logo

పోలీసు ఇంట్లోనే దొంగలు పడ్డారు

సామాన్యులు మోసపోతే పోలీసులను ఆశ్రయిస్తారు. అలాంటిది పోలీసు ఇంట్లోనే దొంగలు పడిన ఘటన జిల్లా కేంద్రంలో సోమవారం వెలుగు చూసింది.

Published : 06 Jun 2023 04:46 IST

ఏడున్నర తులాల బంగారు ఆభరణాల చోరీ

వేలిముద్రలు సేకరిస్తున్న క్లూస్‌టీం

శ్రీకాకుళం నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: సామాన్యులు మోసపోతే పోలీసులను ఆశ్రయిస్తారు. అలాంటిది పోలీసు ఇంట్లోనే దొంగలు పడిన ఘటన జిల్లా కేంద్రంలో సోమవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం నగరం శాంతినగర్‌ కాలనీకి చెందిన హరి ఏసీబీ సీఐగా నగరంలోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల 3న సారవకోట వెళ్లారు. ఊరు వెళ్లే ముందు పెరట్లోని ఇనుప గ్రిల్స్‌కు తాళం వేయడం మరిచిపోయారు. తలుపు సైతం సరిగా వేయకపోవడంతో దుండగులు దర్జాగా లోపలికి వెళ్లారు. బెడ్‌ రూంలో బీరువా తాళాలు కనిపించడంతో దాన్ని తెరిచి అందులోని ఏడున్నర తులాల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. సోమవారం ఉదయం తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి పెరట్లోని తలుపులు తీసి ఉండటంతో చోరీ జరిగిందని తెలుసుకున్నారు. విషయం తెలియగానే క్లూస్‌ టీం వచ్చి వేలిముద్రలు సేకరించారు. హరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రెండో పట్టణ సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. ఒడిశాకు చెందిన వ్యక్తులే చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేవారంతా ఎల్‌హెచ్‌ఎంస్‌(లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టం)ను వినియోగించుకోవాలని సీఐ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని