logo

ఇంకెప్పుడు పనులు..?

వంశధార కాలువ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఆధునికీకరణ,  కనీస మరమ్మతులు లేక కాలువలన్నీ దయనీయంగా దర్శనమిస్తున్నాయి. ఫలితంగా శివారు ప్రాంతాల రైతులకు కష్టాలు తప్పడం లేదు.

Updated : 02 Jun 2023 06:05 IST

కాలువ మదుముపై షట్టర్లు లేని దృశ్యం

న్యూస్‌టుడే, నరసన్నపేట గ్రామీణం: వంశధార కాలువ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఆధునికీకరణ,  కనీస మరమ్మతులు లేక కాలువలన్నీ దయనీయంగా దర్శనమిస్తున్నాయి. ఫలితంగా శివారు ప్రాంతాల రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఖరీఫ్‌ నాటికి షట్టర్లు, మదుముల వద్ద మరమ్మతులు పూర్తి చేసి సాగునీరు అందిస్తామన్న అధికారుల మాటలు హామీలుగానే మిగిలిపోతున్నాయి.. షట్టర్లు శిథిలం కావడంతో వరదను నియంత్రించేందుకు అవకాశం లేకుండాపోతోంది. పంట పొలాలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

ఖరీఫ్‌లోనూ కష్టాల సాగే..

ప్రధానంగా జలుమూరు మండలంలోని అంధవరం గ్రామం నుంచి పోలాకి మండలం ప్రారంభం వరకు ఉన్న నరసన్నపేట పరిధిలోని వంశధార కాలువపై ఉన్న షట్టర్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. మరమ్మతులకు సైతం ప్రజాప్రతినిధులు మొగ్గుచూపడం లేదు. పోలాకి కాలువకు సంబంధించి నాలుగుచోట్ల, నరసన్నపేట చెరువు వెనక ఉన్న కాలువకు సంబంధించి రెండు చోట్ల, 22ఎల్‌ కోమర్తి కాలువకు రెండుచోట్ల, మూర్తిరాజు కాలువకు రెండుచోట్ల ఉన్న షట్టర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.

* పోలాకి కాలువకు బాలసీమ సమీపంలో ఉర్లాం కళింగుల వద్ద 1900లో ఏర్పాటు చేసిన షట్టర్లు, మదుములు శిథిలమయ్యాయి. కాలువలో నీటి ప్రవాహాన్ని నియంత్రించే వీలులేక వందల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. కాలువతో పాటు అనుబంధ కాలువల కింద 700 ఎకరాలకు సాగునీరు అందాలి. మదుములు, షట్టర్లు పాడవడంతో బడ్డవానిపేట, గోకయ్యవలస, కోమర్తి, యారబాడు, లింగాలపాడు శివారు ప్రాంతాల రైతులకు ఇబ్బందులు తప్పలేదు.  

* బాలసీమ, ఉర్లాం గ్రామాల్లో వందల ఎకరాల పంట పొలాలకు సాగునీరందించే చెరువు వెనుక కాలువ మదుముపై షట్టర్లు అధ్వానంగా మారాయి.

* బడ్డవానిపేట వద్ద పోలాకి కాలువతో పాటు 22ఎల్‌ కోమర్తి కాలువపై షట్టర్లు శిథిలమై కిందకు దించే వీలు లేక ఏటా దిగువ ప్రాంత రైతులు నిధులు సర్దుబాటు చేసుకుని సాగునీటి కష్టాలు తీర్చుకుంటున్నారు. 

* ఉర్లాం-జల్లువానిపేట గ్రామాల వద్ద ప్రవహించే మూర్తిరాజు కాలువకు రెండుచోట్ల షట్టర్లు లేవు. ఇక్కడ కూడా మదుములు శిథిలం కావడంతో నీరు దిగువ ప్రాంతాలకు వృథాగా పోతుంది.

ఎందుకీ పరిస్థితి..

వంశధార కాలువపై శిథిలస్థితికి చేరిన షట్టర్ల మార్పునకు 2008లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.58 కోట్లు మంజూరు చేసింది. పనులను మూడు గుత్తేదారు సంస్థలకు అప్పగించింది. ఇదే సమయంలో 2008లో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదనే ఆరోపణలు రావడంతో విజిలెన్స్‌ అధికారులు దాడులు చేశారు. ఇందులో భారీ అక్రమాలు జరిగినట్లు తేలడంతో అప్పట్లో 33 మంది అధికారులను సైతం సస్పెండ్‌ చేశారు. కేసును సీఐడీకి అప్పగించారు. ఏళ్లు గడుస్తున్నా కేసు ఇంకా కొనసాగడంతో షట్టర్ల ఏర్పాటుకు వీలుకాలేదు. రైతులకు అవస్థలు తప్పలేదు.

ఆర్థికంగా చితికిపోతున్నాం..

పోలాకి కాలువతో పాటు పలు కాలువలకు వందల ఏళ్ల కిందట నిర్మించిన మదుములు, షట్టర్లే ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో వీటిని పట్టించుకోకపోవడంతో అవి పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. వందల ఎకరాలకు సాగునీరందని దుస్థితి. శిథిలమైన షట్టర్లను మార్చే అవకాశం లేకపోవడంతో అవసరమైనప్పుడు నీరందకపోవడం, వరదల సమయంలో పొలాలు ముంపునకు గురవుతుండటంతో ఆర్థికంగా చితికిపోతున్నాం.

పండి కృష్ణారావు, రైతు, బడ్డవానిపేట

మరమ్మతులకు ప్రయత్నిస్తాం.. షట్టర్ల విషయం సీఐడీ, విజిలెన్స్‌ కేసుల్లో ఉండటంతో వాటికి సంబంధించి ఏం చేయలేకపోతున్నాం. ప్రస్తుతం ఉన్నత న్యాయస్థానంలో దీనిపై వాదనలు జరుగుతున్నాయి. త్వరలో పరిష్కారం దొరికితే సమస్యను ప్రభుత్వానికి నివేదిస్తాం. వచ్చే ఖరీఫ్‌ నాటికి మరమ్మతులు చేయించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.

బి.శ్రీహరి, డీఈఈ, వంశధార

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని