logo

దేశానికే మార్గదర్శకంగా పాలన

ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ద్రావిడ మోడల్‌ ప్రభుత్వం దేశానికే మార్గదర్శకంగా మారుతోందని ముఖ్యమంత్రి స్టాలిన్‌ పేర్కొన్నారు. తిరుపత్తూర్‌లో రూ. 109.71కోట్ల వ్యయంతో కొత్తగా నిర్మించిన కలెక్టరు కార్యాలయ భవనం, రూ.129 కోట్లతో పూర్తయిన 28 పథకాల ప్రారంభోత్సవం, రూ.1

Published : 30 Jun 2022 01:28 IST

అదే ‘ద్రావిడ మోడల్‌’ ఘనత

ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌

తిరుపత్తూర్‌ కలెక్టరు కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న స్టాలిన్‌

వేలూర్‌, న్యూస్‌టుడే: ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ద్రావిడ మోడల్‌ ప్రభుత్వం దేశానికే మార్గదర్శకంగా మారుతోందని ముఖ్యమంత్రి స్టాలిన్‌ పేర్కొన్నారు. తిరుపత్తూర్‌లో రూ. 109.71కోట్ల వ్యయంతో కొత్తగా నిర్మించిన కలెక్టరు కార్యాలయ భవనం, రూ.129 కోట్లతో పూర్తయిన 28 పథకాల ప్రారంభోత్సవం, రూ.13.68 కోట్లతో కొత్తగా చేపట్టనున్న పథకాలకు ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం తిరుపత్తూర్‌లో జరిగింది. తర్వాత పేదలకు రూ. 103 కోట్ల విలువైన సంక్షేమ పథకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గతంలో జ్వరంతో విశ్రాంతి తీసుకోమన్న వైద్యుల సలహా మేరకు నిర్ణయించిన తేదీలో ఇక్కడికి రాలేకపోయానని చెప్పారు. డీఎంకే ప్రభుత్వ హయాంలోనే కలెక్టరు కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, నిర్ణీత సమయంలో పనులు ముగించామని తెలిపారు. వానియంబాడిలో ఆర్డీఓ కార్యాలయం, ఆదియూర్‌లో సముదాయ భవనం, సోలూర్‌ కళాశాల వసతి గృహం, వానియంబాడిలో వృత్తి శిక్షణ కేంద్ర ఏర్పాటకు శంకుస్థాపన చేశామని వివరించారు. గత ప్రభుత్వంలో ఒక పథకం కోసం ఒక కార్యక్రమాన్ని నిర్వహించేదని, డీఎంకే వచ్చాక అనేక పథకాల ప్రారంభోత్సవాలు, కొత్త పథకాలు చేపట్టడానికి, పేదలకు సంక్షేమ సాయం పంపిణీకి ఒకే కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. తిరుపత్తూర్‌ జిల్లాలో సంవత్సరంలో 1073 మందికి ఉచిత ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. 2,218 వినతులు స్వీకరించి 1,741 పరిష్కరించామని చెప్పారు. 82 లక్షల మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేశారని, 20,252 మందికి సహకార సంఘాల్లో నగల రుణాలు మాఫీ చేశామని, ప్రజల వద్దకే వైద్యం పథకం కింద 5 లక్షల మంది లబ్ధి పొందారని, ప్రాణాలు కాపాడుతాం అనే పథకం కింద 196 మందిని రక్షించామని వివరించారు. విషమంగళం, పూంగుళం, వడవల్లి ప్రాంతాల్లో కొత్తగా వంతెనలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఏలగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి మరిన్ని పథకాలు అమలు చేయనున్నామని తెలిపారు. ప్రజల అవసరాలు గుర్తించి, తీర్చడమే ద్రావిడ మోడల్‌ ప్రభుత్వం అని, దేశానికే ఇది మార్గదర్శకంగా మారుతోందన్నారు. కార్యక్రమంలో మంత్రులు దురైమురగన్‌, ఏవీ వేలు, ఆర్‌ గాంధీ తదితరులు పాల్గొన్నారు.

కొత్త బస్టాండు ప్రారంభం

వేలూర్‌ నగర పాలక సంస్థలో స్మార్టు సిటీ పథకం కింద రూ. వెయ్యి కోట్ల వ్యయంతో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా వేలూర్‌ బస్టాండు నిర్మాణానికి రూ. 53 కోట్లు కేటాయించారు. 2020 ఫిబ్రవరిలో భూమిపూజ నిర్వహించారు. పనులు పూర్తి కావడంతో బుధవారం బస్టాండును ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రారంభించారు. 9.25 ఎకరాల విస్తీర్ణంలో రెండు అంతస్తులతో దీన్ని నిర్మించారు. ఒకే సమయంలో 84 బస్సులను నిలిపే సదుపాయం ఉంది. బస్టాండు ప్రవేశ మార్గంలో 82 దుకాణాలు, 1,450 ద్విచక్ర వాహనాలను నిలిపే స్టాండు, 300కుపైగా కార్లు నిలిపేలా ప్రాంగణం నిర్మించారు. ప్రయాణికుల వసతికి తగ్గట్లు నీటిని శుద్ధీకరించే ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంటులో గంటకు 500 లీటర్ల నీటిని శుద్ధీకరించవచ్ఛు 24 సీసీ కెమెరాలు, పోలీస్‌ వాచ్‌ టవర్లు, 7 మరుగుదొడ్లు, వాన నీటి సేకరణకు ఇంకుడు గుంతలను, 24 గంటలు పని చేసే ప్రథమ చికిత్స కేంద్రం వంటి వసతులను కల్పించారు.

నటుడు సూర్యకు అభినందనలు

చెన్నై: ‘ది అకాడమీ’ పురస్కార ఎంపిక కమిటీలో స్థానానికి ఆహ్వానం పొందిన నటుడు సూర్యకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ అభినందనలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ట్వీట్‌ చేశారు. అందులో... ఇది ఆయన నటనాభక్తి, సామాజిక బాధ్యత కలిగిన కథ ఎంపికకు లభించిన అతిపెద్ద గుర్తింపుగా పేర్కొన్నారు. పురస్కార ఎంపిక కమిటీలో స్థానానికి ఆహ్వానం పొందిన తొలి దక్షిణ భారత నటుడనే ప్రపంచస్థాయి గుర్తింపును ఆయన పొందారని తెలిపారు. ‘వానమే ఎల్లై’ (ఆకాశమే హద్దు) అంటూ ముక్తాయింపు పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని