logo

విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ప్రత్యేక కార్యాచరణ

పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని సమగ్ర శిక్ష అదనపు పథకం సమన్వయాధికారి ఆర్‌.జయప్రకాష్‌ పేర్కొన్నారు.

Published : 30 May 2023 04:11 IST

 సమగ్ర శిక్ష ఏపీసీ జయప్రకాష్‌
 న్యూస్‌టుడే, కలెక్టరేట్(శ్రీకాకుళం)

పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని సమగ్ర శిక్ష అదనపు పథకం సమన్వయాధికారి ఆర్‌.జయప్రకాష్‌ పేర్కొన్నారు. కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో నాణ్యమైన విద్య అందించి ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లాను అగ్రగామిగా నిలుపుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా నాడు-నేడు పనులను వేగవంతం చేసేందుకు, జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీకి చేపడుతున్న చర్యలను ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో వివరించారు.  

ఆన్‌లైన్‌ విధానంలోనే ప్రవేశాలు...

కేజీబీవీలో ఆరో తరగతి, ఇంటర్‌ ప్రవేశాల ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలోనే జరుగుతుంది. 7, 8, 9 తరగతుల్లో మిగులు సీట్ల భర్తీకి కూడా దరఖాస్తులు ఆహ్వానించాం. 6వ తరగతిలో 1000కు గాను 731 సీట్ల భర్తీకి  రంగం సిద్ధం చేశాం. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ముందుగానే సీటు కేటాయిస్తాం. మిగిలినవి రెండో దశలో భర్తీ చేస్తాం. మొదటి ఏడాది ఇంటర్‌కు సంబంధించి వెయ్యి సీట్లు అందుబాటులో ఉన్నాయి.

జాప్యం లేకుండా నాడు-నేడు పనులు

పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనుల్లో జాప్యం జరగడానికి వీల్లేదు. దీనిపై ఇప్పటికే కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ సమీక్షించి పనులు     వేగవంతం చేయాలని ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా నిర్మాణాలు పూర్తయ్యేలా ఎంఈవోలు చొరవ చూపాలి. ఏ స్థాయిలో అలసత్వం ప్రదర్శించినా తప్పనిసరిగా చర్యలు ఉంటాయి.

మొదటి స్థానానికి చేరేలా ప్రణాళిక..

జిల్లాలో కేజీబీవీ విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో 83.25 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచారు. కొందరు పదిలో 590 మార్కులు, ఇంటర్‌లో 974 మార్కులు పొందారు. మరింత నాణ్యమైన విద్యను అందించి ఈసారి మొదటి స్థానానికి చేరుకునేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారుచేస్తున్నాం. సంవత్సరం ప్రారంభం నుంచే డైలీ ఆన్‌లైన్‌ టెస్ట్‌(డీవోటీ) విధానం అమలుచేయాలని నిర్ణయించాం. ఆ దిశగా నిపుణుల బృందం తయారుచేసిన ప్రణాళికను పక్కాగా అమలు చేస్తాం. పర్యవేక్షణకు సెక్టోరియల్‌ అధికారులను నియమిస్తాం. ప్రతీ 15 రోజులకోసారి నివేదికను రప్పించుకుని పరిశీలిస్తాం.

.కేజీబీవీల్లో వసతుల సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే నాడు-నేడు ద్వారా అదనపు తరగతి గదుల నిర్మాణాలు జరుగుతున్నాయి. తాగునీరు, ఇతర సమస్యలు తలెత్తకుండా చూస్తున్నాం. విద్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తాం. ఆ సమయంలో బోధనతో పాటు విద్యార్థులకు అందిస్తున్న భోజనం, వసతులు పర్యవేక్షిస్తాం. విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి వివరాలు తెలుసుకుంటాం. అలసత్వం వహించిన సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం.

మండలాలకు విద్యా కానుక కిట్లు

జగనన్న విద్యా కానుక కిట్లు పాఠశాలలు తెరిచే సమయానికి విద్యార్థులకు చేరేలా చర్యలు చేపడుతున్నాం. జిల్లాలో ఇప్పటికే మండలాల వారీగా రాత పుస్తకాలు 95.61 శాతం, ఏకరూప దుస్తులు 99 శాతం చేర్చాం.    అవసరమైన మేరకు బూట్లను కూడా సమకూరుస్తున్నాం.

భవిత కేంద్రాలకు పక్కా భవనాలు

జిల్లా వ్యాప్తంగా 30 మండలాల్లో భవిత కేంద్రాలు ఉన్నాయి. వాటిల్లో 13 మండల వనరుల కేంద్రాల్లోనూ, 17 పాఠశాలల్లోనూ నిర్వహిస్తున్నాం. ఆయా చోట్ల మొత్తం 587 మంది విభిన్న ప్రతిభావంతులు నమోదయ్యారు. పూర్తిస్థాయి వసతులతో త్వరలోనే కొత్త భవనాలను నిర్మిస్తాం. ఖాళీల భర్తీకి ప్రభుత్వానికి నివేదించాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని