logo

సర్కారు బడుల్లో చక్కని చదువు!

పేదల బడులు కార్పొరేట్‌ తరహాలో ఉండాలనే నినాదం ఎప్పటినుంచో ఉంది. కానీ ఒక్కో బడిని అలా మార్చాలంటేనే కొన్ని రూ.కోట్లు కావాలి. మరి ఆ డబ్బు ఎలా? ఎక్కడినుంచి తేవాలి? ప్రభుత్వాలు భరించగలవా? ఇప్పటివరకైతే సాధ్యపడలేదు. ఈ పరిస్థితుల్లో గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) వినూత్న ఆలోచన చేసింది.

Published : 25 May 2022 01:29 IST

ఆహ్లాదకర వాతావరణం, క్రీడలకూ దక్కనున్న ప్రాధాన్యం

కార్పొరేషన్‌ పాఠశాలల సమూల మార్పునకు నిర్ణయం

రూ.1,630 కోట్ల సీఎస్‌ఆర్‌ నిధులకు జీసీసీ ప్రతిపాదన

- ఈనాడు, చెన్నై

పేదల బడులు కార్పొరేట్‌ తరహాలో ఉండాలనే నినాదం ఎప్పటినుంచో ఉంది. కానీ ఒక్కో బడిని అలా మార్చాలంటేనే కొన్ని రూ.కోట్లు కావాలి. మరి ఆ డబ్బు ఎలా? ఎక్కడినుంచి తేవాలి? ప్రభుత్వాలు భరించగలవా? ఇప్పటివరకైతే సాధ్యపడలేదు. ఈ పరిస్థితుల్లో గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) వినూత్న ఆలోచన చేసింది. వివిధ కార్పొరేట్‌ కంపెనీల నుంచి కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద నిధుల్ని తీసుకురావాలని ప్రతిపాదించింది.

కార్పొరేషన్‌ పరిధిలో ఈ మధ్యే ఓ సమావేశం జరిగింది. పాలకమండలి ఆహ్వానం మేరకు పలు కార్పొరేట్‌ కంపెనీలు వచ్చాయి. ఈ సందర్భంగా పాఠశాలల అభివృద్ధి ప్రతిపాదనల్ని వారి ముందుంచారు. ఫ్రెంచి నేపథ్యం కంపెనీలు, వారి ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. చాలామంది నుంచి సానుకూల స్పందనలు వచ్చినట్లుగా జీసీసీ అధికారులు వెల్లడించారు. పాఠశాలల సుస్థిరతకు అదనపు వనరులు, సుందరీకరణ పనులు, అక్కడ పిల్లల భవితకు చేపట్టబోతున్న కార్యక్రమాలపై పేపర్‌ ప్రజెంటేషన్‌ కూడా ఇచ్చారు. ముందుకొస్తామని కొందరు హామీ కూడా ఇచ్చారు.

3 విడతల్లో మెచ్చుకునేలా..

జీసీసీ పరిధిలో మొత్తం 281 పాఠశాలలున్నాయి. వీటన్నింటినీ 3 విడతల్లో సమూలంగా మార్చడంతోపాటు వివిధ సాంకేతిక, విజ్ఞాన హంగులు, అందం, ఆహ్లాదం, పర్యావరణహితంగా పిల్లలకు కానుకగా ఇవ్వాలని ప్రతిపాదించారు.

ప్రస్తుతం సిటీస్‌ (సీఐటీఐఐఎస్‌) పథకం కింద కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫ్రెంచ్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు నుంచి రూ.80కోట్లు నిధుల్ని ఖర్చుచేస్తున్నారు. 28 పాఠశాలల్లో ఈ పనులు కొనసాగుతున్నాయి. ఇవన్నీ మొదటివిడత కింద పూర్తిచేస్తారు.

రెండు, మూడు విడతల్లో సీఆర్‌ఎస్‌ నిధులతో పనుల్ని పూర్తిచేయనున్నారు. ఇందుకోసం 1630.70కోట్లు అవసరమని చెబుతున్నారు. రెండో విడతలో 22, 3వ విడతలో 231 పాఠశాలల్ని తీర్చిదిద్దనున్నారు.

సాంకేతిక వనరులు..

ఈ కాలానికి తగ్గట్లు సాంకేతిక విద్య ఉండేలా ప్రతి పాఠశాలలో ఆ తరహా వనరులకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్నింటిలోనూ డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లు, క్రోమ్‌ బుక్స్‌, అవసరమైనచోట్ల ప్రొజెక్టర్లు లాంటివి ఏర్పాటు చేయనున్నారు. కంప్యూటర్లనూ అందుబాటులోకి తెస్తున్నారు. అలాగే విద్యార్థుల్ని నిష్ణాతులుగా మార్చేలా ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ వసతుల్ని కొన్ని పాఠశాలల్లో వృద్ధి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

విజ్ఞానపు హంగులు

విద్యార్థుల బాహ్యప్రపంచ జ్ఞానంతోపాటు విజ్ఞానం కూడా పెరిగేలా పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహించేందుకు వసతులు తెస్తున్నారు. ప్రధానంగా అన్నిచోట్లా సైన్స్‌ లాబొరేటరీలు ఉండాలని ప్రతిపాదించారు. అలాగే పాఠశాలల ప్రాంగణాల్లో అక్కడున్న వనరుల్ని బట్టి క్రీడలకు అవకాశం కల్పిస్తున్నారు. మైదానాలున్నచోట్ల క్రికెట్‌, ఫుట్‌బాల్‌, ఇతర ఆట స్థలాల్ని వృద్ధి చేయనున్నారు. ఈ అవకాశం లేనిచోట్ల ఇండోర్‌ క్రీడా వసతులు తేనున్నారు.

పోటీల కోసం ప్రత్యేకం

నగరంలోని పాఠశాలల పిల్లలు పోటీలు నిర్వహించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. పిల్లలు కిందపడినా ఎలాంటి గాయాలూ కాకుండా కృత్రిమ టర్ఫ్‌తో ప్రత్యేకంగా ఫుట్‌బాల్‌ మైదానాన్ని తెచ్చేలా జీసీసీ ప్రణాళిక చేస్తోంది. ఇందుకోసం రూ.90లక్షలు అవసరమని లెక్కకట్టింది. అలాగే ఇండోర్‌ గేమ్స్‌కోసం ప్రత్యేక వసతులుండేలా రూ.30లక్షలతో మరో ప్రతిపాదన తెచ్చింది. ఇక్కడ కలపతో చేసిన ఫ్లోర్‌ను అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు చేసింది. ఈ హంగులన్నీ వస్తే.. పాఠశాలలు అద్భుతంగా తయారవుతాయని జీసీసీ కమిషనర్‌ గగన్‌దీప్‌ సింగ్‌ బేడీ తెలిపారు.

తరగతిని ప్రేమించేలా..

ప్రతి పాఠశాల, తరగతి ఆహ్లాదంగా, సౌకర్యంగా ఉండేలా ప్రతిపాదించారు. సీఎస్‌ఆర్‌ నిధుల్లో అత్యధికంగా 72శాతం ఈ వసతులు పెంచేందుకే ఖర్చుచేసేలా ప్రణాళికలు వేశారు. ఇందులో భాగంగా పాఠశాలలు, గదుల పునర్నిర్మాణం, మరమ్మతులు, ఆధునిక కిటికీలు, తలుపుల ఏర్పాటుతోపాటు పిల్లల్ని కట్టిపడేసే చక్కటి పెయింటింగ్‌లతో అలరించనున్నారు. వీటితోపాటు ప్రతి తరగతిలో పిల్లలకు చక్కటి బల్లలు, బోర్డులూ రానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని