logo

మేము సైతం.. చంద్రన్న కోసం

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌ను నిరసిస్తూ తెలుగు తమ్ముళ్ల నిరసనలు హోరెత్తుతున్నాయి.

Published : 24 Sep 2023 04:03 IST

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌ను నిరసిస్తూ తెలుగు తమ్ముళ్ల నిరసనలు హోరెత్తుతున్నాయి. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో శనివారం ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుకు సంఘీభావంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తమ నాయకుడికి అండగా మేము సైతం అంటూ కదం తొక్కారు.


చంద్రబాబుకు అండగా నిలవాలి..

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని  తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా కాశీబుగ్గలో రైతుల ఆధ్వర్యంలో 11వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.2 వేలకు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కుట్రపూరిత చర్యలను ప్రజలంతా వ్యతిరేకించాలని కోరారు. ‘బాబుతో నేను’ సంతకాల సేకరణ బోర్డుపై మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ సంతకం చేశారు. 

 న్యూస్‌టుడే, పలాస


తప్పుడు కేసులు ఉపసంహరించుకోవాలి..

చంద్రబాబుకు న్యాయం జరగాలని కోరుతూ ఇచ్ఛాపురం ఆర్టీసీ బస్టాండు వద్ద తెదేపా శ్రేణులు చేపడుతున్న ధర్మదీక్షలు 11వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడారు. విదేశాల్లో సైతం చంద్రబాబుకు మద్దతుగా పోరాటాలు జరుగుతున్నాయని.. అధికార పార్టీ నాయకులకు మాత్రం కనిపించడం లేదని మండిపడ్డారు. తమ నాయకుడిపై పెట్టిన తప్పుడు కేసులు ఉపసంహరించుకోవాలని నినదించారు.  

 న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం


   ముమ్మాటికీ అక్రమ అరెస్టు..

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టును నిరసిస్తూ మందస మండలం హరిపురంలో బాబుతో నేను కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నియంత పాలన గురించి వివరించారు. చంద్రబాబుది ముమ్మాటికీ అక్రమ అరెస్టు అంటూ ధ్వజమెత్తారు. తెదేపా మండలాధ్యక్షుడు బి.దుర్యోధనరావు ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  

న్యూస్‌టుడే, మందస

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని