logo

అరకొర నీరు.. దాహమెలా తీరు?

పట్టణాల్లో దాహార్తి కేకలు వినిపిస్తున్నాయి.. గుక్కెడు నీళ్ల కోసం కుళాయిలు, బోర్ల వద్ద పానీపట్టు యుద్ధాలే జరుగుతున్నాయి.. ఏటా వేసవి వచ్చిందంటే చాలు ఇదే దుస్థితి..

Published : 03 Jun 2023 05:07 IST

పేరుకే పట్టణాలు..సరిపడా తాగునీళ్లూ దొరకని దయనీయం
ఏళ్ల తరబడి వేధిస్తున్నా పట్టించుకోని పాలకులు

ఆమదాలవలస: నందగిరిపేట ప్రధాన రహదారిపై నీటి కోసం మహిళల పాట్లు

పట్టణాల్లో దాహార్తి కేకలు వినిపిస్తున్నాయి.. గుక్కెడు నీళ్ల కోసం కుళాయిలు, బోర్ల వద్ద పానీపట్టు యుద్ధాలే జరుగుతున్నాయి.. ఏటా వేసవి వచ్చిందంటే చాలు ఇదే దుస్థితి.. సరిపడా నీళ్లు ఇవ్వలేక అధికారులు సైతం చేతులు ఎత్తేస్తున్నారు. ట్యాంకర్లతో కంటితుడుపు చర్యలు చేపడుతున్నారు.. మరికొన్నిచోట్ల కుళాయిల వద్ద నిరీక్షించలేక చాలామంది శుద్ధజల కేంద్రాలపై ఆధారపడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడమే తీవ్ర నీటి ఎద్దడికి కారణమనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం పన్నులు వసూలు చేయడంపై చూపుతున్న శ్రద్ధ కనీసం మౌలిక వసతులు కల్పించడంపై లేదని పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శ్రీకాకుళం నగరం, ఆమదాలవలస పట్టణం, పలాస, ఇచ్ఛాపురం


నాలుగైదు రోజులకోసారి..

రామలక్ష్మణ కాలనీలో తాగునీటి ఎద్దడి నివారణకు కౌన్సిలర్‌ తులసి అధికారులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో ఆమె భర్త, స్నేహితుల సహకారంతో బోరు తవ్వించారు. ఒక్కొక్కరు మూడు బిందెలు మాత్రమే నీళ్లు పట్టుకుని సహకరించాలని అక్కడ బోర్డు ఏర్పాటు చేశారు. జంట పట్టణాల్లో నీటి ఎద్దడి తీవ్రతకు ఇది దర్పణం పడుతోంది.


జంట పట్టణాల్లో శాశ్వత నీటి ప్రాజెక్టు లేదు. తాగునీటికి ప్రజలు బోర్లు, బావులు, చేతిపంపులపై ఆధారపడుతున్నారు. మొత్తం 8 ఎంఎల్‌డీ నీరు సరఫరా చేయాల్సి ఉండగా.. పారశాంబ గ్రామ సమీపంలోని ప్రైవేటు బోరు, చేతిపంపులు పవర్‌ బోర్ల ద్వారా 3 ఎంఎల్‌డీ నీరు సరఫరా చేస్తున్నారు. నాలుగైదు రోజులకోసారి పబ్లిక్‌, ఇంటింటి కుళాయిల ద్వారా నీరు సరఫరా చేస్తుండటంతో ఇబ్బంది తలెత్తుతోంది. ‘అవసరమైన ప్రాంతాల్లో ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తున్నామని’ పురపాలక సంఘం ఏఈ అవినాష్‌ తెలిపారు.


ఇచ్ఛాపురంలో సగమే ఇస్తున్నారు...

పురుషోత్తపురం బావి నుంచి నీరు సేకరిస్తూ..

ఇచ్ఛాపురంలో రోజుకు 5.10 మిలియన్‌ లీటర్ల నీరు సరఫరా చేయాలి. ప్రస్తుతం అందులో సగమే ఇస్తున్నారు. 1, 2, 3 వార్డులు, కుళాయిల ద్వారా పూర్తిస్థాయిలో నీరు అందని ప్రాంతాలకు ట్యాంకర్‌తో పంపుతున్నారు. పలు ప్రాంతాల్లో భూమట్టానికి మూడు నుంచి ఐదు అడుగుల లోతున ఉన్న కుళాయిల నుంచి ప్రజలు నీరు పట్టుకుంటున్నారు. పుర పరిధిలో 15 బోర్లు పని చేయడం లేదు. రత్తకన్న పరిధిలో వార్డులకు ప్రస్తుతం రెండు రోజులకు ఒకసారి నీరు సరఫరా అవుతోంది. ‘సమస్య పరిష్కారానికి నది ఆధారంగా రూ.58.48 కోట్లతో రక్షిత నీటి పథకాన్ని నిర్మిస్తున్నామని’ కమిషనర్‌ నల్లి రమేష్‌ వివరణ ఇచ్చారు.


ట్యాంకర్లే దిక్కు..

తాగునీటి పథక నిర్మాణానికి స్పీకర్‌ శంకుస్థాపన చేసిన శిలాఫలకం

ఆమదాలవలస పురపాలికలో తిమ్మాపురం, జగ్గుశాస్త్రులుపేట, పార్వతీశంపేట, గేదెలవానిపేట, కశింవలసపేట, రెడ్డిపేట, సొట్టవానిపేట, పంతులపేట, సప్తపురాలు, నందగిరిపేట, తురకపేట, టి.మన్నయ్యపేట, కె.మన్నయ్యపేట, కంచరవానిపేట, చింతాడ, చింతాడ ఎస్సీ కాలనీ, మెయిన్‌రోడ్డు ప్రాంతాల్లో కుళాయిలు లేక ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నారు. ఏఐఐబీ నిధులు రూ. 61.38 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి స్పీకరు తమ్మినేని సీతారాం ఏడు నెలల కిందట శంకుస్థాపన చేశారు. ఆయా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ‘ప్రధాన పైపులైన్లకు తరచూ పగుళ్లు ఏర్పడటంతో కొన్ని వార్డులకు సకాలంలో తాగునీరు అందించలేక పోతున్నాం. నీటి ప్రాజెక్టు పనులు పూర్తయితే అన్ని వార్డులకు పూర్తిస్థాయిలో తాగునీరు అందుతుంది’ అని కమిషనర్‌ ఎం.రవిసుధాకర్‌ పేర్కొన్నారు.


జిల్లా కేంద్రంలోనూ కటకటే..

నగరంలోని సీపన్నాయుడుపేట, భైరివానిపేట, పీఎన్‌ కాలనీ, దమ్మల వీధి, చౌదరి సత్యనారాయణ కాలనీ తదితర ప్రాంతాలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందటం లేదు. ఇటీవల నగరపాలికలో విలీనమైన జాడపేట, పెద్దపాడు, వానవానిపేట, తంగివానిపేట, శాస్త్రులపేట, పాత్రునివలస, చాపురం, తదితర కాలనీల్లో తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ‘నగరంతో పాటు విలీన ప్రాంతాలకు పూర్తిస్థాయిలో తాగునీరందించేందుకు రూ.116 కోట్లతో రూపొందించిన డీపీఆర్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నిధుల లభ్యత మేరకు పనులు చేపడతాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరులతో  నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నాం’ అని కమిషనర్‌ చల్లా ఓబులేసు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని