logo

Chess Grandslam: 14 ఏళ్ల చెన్నై బాలుడిని వరించిన గ్రాండ్‌స్లామ్‌..

చెన్నై కుర్రోడికి అపూర్వ గౌరవం దక్కింది. చెస్‌లో గ్రాండ్‌మాస్టర్‌ ఖ్యాతి దక్కించుకున్న 73వ టీనేజర్‌గా గుర్తింపు పొందారు. ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన విశ్వనాథన్‌ ఆనంద్‌ నుంచి ప్రశంసల్ని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన ‘భరత్‌ సుబ్రమణియం’ ఆనందం అంతాఇంతా కాదు. ఈ మధ్యే ఇటలీలో వెర్గానీ కప్‌

Updated : 15 Jan 2022 09:14 IST

ఎత్తులు వేయడంలో చిచ్చర పిడుగు!

విశ్వనాథన్‌ ఆనంద్‌ ప్రత్యేక అభినందనలు


భరత్‌ సుబ్రమణియం, విశ్వనాథన్‌ ఆనంద్‌

న్యూస్‌టుడే-విల్లివాక్కం చెన్నై కుర్రోడికి అపూర్వ గౌరవం దక్కింది. చెస్‌లో గ్రాండ్‌మాస్టర్‌ ఖ్యాతి దక్కించుకున్న 73వ టీనేజర్‌గా గుర్తింపు పొందారు. ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన విశ్వనాథన్‌ ఆనంద్‌ నుంచి ప్రశంసల్ని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన ‘భరత్‌ సుబ్రమణియం’ ఆనందం అంతాఇంతా కాదు. ఈ మధ్యే ఇటలీలో వెర్గానీ కప్‌ జరుగుతోంది. భరత్‌ తన 9 రౌండ్లలో 7.5పాయింట్లను సాధించాడు. దీంతో అతను గ్రాండ్‌స్లామ్‌కు కావాల్సిన 2500 ఎలో పాయింట్ల రేటింగ్‌ దాటేశాడు. ఈ కప్‌లో భరత్‌కు 7వ స్థానం దక్కినప్పటికీ తనకు దక్కిన గ్రాండ్‌స్లామ్‌ ఖ్యాతికి ఎగిరి గంతేశాడు. ఈ కుర్రోడిలో కనిపించిన తపన, ఆటతీరు విశ్వనాథన్‌ ఆనంద్‌ను కట్టిపడేసింది. ఈ మధ్యే ఆయన ఓ ట్వీట్‌ చేస్తూ.. ‘గ్రాండ్‌స్లామ్‌ సాధించినందుకు అభినందనలు భరత్‌. ఇతనిలో నేర్పు ఉంది. గొప్పగా ఆడగలడు’ అని ప్రకటించారు. 14 ఏళ్ల వయసులోనే ఈ ఖ్యాతి సాధించడంపై చెన్నైలోని వారి కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

చిన్న వయసులోనే..

ఇదివరకు టీనేజీల్లో గ్రాండ్‌స్లామ్‌ ఖ్యాతి దక్కించుకున్నవారిలో 18 ఏళ్లు, 15 ఏళ్లవారున్నారు. కానీ 14ఏళ్లకే సాధించడం ఓ రికార్డుగా క్రీడానిపుణులు చెబుతున్నారు. భరత్‌ చిన్న వయసునుంచే చెస్‌ ఆడటం నేర్చుకున్నారు. దీంతో వీలైనన్ని ఎక్కువ మెలకువలు, తెలివైన ఎత్తులతో కసరత్తు చేశారు. అతని తండ్రి ఎస్‌.హరిశంకర్‌ మాట్లాడుతూ.. ‘దేశవిదేశాల్లో ఆడే ఆటతో భరత్‌ రాటుతేలాడు. కానీ ఆ తరహా ఆటలంటే మా ఆర్థిక పరిస్థితుల రీత్యా కష్టమే. మా పొదుపు ఆ ఆటలకు ఏమాత్రం సరిపోదు, అయినా కష్టాల్ని ఓర్చి మా బిడ్డను పోటీలకు పంపుతున్నా’నని తెలిపారు. 5 ఏళ్ల వయసు నుంచి భరత్‌కు ఆయనే కోచ్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత గ్రాండ్‌మాస్టర్‌ రామచంద్రన్‌ రమేష్‌ వద్ద భరత్‌ మరింత రాటుదేలాడు.

మరింత ముందుకు..

ప్రస్తుతం భరత్‌ ప్రపంచ చెస్‌ ఫెడరేషన్‌ ర్యాంకింగ్స్‌లో 2,476వ స్థానంలో ఉన్నాడు. టీనేజీ కేటగిరీల్లో తన తఢాఖా చూపుతున్నారు. ప్రస్తుతం తన దృష్టంతా భవిష్యత్తులో జరిగే టోర్నీలపైనే ఉందని చెబుతున్న భరత్‌.. స్వయంగా విశ్వనాథన్‌ ఆనంద్‌ అభినందించడంపై ఆనందం వ్యక్తం చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని