logo

గిరిసీమలో 4జీ టవర్లు..!

జిల్లాలోని గిరిజన (మావోయిస్టు ప్రభావిత) ప్రాంతాల్లో 4జీ సేవలను విస్తృతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. యూనివర్సల్‌ సర్వీసెస్‌ అబ్లిగేషన్‌ ఫండ్‌ (యూఎస్‌వోఎఫ్‌)తో కేంద్ర ప్రభుత్వం మరికొన్ని టవర్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.

Updated : 02 Jun 2023 06:04 IST

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు

న్యూస్‌టుడే, అరసవల్లి:జిల్లాలోని గిరిజన (మావోయిస్టు ప్రభావిత) ప్రాంతాల్లో 4జీ సేవలను విస్తృతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. యూనివర్సల్‌ సర్వీసెస్‌ అబ్లిగేషన్‌ ఫండ్‌ (యూఎస్‌వోఎఫ్‌)తో కేంద్ర ప్రభుత్వం మరికొన్ని టవర్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే రహదారులు, ఆసుపత్రులు, పాఠశాలలను నిర్మించారు. తాగునీటి సదుపాయం కల్పించారు. సంకేతాలు అందని ప్రాంతాల్లో కొత్త టవర్లు వేసి ఇ-గవర్నన్స్‌, డిజిటల్‌ అనుసంధానతను మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నారు.

జిల్లాలో మూడు మండలాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలున్నాయి. అక్కడ ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌ ద్వారా 2జీ, 3జీ అంతర్జాల సేవలు అందుతున్నాయి. వీటితో పాటు మరికొన్ని ప్రైవేటు కంపెనీలకు చెందిన టవర్ల సిగ్నల్స్‌ ద్వారా ప్రస్తుతం సమాచారం అందుతోంది. వాటిలో 2జీ సేవలందిస్తున్న మెళియాపుట్టి మండలంలోని జోడూరు, నందిగాం సమీపంలోని సవరకరజాడ, నందిగాం, నర్సింగపల్లెలోని టవర్లను  4జీ సేవలకు అప్‌గ్రేడ్‌ చేయనున్నారు. ఇవికాక రాజకీయ నాయకులు,  ప్రజాప్రతినిధులు సిఫార్సు మేరకు  టెక్కలి, నందిగాంలో 2 చొప్పున, మెళియాపుట్టి,  కంచిలి, బూర్జ, ఎల్‌ఎన్‌పేట, కొత్తూరు ఒక్కోటి చొప్పున 9 కొత్త టవర్లు వేయనున్నారు. వీటికి అదనంగా మెళియాపుట్టిలో 11, మందస, హిరమండలం, కొత్తూరు, పాతపట్నం, టెక్కలి, నందిగాంలోనూ ఏర్పాటు చేయనున్నారు. కొద్దిరోజుల్లోనే పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.

వచ్చే మార్చిలోగా మరిన్ని..

జిల్లాలో ప్రస్తుతం 344 వరకు 2జీ, 3జీ టవర్లు సేవలందిస్తున్నాయి. 2జీ సేవలు అందిస్తున్న 229 టవర్లలో నాలుగింటిని 4జీకి మార్చనున్నారు. మిగిలినవాటి ద్వారా కూడా ఫేజ్‌ 9.2 కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 4జీ సేవలందించాలని చూస్తోంది. 3జీ సేవలందిస్తున్న 115 టవర్లను 4జీగా అభివృద్ధి చేయనున్నారు.

త్వరలో పనులు..

ఇప్పటికే జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 2జీ, 3జీ సేవలందిస్తున్నాం. కానీ మారుమూల చోట్లకు సంకేతాలు వెళ్లక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో యూఎస్‌వోఎఫ్‌ నిధులతో కొన్నిచోట్ల కొత్త టవర్లు ఏర్పాటు చేయనున్నాం. దీనిపై సర్కిల్‌ కార్యాలయం నుంచి సమాచారం అందింది. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి.

మర్రి నాయుడు, బీఎస్‌ఎన్‌ఎల్‌ డీజీఎం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని