logo

పథకాల లోటుపాట్లపై అధ్యయనం అవసరం

పథకాల లోటుపాట్లపై అధ్యయనం చేస్తేనే వాటి ఉద్దేశం నెరవేరుతుందని ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో 15 శాఖల ద్వారా అమలు చేసే 41 పథకాల పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి, సమన్వయం, పర్యవేక్షణ (దిశ) కమిటీ ఏర్పాటైంది.

Published : 19 May 2022 04:56 IST

ముఖ్యమంత్రి స్టాలిన్‌

‘దిశ’ సమావేశంలో మాట్లాడుతున్న స్టాలిన్‌

చెన్నై, న్యూస్‌టుడే: పథకాల లోటుపాట్లపై అధ్యయనం చేస్తేనే వాటి ఉద్దేశం నెరవేరుతుందని ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో 15 శాఖల ద్వారా అమలు చేసే 41 పథకాల పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి, సమన్వయం, పర్యవేక్షణ (దిశ) కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ తొలి సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా స్టాలిన్‌ మాట్లాడుతూ.. పలువురి ఆలోచనల ఉమ్మడి కూర్పే ప్రభుత్వమని తెలిపారు. అలా పనిచేస్తేనే అది ప్రజాపాలనగా ఉంటుందని పేర్కొన్నారు. దీని కోసం పలు కమిటీలు ఏర్పాటు చేసి వాటి ఆలోచనలు పొందుతున్నామని తెలిపారు. ఏ పథకమైనా ఆఖరి లబ్ధిదారునికి చేరాలన్నదే తమ ఉద్దేశమన్నారు. అన్ని సామాజికవర్గాల అవసరాలు గుర్తించి పథకాలు రూపొందించేలా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. దిశ కమిటీ పర్యవేక్షించే పథకాల పనితీరు, లబ్ధిదారులు తదితర వివరాలను వివరించారు. ఏ పథకమైనా దాని లోటుపాట్లు గురించి అధ్యయనం చేయాలని, అలా చేస్తేనే ఉద్దేశం నెరవేరుతుందని పేర్కొన్నారు. శాఖాధిపతులు, అధికారులు ఆ మేరకు వ్యవహరించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కేఆర్‌ పెరియకరుప్పన్‌, ఎంపీలు టీఆర్‌.బాలు, ఎస్‌.ఎస్‌.పళనిమాణిక్కం, నటరాజన్‌, తిరుమావళవన్‌, తిరునావుక్కరసర్‌, రవీంద్రనాథ్‌ కుమార్‌, నవాజ్‌ గని, ఆర్‌.ఎస్‌.భారతి, నవనీత కృష్ణన్‌, ఎమ్మెల్యేలు రాజేంద్రన్‌, ఎళిలన్‌, నీలమేగం, భూమినాథన్‌, అసన్‌ మౌలానా, సెంగోట్టయన్‌, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఇరైయన్బు తదితరులు పాల్గొన్నారు.

డీఎంకే ఎంపీల వితరణ

చెన్నై, న్యూస్‌టుడే: శ్రీలంక సహాయార్థం డీఎంకే ఎంపీలు వితరణ అందించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను బుధవారం డీఎంకే ఎంపీలు టీఆర్‌ బాలు, ఆర్‌.ఎస్‌.భారతి కలిసి రూ.30 లక్షలను బ్యాంకు చెక్‌ రూపంలో అందించారు.

వైద్యవిద్యార్థుల వినతి

చెన్నై: వైద్యవిద్య కొనసాగించడానికి సహాయపడాలని ఉక్రెయిన్‌ నుంచి తిరిగి వచ్చిన రాష్ట్ర విద్యార్థులు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కోరారు. బుధవారం సచివాలయంలో పలువురు సీఎంను కలిసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు.

శిక్షణ ఐఏఎస్‌ అధికారుల భేటీ

చెన్నై, న్యూస్‌టుడే: శిక్షణలో ఉన్న ఐఏఎస్‌ అధికారులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. 2020 బ్యాచ్‌ శిక్షణలోని ఐఏఎస్‌ అధికారులు శరణ్య, ఐశ్వర్య, ప్రియాంక, కరుతంజై నారాయణన్‌, కట్టా రవితేజ, అనామిక రమేశ్‌, కౌశిక్‌, ముహమ్మద్‌ షబీర్‌ అలామ్‌ అఫ్తాఫ్‌ రసూల్‌, గౌరవ్‌కుమార్‌, ఏకాంజేసింగ్‌ తదితరులు బుధవారం సచివాలయంలో సీఎంను కలిశారు.

కాల్పుల విచారణ నివేదిక అందజేత

చెన్నై, న్యూస్‌టుడే: తూత్తుకుడి తుపాకీ కాల్పుల విచారణ నివేదికను ముఖ్యమంత్రికి అందించారు. తూత్తుకుడిలోని స్టెరిలైట్‌ రాగి పరిశ్రమకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన సమయంలో 2018లో పోలీసులు తుపాకీ కాల్పులు జరిపారు. ఇందులో 13 మంది మరణించగా, వంద మందికిపైగా గాయపడ్డారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ అరుణా జగదీశన్‌ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం విచారణకు నియమించింది. ఈ నివేదికను సచివాలయంలో బుధవారం ముఖ్యమంత్రికి అరుణా జగదీశన్‌ అందించారు.

శ్రీలంకకు బయలుదేరిన నౌక

జెండా ఊపి నౌకను ప్రారంభిస్తున్న సీఎం

చెన్నై, న్యూస్‌టుడే: శ్రీలంక సహాయార్థం రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిత్యావసర సరకులతో కూడిన నౌక బుధవారం బయలుదేరింది. దానిని ముఖ్యమంత్రి స్టాలిన్‌ జెండా ఊపి ప్రారంభించారు. తొలి విడతగా 9వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం, 200 మెట్రిక్‌ టన్నుల ఆవిన్‌ పాలపౌడరు, 24 మెట్రిక్‌ టన్నుల మందులను రాష్ట్రప్రభుత్వం పంపింది. సరకుల శాంపిళ్లను చెన్నైలోని శ్రీలంక డిప్యూటీ హై కమిషనరు వెంకటేశ్వరన్‌కు స్టాలిన్‌ అందించారు. కార్యక్రమంలో మంత్రులు దురైమురుగన్‌, కేఎన్‌ నెహ్రూ, చక్రపాణి, సుబ్రమణియన్‌, శేఖర్‌బాబు, మస్తాన్‌, పోర్ట్‌ ట్రస్ట్‌ డిప్యూటీ ఛైర్మన్‌ బాలాజీ అరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

దేవెగౌడకు జన్మదిన శుభాకాంక్షలు

చెన్నై, న్యూస్‌టుడే: మాజీ ప్రధాని దేవెగౌడకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు మంచి ఆరోగ్యం, సంతోషం లభించాలంటూ సామాజిక మాధ్యమాల్లో బుధవారం పోస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని