ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళపై పోలీసు అధికారి అత్యాచారం
గర్భం దాల్చడంతో బలవంతంగా అబార్షన్
కోర్టు జోక్యంతో ఆయన సహా 8 మందిపై కేసు
ఆర్కేనగర్, న్యూస్‌టుడే: ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళపై అత్యాచారం చేసి, తర్వాత గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించిన వ్యవహారంలో సహాయ ఇన్‌స్పెక్టర్ సహా ఎనిమిది మందిపై కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కళియకోవిలై పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన మహిళ(32)కు వివాహమై తొమ్మిదేళ్ల కుమార్తె ఉంది. భర్తతో విడాకులు తీసుకొని మరో వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అతను మోసం చేయడంతో పళుగల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఆమెకు సాయం చేస్తున్నట్లు నమ్మించి అప్పటి సబ్ ఇన్‌స్పెక్టర్ సుందరలింగం (40) పలుచోట్లకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చినట్లు తెలియడంతో స్నేహితులతో కలిసి ఆటోలో ఆమెను పులియరంగిలోని క్లినిక్‌లో డాక్టర్ కార్మల్ రాణి (38) వద్దకు తీసుకెళ్లారు. వైద్య పరీక్షలని నమ్మించి అబార్షన్ చేయించారు. దీనిపై బాధితురాలు పలుమార్లు కకళియకోవిల్, మార్తాండం పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ, ఎస్పీ కార్యాలయాలలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని సమాచారం. ఈ నేపథ్యంలో బాధితురాలు కుళిత్తురై కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయమూర్తి.. సుందరలింగం, గణేష్‌కుమార్ (35), మార్తాండానికి చెందిన అభిషేక్ (45), తిరువట్టార్‌కు చెందిన కార్మల్ రాణి, దేవదరాజ్ (57) తదితర ఎనిమిది మందిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఆ మేరకు మార్తాండం మహిళా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.