logo

పేరరివాళన్ కు అతిపెద్ద ఊరట

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న పేరరివాళన్‌ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో పలు వర్గాలు స్పందించాయి.

Updated : 19 May 2022 06:02 IST

రాజీవ్‌ హత్యకేసులో విడుదల

మూడు దశాబ్దాల తర్వాత బయటకు

సుప్రీంకోర్టు తీర్పుపై పలు వర్గాల హర్షం

పేరరివాళన్‌కు మిఠాయి తినిపిస్తున్న బంధువు

సీఎం స్టాలిన్‌ దీన్ని రాష్ట్ర విజయంగా పేర్కొన్నారు. రాష్ట్ర హక్కులపై గవర్నర్‌, కేంద్రం తీరును ఖండించేలా తీర్పు ఉందని తెలిపారు. పేరరివాళన్‌ విడుదలకు అన్ని చర్యలు తీసుకోవడంతో విజయం లభించిందన్నారు.

చెన్నై, సైదాపేట, న్యూస్‌టుడే: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న పేరరివాళన్‌ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో పలు వర్గాలు స్పందించాయి.

అన్నాడీఎంకేకు లభించిన విజయం: ఓపీఎస్‌, ఈపీఎస్‌

పేరరివాళన్‌ విడుదల అన్నాడీఎంకేకు లభించిన విజయమని పార్టీ సమన్వయకర్త పన్నీర్‌సెల్వం, సంయుక్త సమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ధైర్యం, దూరదృష్టి, న్యాయ వివేకానికి లభించిన గొప్ప విజయమని పేర్కొన్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయమే ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పునకు మూలకారణమని తెలిపారు. మిగిలిన ఆరుగురిని కూడా విడుదల చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

సుదీర్ఘ న్యాయపోరాట ఫలితం: సీపీఎం

చెన్నై, న్యూస్‌టుడే: పేరరివాళన్‌ విడుదలకు శాసనసభలో తీర్మానం చేసి గవర్నర్‌కు పంపినా.. దానిపై నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేశారు. పేరరివాళన్‌ను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, పలు రాజకీయ పార్టీలు, ప్రజల అభ్యర్థననూ గవర్నర్‌ పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గవర్నర్‌, కేంద్ర సర్కారుకు మొట్టికాయ లాంటిది. ఈ తీర్పు పేరరివాళన్‌, అతని తల్లి అర్పుదమ్మాళ్‌, వారికి మద్దతుగా నిలిచిన సీపీఎం తదితర రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్య సంస్థల సుదీర్ఘ న్యాయపోరాటానికి లభించిన విజయం. రాష్ట్ర హక్కులను సుస్థిరం చేసేందుకు సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించిన ప్రభుత్వ కృషి అభినందనీయం. మిగతావారి విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.

న్యాయానికి దక్కిన విజయం: ఎంఎన్‌ఎం

వేలచ్చేరి, న్యూస్‌టుడే: పేరరివాళన్‌ విడుదల, న్యాయపోరాటం చేసిన అర్పుదమ్మాళ్‌కు ఎంఎన్‌ఎం అధ్యక్షులు కమల్‌హాసన్‌ అభినందనలు తెలిపారు. ఇది న్యాయానికి దక్కిన విజయమని ట్వీట్‌ చేశారు. పేరరివాలన్‌ విడుదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బంతులాట ఆడినప్పటికి సుప్రీంకోర్టు ముందుకువచ్చి విడుదల చేయడాన్ని ఆహ్వానించారు.

తల్లికి ఊరట: నామ్‌ తమిళర్‌ కట్చి

వేలచ్చేరి, న్యూస్‌టుడే: ఏళ్ల న్యాయపోరాటం తర్వాత అర్పుదమ్మాళ్‌కు సంతోషం కలిగించే పరిణామం ఇది. సంవత్సరాలపాటు కోర్టులు, జైళ్ల చుట్టూ తిరిగి చేసిన న్యాయ పోరాటాల వల్లే ఈ ఫలితం వచ్చిందని నామ్‌ తమిళర్‌ కట్చి అధినేత సీమాన్‌ అన్నారు. ఇకనైనా అర్పుదమ్మాళ్‌ బంగారు పాదాలు విశ్రాంతి తీసుకోవాలన్నారు. మిగిలిన వారిని విడుదల చేయడానికి సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేయాలని కోరారు.

కేబినెట్‌ నిర్ణయమే అంతిమం: ఎస్‌ఎంకే

వేలచ్చేరి: పేరరివాళన్‌ను సుప్రీంకోర్టు విడుదల చేస్తూ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఆలిండియా సమత్తువ మక్కల్‌ కట్చి వ్యవస్థాపకుడు శరత్‌కుమార్‌ పేర్కొన్నారు. పేరరివాళన్‌ను విడుదలపై రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి గవర్నరు కట్టుబడి ఉండాలనడానికి ఈ తీర్పు ఒక నిదర్శనమని తెలిపారు. పేరరివాళన్‌ విడుదల కావడంపై రాష్ట్ర ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ తీర్పునిచ్చిన న్యాయమూర్తులకు రాష్ట్రం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

చారిత్రక తీర్పును ఆహ్వానిస్తున్నాం: ముస్లిం లీగ్‌

వేలచ్చేరి, న్యూస్‌టుడే: సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రకమని తమిళనాడు ముస్లిం లీగ్‌ వ్యవస్థాపకుడు వీఎం ముస్తఫా తెలిపారు. నిందితులను విడుదల చేయడానికి గవర్నర్‌ నిర్ణయం తీసుకోవాలని గతంలోనే తీర్పు ఇచ్చిందన్నారు. ఈ అంశంపై అప్పటి గవర్నరు భన్వర్‌లాల్‌ పురోహిత్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేశారన్నారు.

తల్లి ధర్మయుద్ధం గెలిచింది: వీసీకే

సైదాపేట, న్యూస్‌టుడే: ఒక తల్లి ధర్మయుద్ధం గెలిచిందని పేరరివాళన్‌ విడుదల గురించి వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్‌ అభిప్రాయపడ్డారు. అర్బుతమ్మాళ్‌ అవిశ్రాంత న్యాయ పోరాటానికి లభించిన విజయమని తెలిపారు. అన్ని ప్రజాస్వామ్య శక్తుల మద్దతు, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పేరరివాళన్‌కు న్యాయం దక్కిందని పేర్కొన్నారు.

మిగతావారినీ విడుదల చేయాలి: పీఎంకే

సైదాపేట, న్యూస్‌టుడే: ఈ కేసులో మిగతా వారిని కూడా విడుదల చేయాలని పీఎంకే వ్యవస్థాపకుడు రామదాసు డిమాండ్‌ చేశారు. పేరరివాళన్‌ విడుదల సంతోషంగా ఉందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా నిర్దోషులకు తప్పక న్యాయం దక్కుతుందనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందని తెలిపారు. 34 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న వీరప్పన్‌ సోదరుడు మాదయ్యన్‌ తదితరులనూ విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని తెలిపారు.

అందరికీ ఇదే తీర్పు రావాలి: ఎండీఎంకే

విల్లివాక్కం, న్యూస్‌టుడే: పేరరివాళన్‌ విడుదల తీర్పు ఆనందదాయకమని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో హర్షం వ్యక్తం చేశారు. సర్వోన్నత న్యాయస్తానం న్యాయాన్ని నిలిపిందని ప్రశంసించారు. పేరరివాళన్‌లాగే మిగిలిన ఆరుగురిని కూడా విడుదల చేయాలని కోరారు.

మాతృమూర్తి గెలుపు: ఏఎంఎంకే

విల్లివాక్కం, న్యూస్‌టుడే: సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఆహ్వానించదగిందని ఏఎంఎంకే ప్రదాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ తెలిపారు. పేరరివాళన్‌ తల్లి అర్పుదమ్మాళ్‌కు దక్కిన విజయమన్నారు. గవర్నర్‌ పదవిలో ఉన్నవారు ప్రజలతో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వ తీర్మానానికి అనుగుణంగా వ్యవహరించాలన్నదానికి ఈ తీర్పు నిదర్శనమని పేర్కొన్నారు. మిగిలిన ఆరుగురిని కూడా విడుదల చేయాలని కోరారు.

రాజకీయం చేస్తున్నారు: భాజపా

గిండి, న్యూస్‌టుడే: గతంలోనూ డీఎంకే ప్రభుత్వమే అధికారంలో ఉందని, అప్పుడు పేరరివాళన్‌ విడుదల చేయడానికి ఎందుకు చర్యలు తీసుకోలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పేర్కొన్నారు. మరణాల్ని రాజకీయం చేసే పార్టీలు ఇప్పుడు ఈ విడుదలపై కూడా మీద కూడా అలాగే చేస్తున్నాయి. కేంద్రం, గవర్నర్‌పై సుప్రీంకోర్టులో అభ్యంతరాలు వ్యక్తమైనట్లుగా ముఖ్యమంత్రి చెబుతున్నారు. అసలు సుప్రీంకోర్టు అలా ఎక్కడా చెప్పలేదు.

 

విడుదలను స్వాగతిస్తున్నాం: డీఎండీకే

వేలచ్చేరి, న్యూస్‌టుడే: పేరరివాళన్‌ను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ తెలిపారు. సగం జీవితాన్ని ఆయన కారాగారంలో గడిపాడని పేర్కొన్నారు. అర్బుతమ్మాళ్‌ న్యాయపోరాటం వల్లే కుమారుడిని దక్కించుకొన్నారని అభినందనలు తెలిపారు. మిగతావారి విడుదలకు విన్నవించారు.

రాజీవ్‌ హంతకులు దోషులే: కేఎస్‌ అళగిరి

చెన్నై, న్యూస్‌టుడే: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని చంపిన కేసులో ఏడుగురు హంతకులుగా సుప్రీంకోర్టు శిక్ష వేసిందని టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి తెలిపారు. అదే కోర్టు కొన్ని చట్టపరమైన వెసులుబాట్లతో పేరరివాళన్‌ను విడుదల చేసిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును విమర్శించబోమని తెలిపారు. ‘హంతకులు తమిళులని, ఏళ్లుగా జైలులో ఉండటంతో వారిని విడుదల చేయాలని కొందరు చెబుతున్నారు. వందలాది తమిళులు రాష్ట్రంలోని జైళ్లలో 20ఏళ్లకుపైగా ఉన్నారు. వారి విడుదలకు ఎందుకు గళం విప్పడంలేదు. దీనికి తమిళ భావావేశాలు ఉన్నవారు సమాధానం చెప్పాలి’ అన్నారు. తమ భావోద్వేగాలు బహిర్గతం చేసేలా కాంగ్రెస్‌ వారంతా గురువారం ఉదయం 10 గంటలకు తమ ప్రాంతాల్లోని ముఖ్య ప్రదేశాల్లో నోటికి తెల్లవస్త్రం కట్టుకుని ‘హింసను వ్యతిరేకిద్దాం, అభిప్రాయభేదాలకు చంపడం పరిష్కారం కాదు’ అనే ప్లకార్డులు ప్రదర్శించాలని పిలుపునిచ్చారు.

బాణసంచా కాల్చి వేడుకలు

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: కోయంబత్తూరు గాంధీపురం ప్రాంతంలో ఉన్న పెరియార్‌ లైబ్రరీ ముందు తందై పెరియార్‌ ద్రావిడర్‌ కళగం కార్యకర్తలు బాణసంచా కాల్చి, ప్రజలకు స్వీట్లు పంచారు. కళగం కార్యదర్శి రామకృష్ణన్‌ మాట్లాడుతూ.... పేరరివాళన్‌ని విడుదల చేయాలని పలువురు ఏళ్లుగా డిమాండ్‌ చేశారన్నారు. తీర్పుతో పేరరివాళన్‌ మాత్రమే విడుదల కాలేదని, రాష్ట్ర హక్కులకు విముక్తి లభించిందని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని