీరిది.. 2018లో ఆరు కిలోమీటర్ల మేర అభివృద్ధికి రూ.20 లక్షలు మంజూరయ్యాయి.

Published : 30 May 2023 05:46 IST

కొండ దిగని హామీలు.. మార్గం చూపని పాలకులు
అత్యవసర పరిస్థితుల్లోనూ అవస్థలే

ఇది కొత్తూరు మండలంలో దిమిలి పంచాయతీ బొడ్డగూడ గ్రామానికి వెళ్లే రహదారి. 2018లో సుమారు రూ.60 లక్షల అంచనాతో రెండు కిలోమీటర్ల మేర దిమిలి నుంచి ఇప్పగూడ, బొడ్డగూడ మీదుగా బైదలాపురానికి వేయాల్సి ఉంది. తెదేపా హయాంలో కొంతమేర పనులు చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. కొండ ప్రాంతానికి వేసిన రోడ్డు భారీ వర్షాలకు కోతకు గురైంది. ఇక్కడ వంద కుటుంబాలు వైద్యం, రేషన్‌ సరకులకు ఇబ్బంది పడుతున్నాయి.

పాతపట్నం మండలంలో కిమిడి-రుగడ రహదారి నుంచి సోభ, సోద పంచాయతీలకు వెళ్లే దారి తీరిది.. 2018లో ఆరు కిలోమీటర్ల మేర అభివృద్ధికి రూ.20 లక్షలు మంజూరయ్యాయి. చిప్స్‌ వేసిన అనంతరం పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. 350 కుటుంబాలు రాకపోకలకు అవస్థలు పడుతున్నాయి.
న్యూస్‌టుడే, కొత్తూరు, మెళియాపుట్టి, పాతపట్నం, మందస

ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా గిరిజన ప్రాంతాల్లో కనీస మౌలిక వసతులు సమకూరడం లేదు.. గిరిజన గోడు ఎవరికీ పట్టలేదు. ఫలితంగా ప్రజలు అవస్థలు పడుతూ జీవనం సాగిస్తున్నారు.. తెదేపా హయాంలో కొన్ని రహదారుల నిర్మాణం పూర్తికాగా.. మరికొన్ని అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ప్రతిపాదనల దశలో కొన్ని ఆగిపోయాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక రోడ్ల విషయం పట్టించుకోవడంతో రాకపోకలకు కష్టాలు పడుతున్నారు. ఐటీడీఏ పరిధిలో కొన్ని గిరిజన మండలాల్లో రహదారుల దుస్థితిపై పరిశీలన కథనం.

కొత్తూరు, మెళియాపుట్టి, మందస, పాతపట్నం మండలాల పరిధిలో వందల సంఖ్యలో గిరిజన గ్రామాలు ఉన్నాయి. ముఖ్యంగా గిరిశిఖర ప్రాంతాల్లో ఉన్న పల్లెల ప్రజలు పైకి వెళ్లాలన్నా, కిందికి రావాలన్నా కొండంత కష్టాలే.. ఇక అత్యవసర పరిస్థితుల్లో రోగులను డోలీల్లో తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. గూడేల్లో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నా అగ్నిమాపక వాహనాలు చేరుకోలేవు. ఫలితంగా భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. రేషన్‌ సరకులు సైతం సక్రమంగా అందడం లేదు.
* నాలుగేళ్లలో 181 రహదారులను అభివృద్ధికి రూ.220 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. ఉపాధి హామీ పథకంలో రూ.103 కోట్లతో 79 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేశారు.

* మెళియాపుట్టి మండలం అడ్డివాడకు వెళ్లే మార్గం. ఈ గ్రామ ప్రజలు వైద్యం, రేషన్‌ సరకులు, ఇతర అవసరాలకు కాలినడకనే వెళ్లాలి. రెండున్నర కిలోమీటర్ల మేర నడిచి టెక్కలి-మెళియాపుట్టి రహదారికి చేరుకుంటున్నారు. 2017-18లో ఉపాధి పథకం రూ.80 లక్షలతో రహదారి నిర్మాణం చేపట్టారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టించుకోకపోవడంతో పనులు అర్ధాంతంగా నిలిచిపోయాయి. వర్షాలకు ఈ మార్గం ధ్వంసమైంది.


నిలిచిన పనులపై దృష్టి సారిస్తాం..

గిరిజన గ్రామాలకు వెళ్లే రహదారులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాం. కొత్తూరు, మెళియాపుట్టి, మందస, పాతపట్నం మండలాల్లో అర్ధాంతరంగా నిలిచిన పనులపై దృష్టి పెడతాం. ఆయా మండలాల ఏఈఈలకు తగిన ఆదేశాలు జారీ చేస్తాం. కొత్తగా ప్రతిపాదనలు రూపొందించి రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం.
జి.మురళి, ఈఈ, సీతంపేట ఐటీడీఏ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని