logo

పురపాలికలో పడకేసిన పారిశుద్ధ్యం

సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక పారిశుద్ధ్యం మెరుగుపడిందని అధికార పార్టీ నాయకులు ఊదరగొడుతున్నారు.

Published : 24 Sep 2023 04:03 IST

న్యూస్‌టుడే, పలాస: సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక పారిశుద్ధ్యం మెరుగుపడిందని అధికార పార్టీ నాయకులు ఊదరగొడుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. పలాస-కాశీబుగ్గ పురపాలికలో పారిశుద్ధ్య కార్మికుల కొరత కారణంగా ఎక్కడికక్కడ వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. పుర పరిధిలో 31 వార్డులు ఉన్నాయి. వీటిలో 13 వరకు గ్రామీణ ప్రాంతాలు. ఆయా వార్డుల్లో వారానికి ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే చెత్త సేకరణ చేపడుతున్నారు. సచివాలయ శానిటేషన్‌ సెక్రటరీ, పుర సూపర్‌వైజరు సమన్వయంతో ప్రతి వార్డులో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాల్సి ఉంది. కానీ, ఒక్క వార్డులో కూడా పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య పనులు జరగడం లేదు.

యంత్రం వస్తేనే చెత్త తొలగింపు

కార్మికుల కొరతతోపాటు పలువురు విధులకు గైర్హాజరు కావడంతో వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పొక్లెయిన్‌ సహాయంతో చెత్త తరలిస్తున్నారు. అది కూడా ఒక్కటే ఉండటంతో చెత్త తరలింపులో జాప్యం ఏర్పడుతోంది. ఫలితంగా ఆయా వార్డుల శివారు ప్రాంతాల్లో వ్యర్థాలు పడేస్తున్నారు. పలాస పట్టణంలో ఎస్టీ వసతిగృహం, జగన్నాథసాగరం, ఉదయపురం శివారులో చెత్త నిల్వలు దర్శనమిస్తున్నాయి. కంపాక్ట్‌ వాహనం అందుబాటులో ఉన్నప్పటికీ అది పెద్దదిగా ఉండటంతో ప్రధాన రహదారుల్లో మాత్రమే చెత్త తరలించేందుకు ఉపయోగిస్తున్నారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం జరిగే వార్డుల్లో హడావిడిగా పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

సిబ్బంది కొరత..

పురపాలిక పారిశుద్ధ్య విభాగంలో శాశ్వత ఉద్యోగులు 13, తాత్కాలిక ఉద్యోగులు(ఆప్కాస్‌) 74, సచివాలయ కార్యదర్శులు 11, ఒక శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఉన్నట్లు దస్త్రాల్లో చూపిస్తున్నారు. కానీ, చెత్త సేకరణ తీరు చూస్తుంటే కార్మికుల లేమి స్పష్టంగా కనిపిస్తోంది. 16 సచివాలయాలకు 11 మంది కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. మహిళా కార్మికులు చెత్తను ఊడ్చటం తప్ప కాలువల్లో పూడిక, రోడ్లకు ఇరువైపుల పనికిరాని మొక్కలు తొలగించడం లేదు.

మరమ్మతులకు పంపించాం..

పాత కంపాక్ట్‌ వాహనాన్ని మరమ్మతులకు పంపించాం. కొత్త వాహనం ఎత్తు ఎక్కువగా ఉండటంతో ప్రధాన రహదారుల్లో చెత్త తరలింపునకు వినియోగిస్తున్నారు. మరమ్మతులు పూర్తయిన తర్వాత  పూర్తిస్థాయి పారిశుద్ధ్య పనులు జరిగేలా చర్యలు తీసుకుంటాం.

 టి.నాగేంద్రకుమార్‌, కమిషనర్‌, పలాస-కాశీబుగ్గ పురపాలకసంఘం

పర్యవేక్షణ చేపడుతున్నాం..

వార్డుల వారీగా సచివాలయ కార్యదర్శులతో రోజూ పర్యవేక్షణ చేపడుతున్నాం. చెత్తను డంపింగ్‌ యార్డ్‌కు తరలించేలా వారు ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్ది రోజుల్లో మరో కంపాక్ట్‌ వాహనం రానుంది. దీంతో చెత్త సేకరణ మెరుగుపడనుంది.

శివలక్ష్మి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం

పలాస ఎస్టీ విద్యార్థుల వసతిగృహం పక్కనే పడేస్తున్న వ్యర్థాలు
ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి ముందు ఇలా..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని