logo

సూర్యదేవా.. పుణ్యస్నానం చేయలేమా?

ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లికి సుదూరప్రాంతాల నుంచి నిత్యం భక్తులు వస్తుంటారు. సూర్యదేవుడి సన్నిధిలోని ఇంద్ర పుష్కరిణిలో స్నానమాచరించి స్వామిని దర్శించుకుంటే పాపాల నుంచి విముక్తి లభిస్తుందని, ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని  విశ్వాసం.

Published : 07 Jun 2023 06:35 IST

నిధులు ఉన్నా ప్రారంభం కాని పుష్కరిణి పనులు
మూడు నెలలుగా భక్తులకు తప్పని ఇబ్బందులు
న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం

నీరు లేక ఖాళీగా ఉన్న ఇంద్ర పుష్కరిణి

ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లికి సుదూరప్రాంతాల నుంచి నిత్యం భక్తులు వస్తుంటారు. సూర్యదేవుడి సన్నిధిలోని ఇంద్ర పుష్కరిణిలో స్నానమాచరించి స్వామిని దర్శించుకుంటే పాపాల నుంచి విముక్తి లభిస్తుందని, ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని  విశ్వాసం. ఇంతటి ప్రాధాన్యమున్న పుష్కరిణి ఆధునికీకరణ పనుల పేరుతో అధికారులు మూడు నెలల క్రితం అందులోని నీటిని ఆఘమేఘాలపై ఇంజిన్ల సాయంతో తోడేశారు.  ఇంతవరకు ఏ పనులు చేపట్టలేదు. దీంతో రద్దీ సమయాల్లో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.

ఆదిత్యాలయానికి ప్రతి రోజు 3-4 వేల మంది, ఆదివారాల్లో 10 వేల మంది, ప్రత్యేక పర్వదినాల్లో 30 నుంచి 40 వేల మంది భక్తులు వస్తుంటారు. మాఘమాసం, రథసప్తమి వంటి ప్రత్యేక రోజుల్లో రద్దీ విపరీతంగా ఉంటుంది. జిల్లాతో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ నుంచి వేలాదిగా  తరలివస్తారు. వారిలో ఎక్కువ మంది స్వామికి తలనీలాలు సమర్పించడం, పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించడం, స్నానాలు చేయనివారు అందులో కాళ్లు, చేతులు,   ముఖం శుభ్రం చేసుకొని ఆ నీటిని తలపై చల్లుకుంటారు. మహిళలు పసుపు, కుంకుమ పుష్కరిణిలో వేసి దీపాలు వెలిగిస్తారు. ఇప్పుడు ఆ నీటిని తోడేయడంతో పుష్కరిణి వెలవెలబోతోంది. ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో తాత్కాలికంగా కుళాయిలు ఏర్పాటుచేశారు. వాటినుంచి వస్తున్న అరకొర నీటితోనే కాళ్లు, చేతులు శుభ్రం చేసుకోవాల్సి వస్తోంది.

నిర్వహణ లోపంతో శిథిలావస్థకు..

ఆలయాధికారులు పుష్కరిణి నిర్వహణను విస్మరించడంతో అందులో వ్యర్థాలు, పూడిక నిండిపోయాయి. చుట్టూ ఏర్పాటుచేసిన మెంట్‌ రక్షణ గోడలు కూలిపోయాయి. మెట్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. గతంలో పుష్కరిణి వెనకభాగాన ఏర్పాటుచేసిన సిమెంటు మదుము నుంచి పంట కాలువ ద్వారా పుష్కరిణిలోకి నీరు రావటం, మరో మదుము ద్వారా   నీరు కాలువలోకి వెళ్లిపోయేది. ఆ మదుముల నిర్వహణను విస్మరించడంతో పాటు, పంట కాలువ చుట్టూ ఇళ్లు వెలియడంతో మురుగు కాలువగా మారిపోయింది. క్లోరినేషన్‌ చేయక నీరు రంగు మారి భక్తులు స్నానాలు చేసేందుకు వీల్లేకుండా పోయింది.

కొరవడిన అధికారుల సమన్వయం

ఇంద్ర పుష్కరిణి పనుల విషయంలో మొదటి నుంచి ఆలయ సిబ్బంది, సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగాల మధ్య సమన్వయం కొరవడి ఖర్చు విషయంలో స్పష్టత రాలేదు. వాస్తవానికి ఏదైనా పని చేపట్టే ముందు అక్కడి పరిస్థితులను పరిశీలించి  అంచనాను రూపొందించాలి. ఆమేరకు సంబంధిత శాఖ ఉన్నతాధికారుల అనుమతి తీసుకొని పనులు చేపట్టాలి. అప్పుడు అవి  సకాలంలో జరిగి లక్ష్యం నెరవేరుతుంది. కానీ ఇంద్ర పుష్కరిణి అభివృద్ధి విషయంలో అలా జరగకపోవడంతో జాప్యం జరుగుతోంది. పుష్కరిణి చుట్టూ కాంక్రీటు గోడ, అడుగుభాగాన 80 శాతం గచ్చు, మెట్లు, బారీకేడ్ల నిర్మాణం, భక్తులు స్నానాలు చేసేందుకు అనువుగా తీర్చిదిద్దాలని ఏడాది   క్రితమే అధికారులు నిర్ణయించారు. ఆ పనులకు రూ.2 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. అయితే ఆ నిధులు సరిపోవని భావించి దేవస్థానం నిధులు అదనంగా మరో రూ.2 కోట్లు కేటాయించి మొత్తం రూ.4 కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఆ మేరకు పాలకమండలి, దేవాదాయశాఖ అనుమతులు తీసుకొని టెండర్లు పిలిచారు. అది ఖరారు కాగానే పుష్కరిణిలో నీరు బయటకు తోడేసి ఖాళీ చేశారు. తీరా పనులు చేపట్టేందుకు గుత్తేదారు సిద్ధపడేసరికి గతంలో రూపొందించిన ప్రతిపాదనలు సరిగా లేవనే అంశం తెరపైకి వచ్చింది.


ఇవన్నీ జరిగేదెప్పుడో?

పుష్కరిణి పనులకు సంబంధించి మళ్లీ కొత్త ప్రతిపాదనలు తయారుచేసి ఉన్నతాధికారులకు నివేదించిన తరువాత పనులు చేపట్టాలని నిర్ణయించారు. కానీ ఇంతవరకు ఆ దిశగా ఒక్క అడుగూ పడలేదు. కొత్త ప్రతిపాదనలు ఎప్పుడు రూపుదిద్దుతాయో, వాటికి ఆమోదం ఎప్పుడు లభిస్తుందో, పనులు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి. మరోవైపు వర్షాకాలం ప్రారంభం కానుంది. ఆ సమయంలో పనులు చేపట్టినా ఉపయోగం లేదు. కార్తికమాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజున వైభవంగా ఏడాదికోసారి నిర్వహించే తెప్పోత్సవం నాటికైనా ఆధునికీకరణకు నోచుకుంటుందో, లేదో చూడాలి.


ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం

ఇంద్ర పుష్కరిణి పనులకు సంబంధించి టెండరు ప్రక్రియ పూర్తయింది. గతంలో తయారుచేసిన ప్రతిపాదనలను రద్దు చేశాం. వాటి స్థానంలో కొత్తవి సిద్ధం చేస్తున్నాం. అవి పూర్తయిన తరువాత ఉన్నతాధికారులకు   నివేదిస్తాం. వారి అనుమతి లభించిన వెంటనే పనులు ప్రారంభిస్తాం.
వి.హరిసూర్యప్రకాష్‌,ఆలయ ఈవో, అరసవిల్లి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని