logo

చేద్దాం రండి సైకిల్‌పై సవారీ...!

జిల్లా కేంద్రంలో సైకిళ్లు విక్రయించే దుకాణాలు కొన్నేళ్ల కిందట 25 నుంచి 30 వరకు ఉండేవి. ప్రస్తుతం పది కంటే తక్కువే కొనసాగుతున్నాయి.

Published : 03 Jun 2023 05:07 IST

శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్డులో సైక్లిస్టులు

అప్పుడు.. సైకిల్‌.. దశాబ్దంన్నర కిందట వరకు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అన్నిరకాల పనులకు దానిపైనే ఆధారపడేవారు. రోడ్లపైన సైకిల్‌ సవారీలు ఎక్కువగా కనిపిస్తుండేవి. కొంతకాలం తరువాత సెలవు రోజుల్లో పిల్లలు సైకిల్‌ అద్దెకు తీసుకుని మరీ తొక్కి సరదా తీర్చుకునేవారు. దీని వల్ల తెలియకుండానే శారీరక, మానసిక ఆరోగ్యం పొందేవారు.


ఇప్పుడు.. సైకిల్‌ వినియోగం తగ్గిపోయింది. సామాన్య, మధ్యతరగతి ప్రజలు సైతం పూర్తిగా ద్విచక్రవాహనాలనే వాడుతున్నారు. ఇంధన ధరలు మండిపోతున్నా అలవాటు పడిపోవడంతో వినియోగించక తప్పడం లేదు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు మాత్రమే అరకొరగా ఉపయోగిస్తున్నారు. క్రమంగా సైకిల్‌ తొక్కితే కలిగే ప్రయోజనాలన్నింటికీ ప్రజలు దూరమైపోయారు. నేడు ‘ప్రపంచ సైకిల్‌ దినోత్సవం’ సందర్భంగా జిల్లాలోని పరిస్థితిపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం..


జిల్లా కేంద్రంలో సైకిళ్లు విక్రయించే దుకాణాలు కొన్నేళ్ల కిందట 25 నుంచి 30 వరకు ఉండేవి. ప్రస్తుతం పది కంటే తక్కువే కొనసాగుతున్నాయి. ఇతర పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. సైకిళ్ల వినియోగం తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని శ్రీకాకుళం నగరంలోని గాంధీ సైకిల్‌ షాప్‌ యజమాని కేశవ తెలిపారు. విద్యార్థులు కొంతైనా వాడుతుండటంతో ఈ రంగంలో ఉండగలుగుతున్నామని, లేకపోతే మరో వ్యాపకం చూసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. మరోవైపు సైకిల్‌, స్పేర్‌ పార్టుల ధరలు పెరిగాయి. ఒకప్పుడు రూ.3 వేలకు మంచి సైకిల్‌ వచ్చేది, ప్రస్తుతం రూ.6 వేలు నుంచి రూ.12 వేలు వరకు ధరలు ఉంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా రోజుకు సుమారు సగటున వంద సైకిళ్లు అమ్ముడవుతుంటాయని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన ఇతర స్పేర్‌ పార్టులతో కలిపి నెలకు సుమారు రూ.3 కోట్ల మేర వ్యాపారం జరుగుతుంది.

న్యూస్‌టుడే, పాతశ్రీకాకుళం


ఖర్చు ఆదా.. కాలుష్యం నియంత్రణ..

సైకిల్‌ వినియోగంతో పర్యావరణానికి ఎంతో మేలు చేయవచ్చు. దీంతో పాటు పెట్రోల్‌ వాడకం తగ్గి ఖర్చు ఆదాతో పాటు కాలుష్యం నియంత్రణ అవుతుంది. ఆపై ఆరోగ్య ప్రయోజనాలు ఉండనే ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 3 లక్షలకుపైగా ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. రోజులో చిన్నచిన్న పనులకు సైకిల్‌ను వినియోగిస్తే నెలలో కనీసం ఒక లీటర్‌ పెట్రోల్‌ ఖర్చు అయినా తగ్గించవచ్చు. అంటే జిల్లా మొత్తం మీద నెలకు మూడు లక్షల లీటర్ల పెట్రోల్‌ ఆదా చేయవచ్చు. అందుకే రెండు, మూడు కిలోమీటర్లు దూరంలోని కార్యాలయాలు, మార్కెట్ పనుల నిమిత్తం సైకిల్‌ను వినియోగిస్తే బాగుంటుంది.


ప్రయోజనాలు ఇలా..

* సైకిల్‌ తొక్కితే ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలో అడ్రినలిన్‌, ఎండార్పిన్‌ హార్మోన్లు విడుదలై మానసిక ప్రశాంతత లభిస్తుంది.* 40 ఏళ్లు వయసు  దాటిన వారికి మధుమేహం ఉంటే నియంత్రణలో ఉంచుతుంది.* గుండెకు మంచిది. తీవ్రమైన వ్యాధులు రాకుండా కాపాడుతుంది.* పిల్లల్లో మెదడు పనితీరు మెరుగుపడి రోగనిరోధక శక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.* వయస్సు మీద పడే ఛాయలు ఆలస్యంగా కనిపిస్తాయి.* బరువు తగ్గడంతో పాటు కండరాలు పటిష్టమవుతాయి.* అలసట వచ్చి హాయిగా నిద్ర పడుతుంది.


సహచరులను ప్రోత్సహిస్తున్నా.. నేను గడిచిన పదేళ్లుగా నిత్యం సైకిల్‌ తొక్కుతున్నాను. ప్రస్తుతం ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడానికి అదే కారణమని అనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో స్నేహితులతో కలిసి సైక్లింగ్‌ క్లబ్‌ ఏర్పాటు చేసి సహచరులను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నాను.

కాపవరపు సీజు, శ్రీకాకుళం


ఎన్నో రుగ్మతలకు మంత్రం.. సైకిల్‌ తొక్కేవారు శారీరకంగానే కాకుండా మానసికంగానూ దృఢంగా ఉంటారు. గంట పాటు సైకిల్‌ తొక్కితే 780 కేలరీలు ఖర్చవుతాయి. ప్రత్యేకించి స్థూలకాయులు, వృద్ధులు, ఆస్టియో ఆర్థరైటిస్‌ ఉన్నవారికి సైక్లింగ్‌ చాలా ఉత్తమం. అనేక రుగ్మతలకు మంత్రంగా ఉపయోగపడుతుంది.

డా.అన్నెపు అశోక్‌కుమార్‌, జనరల్‌ ఫిజీషియన్‌, శ్రీకాకుళం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని