logo
Updated : 05 Jul 2022 06:37 IST

ఉద్యోగాల్లో అందలం!

రాష్ట్రంలో పెరుగుతున్న ఉద్యోగినుల సంఖ్య

కరోనా తర్వాత అవకాశాలిస్తున్న పలు సంస్థలు

రాష్ట్రలో మహిళా సాధికారత ఏటేటా పెరుగుతూనే ఉంది. వివిధ రంగాల్లో మహిళలు తమవంతు పాత్ర పోషిస్తూ ముందుకెళ్తున్న దాఖలాలూ కనిపిస్తున్నాయి. లింగసమానత్వంలో భాగంగా ప్రభుత్వాలు చేపడుతున్న చర్యల్లో భాగంగా పలు సంస్థలు కూడా తమవంతుగా అతివలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

- ఈనాడు, చెన్నై

ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల్లో మహిళల ప్రాధాన్యం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. 2017-18 నివేదిక ప్రకారం.. దేశంలోనే అత్యధికమంది మహిళలు ఉపాధి పొందుతున్న రాష్ట్రంగా తమిళనాడు పేరుపొందింది. ఏకంగా 7.08 లక్షల మంది మహిళలు అప్పట్లోనే ఉపాధి పొందుతున్నారు. ఈ సంఖ్య ఇప్పుడు మరింతగా పెరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

లింగ సమానత్వం కోసం రాష్ట్ర ప్రభుత్వం పలురకాల పథకాలు తెచ్చింది. మహిళలు కోరుకున్న సమయంలో పని చేసేలా భద్రతా చర్యలు చేపట్టింది. కొన్ని కంపెనీలు షిఫ్టులవారీగా 24గంటలూ నడస్తుండటంతో రాత్రిపూట ఉద్యోగాలకు వెసులుబాటు వచ్చింది. ప్రభుత్వం కూడా మహిళలకు వివిధరంగాల్లో శిక్షణ కార్యక్రమాలు బాగా పెంచింది. పనిచేసే చోటే వసతిగృహాలు ఉండేలా కేంద్ర ప్రభుత్వమూ సహకారం అందిస్తోంది.


చెన్నైలో ఉద్యోగాల కోసం ముఖాముఖికి వచ్చిన మహిళలు (పాతచిత్రం)

దుస్తులు, పాదరక్షల పరిశ్రమల్లో.. రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ కారణాల వల్ల చాలామంది మహిళలు ఉద్యోగాలను, పనులను వదులుకున్నట్లు ప్రభుత్వం దగ్గర గణాంకాలున్నాయి. ఇందులో 10వేల మందికి తిరిగి వాటిని పొందేలా ప్రభుత్వం అవకాశమిచ్చింది. ప్రత్యేకించి తయారీ రంగంలో వారికి అవకాశాలు కల్పిస్తోంది. దుస్తులు, పాదరక్షల రంగ పరిశ్రమలు మహిళలకు ఉద్యోగాల విషయంలో ముందున్నట్లుగా అధికారులు వెల్లడిస్తున్నారు.

సాంకేతిక బాటలో.. మహిళలు సాంకేతికంగానూ ముందుకెళ్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. వివిధ కంపెనీలు ఆ తరహా అవకాశాలు కూడా ఇస్తున్నాయి. రాణిపేటలోని విద్యుత్తు ద్విచక్రవాహనాల కంపెనీలో 70శాతంమంది మహిళలే ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆటోమొబైల్స్‌ రంగంలోనూ వీరి పాత్ర పెరిగింది. చెన్నైలోని సీయట్‌ కంపెనీ తొలిసారిగా అందరూ మహిళలే ఉన్న ప్లాంటును నెలకొల్పింది. ఇలా ప్రత్యేకించి మహిళలకు ప్రాధాన్యమిస్తున్న కంపెనీల సంఖ్య బాగా పెరుగుతోంది.


ఐసీఎఫ్‌లో మహిళా శ్రామికులు

తల్లులకు.. కొవిడ్‌ తర్వాత పిల్లలున్న తల్లులకు ఉపాధి అత్యవసరమైంది. వారు వివిధరకాల రంగాల్లో విధుల్లోకి రావడం పెరిగినట్లుగా సంకేతాలు అందుతున్నాయి. ప్రత్యేకించి రిటైల్‌ రంగంలో ఇది కనిపిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు కంపెనీలు కూడా తమ పరిధి విస్తరణలో భాగంగా మహిళలను తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. కొన్ని కంపెనీలు తాజాగా వేసవి శిబిరాలు నిర్వహించి వారికి శిక్షణ కూడా ఇస్తున్నాయి. వివిధ స్థాయులలో నిష్ణాతులుగా ఎదుగుతున్న మహిళలు ఇప్పుడు మేనేజర్లు, ఆ పైస్థాయి పదవుల్లోనూ ఉన్నారు.


ఓ కార్పొరేట్‌ సంస్థలో ఉద్యోగినులు

భవిష్యత్తుపై మరింత ఆశ.. రాష్ట్రంలోని పాఠశాలల్లో బాలికల ప్రవేశాలు కూడా బాగా పెరుగుతున్నాయి. వీరు భవిష్యత్తుల్లో వివిధ రంగాల్లో స్థిరపడేందుకు అవకాశాలు ఏర్పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడ భవిష్యత్తు ఆశాజనకంగా ఉందని పేర్కొన్నారు.

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని