logo

ఇక్కడ.. ఆత్మలు పనిచేస్తున్నాయట...!

సంతబొమ్మాళి మండలంలోని మర్రిపాడు గ్రామంలో ఎప్పుడో చనిపోయిన వారి ఆత్మలు వచ్చి అక్కడ ఉపాధి పనులు చేశాయట. ఐదేళ్లు, మూడేళ్లు, రెండేళ్లక్రితం చనిపోయినవారు ఇటీవల జరిగిన పనుల్లో పాల్గొన్నారట.

Published : 06 Jun 2023 04:46 IST

మర్రిపాడులో మృతిచెందిన వారికీ ఉపాధి బిల్లులు
విదేశాల్లో ఉన్నోళ్లకూ కూలి సొమ్ము చెల్లింపు
న్యూస్‌టుడే, సంతబొమ్మాళి

మర్రిపాడులో చేపడుతున్న ఉపాధి పనులు (పాత చిత్రం)

సంతబొమ్మాళి మండలంలోని మర్రిపాడు గ్రామంలో ఎప్పుడో చనిపోయిన వారి ఆత్మలు వచ్చి అక్కడ ఉపాధి పనులు చేశాయట. ఐదేళ్లు, మూడేళ్లు, రెండేళ్లక్రితం చనిపోయినవారు ఇటీవల జరిగిన పనుల్లో పాల్గొన్నారట. విదేశాల్లో  పనులకు వెళ్లినవారు రోజూ ఇక్కడికి వచ్చి పనులు చేస్తున్నారట. ఇదెలా సాధ్యమని అనుకుంటున్నారా.... సంతబొమ్మాళి మండలంలోని మర్రిపాడు గ్రామంలో ఉపాధి పథకం కింద జరుగుతున్న పనుల్లో చోటుచేసుకున్న దారుణాలు చూస్తే ఎవరైనా అవునని అనాల్సిందే. ఇక్కడి వేతనదారుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఉపాధి సిబ్బంది భారీగా అక్రమాలకు పాల్పడ్డారనడానికి ఎన్నో ఉదాహరణలు.

* మర్రిపాడు పంచాయతీ చిన్నమర్రిపాడు గ్రామానికి చెందిన గిన్ని చిట్టమ్మ 2017 డిసెంబర్‌లో మృతి చెందింది. కానీ, 2021-22, 2022-23లో 20058 జాబుకార్డుతో ఆమె ఉపాధి పనులకు వచ్చి చెరువు పనులు చేసినట్లు చూపుతూ ఆమె బ్యాంకు ఖాతాలో రూ.వేలు నగదు జమ చేశారు.

* మర్రిపాడు గ్రామానికి చెందిన బుట్ట కాంతమ్మ 2021 నవంబర్‌లో మృతి చెందింది. 020208 జాబు కార్డు నంబరుతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో రెండు వారాలు, 2022-24 ఆర్థిక సంవత్సరాల్లో 5 రోజులు పని చేసినట్లు రికార్డులో నమోదు చేశారు.

మర్రిపాడులో ఉపాధి పథకం కింద చేపట్టిన పనుల్లో విదేశాల్లో ఉన్నవారికి బిల్లులు చెల్లిస్తున్నారు. వలస వెళ్లకుండా స్థానికంగా ఉండేవారికి, పని కావాలని చుట్టూ తిరుగుతున్న వారికి పని కల్పించాల్సిన అధికారులు విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారి పేరిట ఉపాధి కల్పించినట్లు చూపి రూ.లక్షల్లో అక్రమాలకు తెర లేపారు.

పనికి వెళ్లని వారి ఖాతాల్లో జమ

గ్రామంలో 856 జాబ్‌కార్డులు ఉన్నాయి. 2020-21లో రూ.75.45 లక్షలు, 2021-22లో రూ.65.22, 2022-23లో 71.25 లక్షలు వేతనాల రూపంలో చెల్లించారు. మర్రిపాడు, చిన్నమర్రిపాడు, శెలగపేట గ్రామాల వెలుపల ఉన్నవారి పేరిట మస్తర్లు నమోదు అవుతున్నాయి. పనికి వెళ్లని వారికి కొంత సొమ్ము ఇచ్చి మిగిలిన మొత్తాన్ని క్షేత్ర సహాయకుడు తీసుకుంటున్నారని వేతనదారులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమాలు బయటపడినా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదు.

* చిన్నమర్రిపాడు గ్రామానికి చెందిన జనపాన ధనం నాలుగేళ్లుగా ఉపాధి పనులు చేస్తోంది. అయినా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఆమె బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. ఆమెకు పడాల్సిన నగదు అదే గ్రామానికి చెందిన ఉపాధి పనులకు వెళ్లని ఓ మహిళ ఖాతాలో జమవుతున్నాయి. దీనిపై పలుమార్లు బాధితురాలు  క్షేత్ర సహాయకుడిని ప్రశ్నించినా సాంకేతిక సమస్యని తప్పించుకున్నారే తప్ప, పరిష్కరించలేదు.   1902 నంబరుకు కాల్‌ చేసి గ్రామంలో ఉపాధిపనుల్లో జరిగిన అక్రమాలు వివరించారు.

విచారణకు ఆదేశించాం

మర్రిపాడు పంచాయతీలో జరిగిన ఉపాధి పనుల్లో మృతి చెందిన వేతనదారులకు మస్తర్లు వేసినట్లు నా దృష్టికి వచ్చింది.  టెక్కలి డ్వామా ఏపీడీ మురళీకృష్ణను విచారణ చేయమని ఆదేశించాం. తప్పు తేలితే క్షేత్ర సహాయకులపై చర్యలు ఉంటాయి.

చిట్టిరాజు, డ్వామా పీడీ, శ్రీకాకుళం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని