logo

తప్పుల తడకలు..తప్పని అవస్థలు

ప్రజా ప్రయోజనం కోసం ప్రభుత్వం ఓ కార్యక్రమం తలపెడితే గతం కన్నా మరింత పారదర్శకంగా, పక్కాగా రూపొందించాలి. రూ.వందల కోట్లు ఖర్చు చేసిన తర్వాత ఫలితాలు రాకపోతే ఆ నిధులన్నీ బూడిదలో పోసిన పన్నీరుగానే మిగులుతాయి.

Published : 06 Jun 2023 04:46 IST

లోపభూయిష్టంగా సమగ్ర భూసర్వే
ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు
న్యూస్‌టుడే, రణస్థలం, జలుమూరు, కోటబొమ్మాళి, బూర్జ, కలెక్టరేట్‌(శ్రీకాకుళం)

పట్టాదారు పాసుపుస్తకం

ప్రజా ప్రయోజనం కోసం ప్రభుత్వం ఓ కార్యక్రమం తలపెడితే గతం కన్నా మరింత పారదర్శకంగా, పక్కాగా రూపొందించాలి. రూ.వందల కోట్లు ఖర్చు చేసిన తర్వాత ఫలితాలు రాకపోతే ఆ నిధులన్నీ బూడిదలో పోసిన పన్నీరుగానే మిగులుతాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భూసర్వే ప్రక్రియ అలాగే ఉంది. గతంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని చేపట్టిన కార్యక్రమం మరిన్ని కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. నాలుగేళ్లుగా సాగుతున్న సమగ్ర భూసర్వే పూర్తయ్యి ప్రస్తుతం జారీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాలు తప్పులతడకగా మారాయి. దీంతో పాసు  పుస్తకాలు పొందిన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

ఇంటిలో కుటుంబ పెద్ద పేరున ఉన్న భూమి, అతని సమ్మతి మేరకు వారి వారసులు, ఇతర హక్కుదారులకు పట్టాదారు  పుస్తకాలు తయారుచేసి సమగ్రంగా అందజేస్తామన్న ప్రభుత్వం ఉద్ధేశం నెరవేరేటట్లు లేదు. దీంతో భూసర్వే ప్రక్రియ ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థమవుతుంది. పాత సర్వే నంబర్లతో పక్కనే ఎల్పీ నంబర్లు వేసి వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం కింద పట్టాదారు పాసుపుస్తకాలు అందజేస్తున్నారు. దీంతో ఈ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. ఇదిలాఉండగా మే 29 నాటికి జిల్లా వ్యాప్తంగా 30 మండలాల్లో 380 గ్రామాల్లో భూసర్వే పూర్తయింది. 1,18,364 పట్టాదారు  పుస్తకాలు ముద్రించారు. 1,11,928 పాసుపుస్తకాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

అన్నీ 9 అంకెలే..!

జలుమూరు మండలంలోని కరవంజ పంచాయతీ మట్టవానిపేటకు చెందిన ముద్దాడ కన్నయ్య అనే రైతుకు ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకంలో ఆధార్‌, చరవాణి నంబర్లకు బదులుగా అన్నీ 9 అంకెలే నమోదయ్యాయి. తనకున్న భూమిలో కొంతభాగం  తన తల్లి పేరిట నమోదైందని, తల్లికి ఇచ్చిన వాటా భూమి, సోదరుడి భార్య పేరిట నమోదైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ ప్రధాన లోపాలు..!

అధికారులను కలిసినా ఫలితం లేదు

బూర్జ మండలం డొంకలపర్తకు చెందిన రైతు గుమ్మడి రామినాయుడు పేరుతో ఉన్న 1.49 ఎకరాల భూమికి రీసర్వే చేపట్టారు. అనంతరం అధికారులు ఇచ్చిన హక్కుపత్రంలో 1.32 ఎకరాలు ఉన్నట్లు పేర్కొన్నారు. 17 సెంట్లు భూమి తక్కువ చూపారని, అది ఏమైందని పలుమార్లు అధికారులను కలిసినా ఫలితం లేదని ఆ రైతు వాపోతున్నారు.

50 సెంట్లు ఉంటే 1.26 ఎకరాలా...

శ్రీకాకుళం గ్రామీణ మండలం ఒప్పంగికి చెందిన చిన్నాల ఇల్లయ్య భూహక్కు పత్రంలో ఉన్నదాని కంటే అదనంగా భూమి వివరాలు నమోదయ్యాయి. 50 సెంట్లు భూమి ఉండగా 1.26 ఎకరాలుగా నమోదైంది. ఒకచోట 20 సెంట్లు, వేరే చోట 30 సెంట్లు విడివిడిగా భూమి ఉందని అయినా పట్టాదారు పాసుపుస్తకంలో వివరాలు తప్పుగా ఉన్నాయని రైతు వాపోతున్నారు.

కొందరికి అదనం... మరికొందరికి తక్కువ..!

రణస్థలం మండలం వేల్పురాయిలో పంపిణీ చేసిన పట్టదారు పాసుపుస్తకాల వివరాలు గజిబిజిగా ఉన్నాయి. ఇప్పిలి వాణి అనే మహిళకు 3.85 ఎకరాల భూమి ఉంది. సర్వే అనంతరం ప్రస్తుతం ఆమెకు జారీ చేసిన భూహక్కు పత్రంలో 13.5 ఎకరాలు  నమోదైంది. ఇతరుల భూమిని ఇందులో కలిపేసి 9.65 ఎకరాలు అదనంగా నమోదు చేశారు. బాలి శారదాకుమారికి 1.21 ఎకరాల భూమి ఉండగా 0.95 సెంట్లే నమోదైంది. గ్రామంలో పలువురు రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. ఎక్కువ ఉన్న వాళ్లకు తక్కువ, తక్కువ ఉన్నవాళ్లకి ఎక్కువ భూమి ఉన్నట్లు    వివరాలు నమోదయ్యాయని వారంతా వాపోతున్నారు.

ఎకరాకుపైగా తక్కువ నమోదు

కోటబొమ్మాళికి చెందిన రైతు బలగ కృష్ణారావుకు ఇచ్చిన పాసుపుస్తకంలో సుమారు ఎకరాకు పైగా భూమి నమోదు కాలేదు. ఖాతా సంఖ్య 300తో ఉన్న ఈ పుస్తకంలో 8(1సి)లో 64 సెంట్లు, 9(13)లో 5 సెంట్లు, మరో 45 సెంట్లు నమోదులో పొరపాటు జరగడంతో రైతు లబోదిబోమంటున్నారు. దీనిపై గతనెల 10న జిల్లా కలెక్టర్‌కు స్పందనలో ఫిర్యాదు చేశారు. కొద్దిరోజుల క్రితం సమస్యను టెక్కలి సబ్‌కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో మరో 20 మంది రైతుల   పాసుపుస్తకాల్లోను ఈ సమస్యే ఉన్నట్లు ఆయన చెప్పారు.

పొరపాట్లు ఉంటే సరిచేస్తాం

భూహక్కు పత్రాలు పరిశీలించి పొరపాట్లు ఉంటే సరిచేసి అందిస్తాం. స్పందనకు వచ్చిన వాటిని వెంటవెంటనే పరిశీలించి సరి చేస్తున్నాం. వెబ్‌ల్యాండ్‌ 2.0 కొత్తగా తయారుచేశాం. మ్యుటేషన్‌ మాదిరిగా వాటిలో దరఖాస్తు చేసుకుంటే   పరిష్కరిస్తాం. తప్పుడు ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. వాస్తవ ఫిర్యాదులపై తక్షణం చర్యలు తీసుకుంటాం.

ఎం.నవీన్‌, సంయుక్త కలెక్టర్‌, శ్రీకాకుళం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని