logo

కోట్లే.. కోట్లు

మూడు జిల్లాల్లో భారీగా పెరిగిన భూముల విలువ

Published : 03 Jun 2023 05:07 IST

ఈనాడు, విజయనగరం: ప్రభుత్వం ఆదాయం పెంపుపై దృష్టి సారించింది. భూముల క్రయ, విక్రయాలు, రిజిస్ట్రేషన్లే ప్రధాన ఆదాయ వనరు కావడంతో వాటి మార్కెట్‌ విలువ పెంచింది. ఈనెల ఒకటి నుంచి అమలు చేస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.825.39 కోట్ల ఆదాయం రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. విజయనగరం జోన్‌ పరిధిలో 13 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు ఉన్న శ్రీకాకుళం జిల్లా లక్ష్యం రూ.281.47 కోట్లు,  11 కార్యాలయాలు ఉన్న విజయనగరం జిల్లా లక్ష్యం రూ.460.64 కోట్లు, నాలుగు కార్యాలయాలు ఉన్న మన్యం జిల్లా లక్ష్యం రూ.83.27 కోట్లుగా పేర్కొంది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.490.38 కోట్లు కాగా, ఈసారి దాదాపు రెట్టింపుతో ఆ శాఖ యంత్రాంగానికి భారీ లక్ష్యం విధించింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో పది రోజుల కిందట నుంచే ఆయా జిల్లాల్లో కసరత్తు జరిగింది. అధికారులు రూపొందించిన జాబితాను ఆయా జిల్లాల సంయుక్త కలెక్టర్ల ఆమోదించిన తుది జాబితాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.


ప్రాతిపదిక ఏదైనా.. పెంపు ప్రధానం

* జిల్లాలో పైడిభీమవరం నుంచి ఆరు వరుసల రోడ్డు నిర్మాణం పూర్తయిన నరసన్నపేట వరకు జాతీయ రహదారికి ఇరువైపులా భూముల ధరలు పెంచారు. పైడిభీమవరంలో గజం రూ.1,300 నుంచి రూ.2 వేలకు, రూ.2,200 నుంచి రూ.3,500కు పెరిగింది. శ్రీకాకుళం వద్ద రోడ్డుకు ఇరువైపులా గజం రూ.4 వేలు నుంచి రూ.6 వేలకు, నరసన్నపేట వద్ద రూ.2,500 నుంచి రూ.3,500 వరకు పెంచారు.
* రోడ్ల పక్కన వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న వ్యవసాయ భూములనూ గుర్తించారు. రెవెన్యూ అధికారుల నుంచి అందులో ఉన్న నిర్మాణాల డోర్‌ నంబర్ల సహా తీసుకుని విలువ పెంచేశారు.
* అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి భోగాపురం మండలం అనువైనదని గుర్తించిన తర్వాత తొమ్మిదేళ్లుగా ఆ భూముల జోలికి పోలేదు. నాలుగు గ్రామాల పరిధిలో దాదాపు వంద శాతం వరకు భూముల విలువ పెంచేసింది.
* విమానాశ్రయ నిర్మాణ ప్రాంత పరిసర ప్రాంతాల్లో ఇప్పటి వరకు గజం రూ.1,800 ఉండగా రూ.4 వేలకు, భోగాపురం మండలంలో జాతీయ రహదారికి ఇరువైపులా గజం రూ.2,800 నుంచి రూ.4 వేలు, భోగాపురం మండల కేంద్రంలో రూ.3,200 నుంచి రూ.5 వేలు చేశారు.


కొన్ని ప్రాంతాల్లోనే...

అధికారికంగా అన్ని పత్రాలు పరిశీలించి, వాస్తవ విలువలను పరిగణనలోకి తీసుకుని శాస్త్రీయ అధ్యయనంతో మాదిరి లెక్కలేసి కొన్ని ప్రాంతాల్లోనే భూముల విలువను ప్రభుత్వం పెంచింది.  కొన్నేళ్ల నుంచి పెరగని భూములను ఎంపిక చేశాం.

 పి.విజయలక్ష్మి, స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ, విజయనగరం జోన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని