logo

సమస్య పరిష్కరించాక అర్జీదారులకు ఫోన్‌ చేయాలి

స్పందనలో వినతులు ఇచ్చిన అర్జీదారులకు సమస్య పరిష్కరించిన తర్వాత దరఖాస్తుదారుడు సంతృప్తి చెందినదీ లేనిది ఫోన్‌ చేసి అడిగి తెలుసుకోవాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ అధికారులను ఆదేశించారు

Updated : 30 May 2023 05:44 IST

కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌

ఫిర్యాదులు పరిశీలిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, జేసీ నవీన్‌, శిక్షణ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా

కలెక్టరేట్(శ్రీకాకుళం),న్యూస్‌టుడే: స్పందనలో వినతులు ఇచ్చిన అర్జీదారులకు సమస్య పరిష్కరించిన తర్వాత దరఖాస్తుదారుడు సంతృప్తి చెందినదీ లేనిది ఫోన్‌ చేసి అడిగి తెలుసుకోవాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ అధికారులను ఆదేశించారు. జడ్పీ సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందనకు 155 వినతులు వచ్చాయి. కలెక్టర్‌, జేసీ ఎం.నవీన్‌, శిక్షణ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా తదితరులు వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును 24 గంటల్లో ఓపెన్‌ చేసి పరిష్కరించడమా, తిరస్కరించడమా అనే అంశాలపై వివరణ ఇవ్వాలన్నారు. తిరస్కరించినట్లయితే సరైన కారణాలను తెలియజేయాలని స్పష్టం చేశారు. స్పందన దరఖాస్తుల పరిష్కార విధానంపై ప్రతీవారం ప్రత్యేక బృందం ద్వారా ఆడిట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నేటికి 21 దరఖాస్తులు రీ ఓపెన్‌ అయ్యాయని తెలిపారు.

జూన్‌ 2న మెగా జాబ్‌ మేళా..

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జూన్‌ రెండో తేదీన మెగా జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ తెలిపారు. స్పందన కార్యక్రమంలో జాబ్‌ మేళా గోడ పత్రికను విడుదల చేసి కలెక్టర్‌ మాట్లాడారు. 16 స్థానిక, బహుళజాతి, ప్రైవేటు సంస్థల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. పదోతరగతి నుంచి పీజీ వరకు విద్యార్హత కలిగిన నిరుద్యోగ యువత మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

39 మందికి కారుణ్య నియామకాలు..

జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించినట్లు కలెక్టర్‌ లఠ్కర్‌ తెలిపారు. అర్హులైన 39 మందికి  జడ్పీ సమావేశం మందిరంలో నియామక పత్రాలు అందజేశారు.


సత్వరం స్పందించాలి

శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై సత్వరం స్పందించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎస్పీ జి.ఆర్‌.రాధిక పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమంలో ఎస్పీ స్వయంగా ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కుటుంబ తగాదాలు 5, మోసపూరిత సమస్యలు 4, ఆస్తి తగాదాలు 11, ఇతర ఫిర్యాదులు 14, పాతవి 4 మొత్తం 38 ఫిర్యాదులు వచ్చాయి. అదనపు ఎస్పీ టీపీ విఠలేశ్వర్‌, సెబ్ జేడీ వి.నాగమణికంఠ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని