logo

న్యాయ పోరాటం దిశగా నాయకత్వ పోరు

అన్నాడీఎంకేలో ఏక నాయకత్వ పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. ఓపీఎస్‌, ఈపీఎస్‌ వర్గాలు న్యాయ పోరాటానికి దిగుతున్నాయి. ఎలాగైనా నాయకత్వాన్ని దక్కించుకునేందుకు పళనిస్వామి యత్నిస్తుండగా ఎట్టి పరిస్థితిల్లోనూ దానికి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో పన్నీర్‌సెల్వం ఉన్నారు

Published : 30 Jun 2022 01:28 IST

ఎన్నికల కమిషన్‌, కోర్టును ఆశ్రయిస్తున్న ఓపీఎస్‌, ఈపీఎస్‌

స్థానిక ఉప ఎన్నికలపై ప్రభావం 

వేగం పెంచుతున్న శశికళ

-సైదాపేట, న్యూస్‌టుడే

ఓపీఎస్‌, ఈపీఎస్‌, శశికళకు మద్దతుగా వెలసిన  గోడపత్రికలు

అన్నాడీఎంకేలో ఏక నాయకత్వ పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. ఓపీఎస్‌, ఈపీఎస్‌ వర్గాలు న్యాయ పోరాటానికి దిగుతున్నాయి. ఎలాగైనా నాయకత్వాన్ని దక్కించుకునేందుకు పళనిస్వామి యత్నిస్తుండగా ఎట్టి పరిస్థితిల్లోనూ దానికి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో పన్నీర్‌సెల్వం ఉన్నారు. ఇదిలా ఉంటే మరోవైపు శశికళ కూడా నాయకత్వ రేసుకు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గాల వారీగా పర్యటించి మద్దతు కూడగట్టాలని భావిస్తున్నారు. ఏక నాయకత్వం వ్యవహారంలో 95 శాతం నేతలు పళనిస్వామికి మద్దతుగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే మరోవైపు కార్యకర్తల మద్దతు నిజంగా ఎవరికి ఉందన్న దానిపైనా చర్చలు జరుగుతున్నాయి. ఓపీఎస్‌, ఈపీఎస్‌ ఇద్దరూ ఎన్నికల కమిషన్‌, కోర్టులను ఆశ్రయించటంతో రాజకీయ పోరు న్యాయ పోరాటంగా రూపుదాల్చింది.

ఈ నెల 23న జరిగిన సర్వసభ్య సమావేశంపై 22న రాత్రి పన్నీర్‌సెల్వం తరఫు మద్రాసు హైకోర్టులో అప్పీలుకు వెళ్లగా సర్వసభ్య సమావేశంలో ఎలాంటి కొత్త తీర్మానాలు తేకూడదని కోర్టు ఆదేశించింది. అయితే సమావేశానికి ముందే తీర్మానించిన 23 తీర్మానాలను పళనిస్వామి వర్గం నిరాకరించింది. తమిళ్‌మగన్‌ హుస్సేన్‌ను శాశ్వత ప్రిసీడియం ఛైర్మన్‌గా నియమించి జూలై 11న తదుపరి సర్వసభ్య సమావేశం జరుగుతుందని ప్రకటించారు. దీనిపై ఎన్నికల కమిషన్‌లో ఓపీఎస్‌ తరఫున ఫిర్యాదు చేశారు. అందులో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసేందుకు సమన్వయకర్త, సంయుక్త సమన్వయకర్తల అనుమతి ఉండాలని, తన అనుమతి లేకుండా జూలై 11న సర్వసభ్య సమావేశం ప్రకటించారని సమావేశంపై నిషేధం విధించాలని కోరారు. అలాగే 23న ఎలాంటి కొత్త తీర్మానాలు ఆమోదించకూడదని మద్రాసు హైకోర్టు పేర్కొందని, కావున తమిళ్‌మగన్‌ హుస్సేన్‌ను ప్రిసీడియం ఛైర్మన్‌గా నియమించటం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. సుప్రీం కోర్టులో దాఖలు చేసిన కేవియట్‌ పిటిషన్‌లో జూలై 11న జరిగే సర్వసభ్య సమావేశంపై తమకు తెలియకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయకూడదని ఓపీఎస్‌ తరఫున ఎన్నికల కమిషన్‌కు విన్నవించారు.

‘పార్టీ బైలాస్‌ ప్రకారం నడుచుకుంటున్నాం’

మద్రాసు హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా పళనిస్వామి వర్గం కోర్టును ఆశ్రయించింది. అందులో పార్టీ సర్వసభ్య సమావేశంలో జోక్యం చేసుకుని ఆదేశాలు జారీ చేసే అధికారం కోర్టుకు లేదని తెలిపారు. ప్రిసీడియం చైర్మన్‌, సర్వసభ్య సభ్యుల అభిప్రాయం ప్రకారమే తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించబడతాయని తెలిపారు. పార్టీ బైలాస్‌ ప్రకారం సర్వసభ్య సభ్యులకే సర్వాధికారాలు ఉన్నట్లు ఎడప్పాడి తరఫున కోర్టుకు తెలిపారు. అన్నాడీఎంకేలో చట్ట ప్రకారం నిబంధనలు మార్చేందుకు, సమన్వయకర్త, సంయుక్త సమన్వయకర్తల పదవులు రద్దు చేసి ప్రధాన కార్యదర్శి పదవి తెచ్చేందుకు సర్వసభ్య సభ్యులకే అధికారం ఉందని తెలిపారు. కావున హైకోర్టు 22న జారీ చేసిన ఆదేశాలు చట్ట విరుద్ధమని, ఆ ఆదేశాలకు నిషేధం విధించాలని ఈపీఎస్‌ తరఫు పిటిషన్‌లో కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్‌ మరికొన్ని రోజుల్లో విచారణకు రానున్నట్లు తెలుస్తోంది.

ఓపీఎస్‌ ఆరోపణలకు సమాధానం

దీంతో పాటు ఎన్నికల కమిషన్‌లో పన్నీర్‌సెల్వం ఆరోపణలకు సమాధానంగా పళనిస్వామి తరఫు బుధవారం ఎన్నికల కమిషన్‌లో వివరణ ఇచ్చారు. ఇందులో భాగంగా దాఖలు చేసిన పిటిషన్‌లో అన్నాడీఎంకేలోని 2660 మంది సర్వసభ్య సభ్యుల్లో 2432 మంది సభ్యులు ఈపీఎస్‌కు మద్దతుగా ఉన్నట్లు తెలిపారు. సమన్వయకర్త, సంయుక్త సమన్వయకర్త పదవులకు సర్వసభ్య సభ్యులు అంగీకారం ఇవ్వలేదని, సర్వసభ్య సమావేశం చట్ట ప్రకారమే జరిగిందని తెలిపారు. ప్రిసీడియం చైర్మన్‌గా తమిళ్‌మగన్‌ హుస్సేన్‌ను నియమించిన విషయాన్ని ఎన్నికల కమిషన్‌కు తెలపాల్సి ఉండగా, ఆ వివరాలు కూడా ఆ పిటిషన్‌తో పాటు ఎడప్పాడి వర్గం సమర్పించినట్లు తెలుస్తోంది. ఇలా ఓపీఎస్‌, ఈపీఎస్‌లు పరస్పర విరుద్ధంగా కోర్టు, ఎన్నికల కమిషన్లలో ఫిర్యాదులు చేస్తుండటం అన్నాడీఎంకే వర్గాల్లో దుమారం రేపుతుంది.

గోడ పత్రికలతో కలకలం

తాజా పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకే కార్యాలయం వద్ద ఓపీఎస్‌, ఈపీఎస్‌, శశికళ మద్దతుదారులు గోడ పత్రికలు ఏర్పాటు చేయటం కలకలం రేపింది. అమ్మ (జయలలిత) చేత గుర్తించబడిన 1.5 కోట్ల కార్యకర్తల రక్షకుడా అని ఓపీఎస్‌ మద్దతుదారులు గోడ పత్రికలు ఏర్పాటు చేశారు. పార్టీని, రెండాకుల గుర్తును మీ దగ్గర అప్పగించామని అందులో ఉంది. ఎడప్పాడి మద్దతుదారులు ‘‘నాయకుడా రా నాయకత్వం వహించేందుకురా 1.5 కోట్ల కార్యకర్తల ఆశ ఎడప్పాడియే’’ అని ఈపీఎస్‌ తరఫు పోస్టర్లు ఏర్పాట్లు చేశారు. శశికళ మద్దతుదారులు ఏర్పాటు చేసిన గోడ పత్రికల్లో అన్నాడీఎంకే 1.5 కోట్ల మంది కార్యకర్తల ఆశా కిరణమా.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి అని ముద్రించి ఉంది. ఇంకా ఇందులో పార్టీని కాపాడేందుకు, మాకు మార్గనిర్ధేశం చేసేందుకు పార్టీ కార్యాలయానికి రండి అని పోస్టర్లలో ప్రచురించారు. శశికళ తరఫున ఏర్పాటు చేసిన ఈ గోడపత్రికలతో అన్నాడీఎంకే కార్యాలయానికి శశికళ వస్తారా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది.

స్వతంత్రులుగా పోటీ చేసే అవకాశం

ప్రస్తుతం అన్నాడీఎంకేలో నెలకొన్న పరిస్థితులు స్థానిక ఉప ఎన్నికలపై ప్రభావం చూపనుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 510 స్థానిక సంస్థల పదవులకు జులై 9న ఎన్నికలు జరగనున్నాయి. మంగళవారం సాయంత్రంతో నామినేషన్‌ దాఖలు ప్రక్రియ ముగిసింది. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థులు రెండాకుల గుర్తుపై పోటీ చేసేందుకు వీలుగా ఫారం ఏ, బీల్లో ఈపీఎస్‌, ఓపీఎస్‌లు సంతకాలు చేయాల్సి ఉంది. అప్పుడే ఎన్నికల కమిషన్‌ రెండాకుల గుర్తును అన్నాడీఎంకే అభ్యర్థులకు కేటాయిస్తుంది. ఇంత వరకు దీనిపై ఓపీఎస్‌, ఈపీఎస్‌లు సంతకం చేయలేదని సమాచారం. నామినేషన్‌ దాఖలు ముగిసిన నేపథ్యంలో అభ్యర్థులు రెండాకుల గుర్తుపై పోటీ చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో వారు మీమాంసలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా జిల్లాల కార్యదర్శులు అన్నాడీఎంకే అభ్యర్థులను స్వతంత్ర అభ్యర్థులుగా నోటిఫై చేయాలని సూచిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కావున ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనావేస్తున్నారు.

పావులు కదుపుతున్న ‘చిన్నమ్మ’

ఓపీఎస్‌, ఈపీఎస్‌ మధ్య ఏక నాయకత్వ పోరు తారాస్థాయిలో ఉంటే మరో వైపు శశికళ తన రాజకీయ చర్యలను వేగవంతం చేశారు. ఇటీవల తిరుత్తణిలో ఆమె మద్దతుదారులను కలిసి మాట్లాడారు. అన్నాడీఎంకే కార్యకర్తలు తనకు మద్దతుగా ఉన్నారని, తాను నాయకత్వం వహించాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా పర్యటించేందుకు శశికళ నిర్ణయించారు. జులై 5 నుంచి పర్యటన ప్రారంభించనున్నట్లు సమాచారం. మొదట విళుప్పురం, కళ్లకురిచ్చి జిల్లాల్లో పర్యటించనున్నారు. జులై 5న విళుప్పురం జిల్లా దిండివనం, 7న వానూరు, 8న కళ్లకురిచ్చి జిల్లా ఉలుందూరుపేటలో పర్యటించనున్నట్లు శశికళ తరఫున ప్రకటన విడుదలైంది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ అనే పేరుతో ఆ ప్రకటన విడుదల కావటం గమనార్హం.

తటస్థ వైఖరి దిశగా భాజపా

23న సర్వసభ్య సమావేశం ముగిసిన రోజున రాత్రే ఓపీఎస్‌ దిల్లీ వెళ్లారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లినా అన్నాడీఎంకేలోని పరిణామాలు దిల్లీ పెద్దలకు వివరించేందుకే వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ప్రధాని జర్మనీ పర్యటన తదితర కారణాలతో దిల్లీ పెద్దలతో ఎక్కువ సేపు మాట్లాడేందుకు ఓపీఎస్‌కు వీలుకాలేదని సమాచారం. మొదటి నుంచి అన్నాడీఎంకే వ్యవహారాల్లో భాజపా జోక్యం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భాజపా మద్దతు ఎవరికనే చర్చ కూడా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఓపీఎస్‌, ఈపీఎస్‌లకు మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండే అవకాశం ఉందని భాజపా వర్గాల్లో చర్చసాగుతోంది. అయితే ఓపీఎస్‌కు మద్దతుగా ఉంటూనే, పళనిస్వామి భాజపాకు దూరం కాకుండా ఉండేందుకు ఓపీఎస్‌ అనే అస్త్రం భాజపాకు అవసరమన్నది రాజకీయ నిపుణుల ఉద్దేశం. అలాగే రెండాకుల గుర్తు ఓపీఎస్‌, ఈపీఎస్‌ ఇద్దరికీ సొంతమని చెప్పేందుకు అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని