logo

ఉద్యోగాన్ని వదిలి... గిరిజనుల విద్యకు కదిలి..

విద్యతోనే సామాజిక మార్పు వస్తుందని బలంగా నమ్ముతూ.. విద్యను ప్రతి ఒక్కరి చెంతకూ చేర్చాలని భావించి ఉద్యోగాన్ని సైతం వదిలి గిరిజనుల విద్య కోసం కంకణబద్ధులయ్యారు రాణిపేట్టై జిల్లాకు చెందిన సుగంధి వినోదిని. ఆమె వెంట పుస్తకాల సంచులతో వరుసకట్టి నిల్చున్నారు

Published : 25 May 2022 01:29 IST

చదువుతోనే సామాజిక మార్పు తథ్యమంటున్న సుగంధి వినోదిని

గిరిజన పిల్లలతో ..

సైదాపేట, న్యూస్‌టుడే: విద్యతోనే సామాజిక మార్పు వస్తుందని బలంగా నమ్ముతూ.. విద్యను ప్రతి ఒక్కరి చెంతకూ చేర్చాలని భావించి ఉద్యోగాన్ని సైతం వదిలి గిరిజనుల విద్య కోసం కంకణబద్ధులయ్యారు రాణిపేట్టై జిల్లాకు చెందిన సుగంధి వినోదిని. ఆమె వెంట పుస్తకాల సంచులతో వరుసకట్టి నిల్చున్నారు అణగారిని గిరిజన సామాజిక వర్గానికి చెందిన పిల్లలు. రాణిపేట్టై జిల్లా అరక్కోణం ప్రాంతంలో ఉండే గిరిజన కాలనీలో నివశిస్తున్న పిల్లలను పాఠశాలలో చేర్చి, వారి విద్యాభ్యాసానికి కృషి చేస్తున్నారు సుగంధి. సత్యభామ వర్సిటీలో ఆచార్యురాలిగా పని చేస్తూ వచ్చిన ఆమె అణగారిన సామాజిక వర్గాల పిల్లల చదువు కోసం తన ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి పిల్లల చదువు కోసం నడుంబిగించారు. అరక్కోణం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే కన్నివేడు, వేలూర్‌పేట్టై, గుంబినిపేట్టై, సిత్తూరు, మిట్టపేట్టై తదితర గిరిజన నివాస ప్రాంతాల్లో ఉండే పిల్లలను పాఠశాలలో చేర్పించటమే కాకుండా వారికి అవసరమైన ఏకరూప దుస్తులు, పాదరక్షలు, నోటు పుస్తకాలు సమకూరుస్తున్నారు. అంతేకాకుండా పాఠశాల దూరంగా ఉండే పిల్లలకు సైకిళ్లు కూడా కొనిస్తున్నారు. బాలికలు పాఠశాలకు వెళ్లేందుకు ఆటోలు కూడా ఏర్పాటు చేశారు. పిల్లలను పాఠశాలలో చేర్చేందుకు కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి కావటంతో కుల ధ్రువీకరణ పొందే హక్కుల కోసం పాటుపడుతున్నారు.

రంగంలోకి దిగిన కలెక్టర్‌

గిరిజనుల విద్యకు సంబంధించి రాణిపేట్టై కలెక్టర్‌ భాస్కరపాండియన్‌ను కలిసి వినతి పత్రం అందించారు. వినతి పత్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌ వెంటనే రంగంలోకి దిగారు. గిరిజన నివాస ప్రాంతాలకు ప్రత్యక్షంగా వెళ్లిన కలెక్టర్‌ ఒక్కో ఇంటికీ వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత 45 మంది గిరిజన పిల్లలకు కుల ధ్రువీకరణ పత్రం అందించేందుకు చర్యలు తీసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... తర్వాతి తరంవారు ఇలాంటి పరిస్థితి నుంచి విముక్తి పొంది మంచి స్థితికి చేరే విధంగా విద్య వారికి సులభంగా లభించాలని తెలిపారు. ప్రభుత్వం అవసరమైన అన్ని సహాయాలు చేసేందుకు ఆదేశించిందని, కావున పిల్లలను చదివించాలని గిరిజన ప్రజలను కోరారు. ఇతరుల మాటలు పట్టించుకోకుండా భావితరాన్ని మంచి స్థితికి తెచ్చేందుకు తల్లిదండ్రులు ప్రతిన బూనాలని కలెక్టర్‌ సూచించారు. జిల్లా వ్యాప్తంగా గిరిజన నివాస ప్రాంతాల్లో సౌకర్యాలు మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు, అన్ని సమస్యలూ పరిష్కరిస్తారని కలెక్టర్‌ హమీ ఇచ్చారు. ఈ సందర్భంగా సుగంధి వినోదిని చొరవను కలెక్టర్‌ అభినందించారు.

వారి కోసం పాటుపడతా..

గిరిజన సామాజిక వర్గ జీవనోపాధి మెరుగుపడాలని, వారి పిల్లలకు విద్య దక్కాలంటున్నారు సుగంధి. ఇందుకు ఆటంకంగా ఉండే అవాంతరాలన్నీ తొలగించాలనే లక్ష్యంతో పని చేస్తున్నానని చెప్పారు. ఇందులో భాగంగా ఈ పిల్లలకు ముందే ఆధార్‌ కార్డులు ఇప్పించామన్నారు. చాలా దూరం వెళ్లి రేషన్‌ సరుకులు తీసుకోవాల్సిన స్థితిలో ఉన్న మూడు గిరిజన కాలనీల ప్రజల సమస్యలను ప్రాంతీయ పంపిణీ అధికారి ద్వారా పరిష్కరించామని వెల్లడించారు. 10వ తరగతి చదివిన గిరిజన విద్యార్థి ఒకరు ఐటీఐ చదివేందుకు ఆశపడి కుల ధ్రువీకరణ పత్రం లేకపోవటంతో చదవలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాగే నాల్గవ తరగతి చవివే విద్యార్థిని సామాజిక సమస్యల కారణంగా పాఠశాలకు వెళ్లేందుకు భయపడి ఇంట్లోనే ఉంటోందని తెలిపారు. ఈ సమస్యలను జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. నిర్బంధ విద్య ప్రాతిపదికన ఈ విద్యార్థినిని మళ్లీ పాఠశాలలో చేర్పించామన్నారు. గిరిజన నివాస ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యం, విద్యుత్తు తదితర సౌకర్యాలు లేవని, ఇళ్ల పట్టాలతో అన్ని కనీస అవసరాలు పూర్తి చేయాలని కలెక్టర్‌ను కోరామని తెలిపారు. త్వరలో అన్ని సదుపాయాలు వారికి దుక్కుతాయని ధీమా వ్యక్తం చేశారు. వారి జీవితం మెరుగుపడేందుకు, వారి హక్కుల కోసం పాటుపడుతూనే ఉంటానని వెల్లడించారు సుగంధీ.

సుగంధి చొరవతో కుల ధ్రువీకరణ పత్రాలు అందిస్తున్న కలెక్టర్‌

విద్యార్థినితో..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు