logo

‘జనని’ సేవలు ఆదర్శనీయం

జనని సాంఘిక సాంస్కృతిక సమితి తెలుగు కళామతల్లికి చేస్తున్న సేవలు ఆదర్శనీయమని ముఖ్యఅతిథిగా విచ్చేసిన సర్వోన్నత న్యాయస్థానం న్యాయవాది ఏఎన్‌ పురుషోత్తం అభివర్ణించారు. ‘జనని’ రజతోత్సవాలు మైలాపూరు ఆంధ్ర మహిళాసభలోని డాక్టర్‌ దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ సెంటినరీ హాలులో శనివారం రాత్రి వైభవంగా జరిగాయి.

Published : 29 May 2022 02:41 IST

పుస్తకావిష్కరణలో అతిథులు, నిర్వాహకులు

చెన్నై (సాంస్కృతికం), న్యూస్‌టుడే: జనని సాంఘిక సాంస్కృతిక సమితి తెలుగు కళామతల్లికి చేస్తున్న సేవలు ఆదర్శనీయమని ముఖ్యఅతిథిగా విచ్చేసిన సర్వోన్నత న్యాయస్థానం న్యాయవాది ఏఎన్‌ పురుషోత్తం అభివర్ణించారు. ‘జనని’ రజతోత్సవాలు మైలాపూరు ఆంధ్ర మహిళాసభలోని డాక్టర్‌ దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ సెంటినరీ హాలులో శనివారం రాత్రి వైభవంగా జరిగాయి. ముందుగా డాక్టర్‌ నిర్మలా పళనివేలు అధ్యక్షతన ఏర్పాటైన కార్యక్రమంలో ‘జనని’ ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య స్వాగతం పలుకుతూ సంస్థ పాతికేళ్ల ప్రస్థానం, దాతల సహకారం గురించి సంక్షిప్తంగా వివరించారు. సంస్థ ప్రత్యేక సంచికను పురుషోత్తం ఆవిష్కరించారు. తొలి ప్రతిని తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు తమ్మినేని బాబుకు అందజేశారు. అనంతరం ప్రసంగిస్తూ తెలుగు భాషపై మక్కువతో పాతికేళ్లుగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎన్నో పుస్తకాలను ప్రచురించిన ‘జనని’ సేవలు అనన్య సామాన్యమన్నారు. భవిష్యత్తులో స్వర్ణోత్సవం జరుపుకోవాలని ఆకాంక్షించారు. స్వీకర్త తమ్మినేని బాబు మాట్లాడుతూ ‘జనని’తో తమ సుదీర్ఘ అనుభవాన్ని గుర్తుకు తెచ్చారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య విస్తాలి శంకరరావు తన అభినందనలు తెలిపారు. దాతల సహాయసహకారాలతో ఓ వైపు కార్యక్రమాలు నిర్వహిస్తూ, మరోవైపు పలువురి రచనలను ముద్రించిన ఘనత జననికే చెందుతుందన్నారు. రజతోత్సవ సంచిక సంపాదకుడు డాక్టర్‌ ఉప్పలధడియం వెంకటేశ్వర మాట్లాడుతూ దాదాపు 40 మంది రచయితలు ఈ సంచికకు వ్యాసాలు పంపారని తెలిపారు. వసుంధరాదేవి ‘మా తెలుగుతల్లి’ ప్రార్థనతో మొదలైన కార్యక్రమం జాతీయ గీతాలాపనతో ముగిసింది. నగరంలోని తెలుగు ప్రముఖులు అనేకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని