logo

క్రైం కార్నర్‌

వరకట్న వేధింపులతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... చెన్నై నొళంబూం్‌కు చెందిన మురుగన్‌, అమ్మణియమ్మాళ్‌ దంపతుల కుమార్తె అరుంధతి (24). ఈమె 2019లో ఇంజినీరింగ్‌ చదివే సమయంలో అదే కళాశాలలో చదివే నుంగంబాక్కానికి చెందిన మహ్మద్‌ సాదిక్‌ ఇబ్రహీంను ప్రేమ వివాహం చేసుకుంది.

Updated : 05 Jul 2022 06:37 IST

వివాహిత.. ఆత్మహత్య


అరుంధతి (పాతచిత్రం)

ట్రిప్లికేన్‌, న్యూస్‌టుడే: వరకట్న వేధింపులతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... చెన్నై నొళంబూం్‌కు చెందిన మురుగన్‌, అమ్మణియమ్మాళ్‌ దంపతుల కుమార్తె అరుంధతి (24). ఈమె 2019లో ఇంజినీరింగ్‌ చదివే సమయంలో అదే కళాశాలలో చదివే నుంగంబాక్కానికి చెందిన మహ్మద్‌ సాదిక్‌ ఇబ్రహీంను ప్రేమ వివాహం చేసుకుంది. తర్వాత ఇద్దరు నుంగంబాక్కంలోని వాతావరణ పరిశోధన కేంద్రం క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తన భర్త వరకట్నం కోసం వేధిస్తున్నట్లు అరుంధతి తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆమె తల్లిదండ్రులు నాలుగు సవర్ల నగలు ఇచ్చారు. ఆ నగలు కుదువపెట్టిన ఇబ్రహీం మళ్లీ డబ్బులు తీసుకురమ్మని వేధించసాగాడు. దీంతో అరుంధతి జూన్‌ 22వ తేదీ పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడికెళ్లిన ఆమె భర్త ఆమె తల్లితో గొడవపడ్డాడు. తన భార్యను తనతో పంపించమని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో అరుంధతి మళ్లీ భర్త వద్దకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈనెల 2న ఇంటి మేడపై నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని భర్తను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచి జైలుకు తరలించారు.


విద్యార్థిని...

ప్యారిస్‌, న్యూస్‌టుడే: ప్రైవేటు కళాశాల హాస్టల్‌లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సేలం జిల్లా తలైవాసల్‌ సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న విద్యార్థినులు ఆ కళాశాల ప్రాంగణంలో ఉన్న హాస్టల్‌లో బస ఉంటారు. ఈ నేపథ్యంలో వసతిగృహం మొదటి అంతస్తులో డిగ్రీ మొదటి ఏడాది విద్యార్థినికి సోమవారం అకస్మాత్తుగా మూర్ఛ వచ్చింది. అది చూసిన మరో ఇద్దరు విద్యార్థినులు స్పృహకోల్పోయారు. వెంటనే తోటివారు ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. అదే సమయంలో రెండో అంతస్తులో కళ్లకురిచ్చికి చెందిన విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.


కలెక్టరేట్‌లో కుటుంబం ఆత్మాహుతియత్నం

వేలూర్‌, న్యూస్‌టుడే: వేలూర్‌ సత్తువాచ్చారి ఫేస్‌-2కు చెందిన వెంకటేశన్‌ న్యాయవాది. ఇతని సోదరులు, సోదరి కుటుంబాలకు చెందిన ఆరుగురు సోమవారం ఉదయం వేలూర్‌ కలెక్టరు కార్యాలయానికి చేరుకున్నారు. తమ వెంట తీసుకొచ్చిన కిరోసిన్‌ ఒంటిపై పోసుకుని ఆత్మాహుతికి యత్నించారు. వెంటనే అక్కడున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేశన్‌ మాట్లాడుతూ... తమకు సొంతమైన భూమి వేలూర్‌ గాంధీ రోడ్డులో ఉందని, ఆ భూమికి వెళ్లడానికి కొంత మంది తమను బెదిరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆత్మాహుతికి పాల్పడినట్లు తెలిపారు. వారి వద్ద కలెక్టరు దర్యాప్తు జరిపారు.


అపహరణకు గురైన శిశువు సురక్షితం

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆస్పత్రిలో అపహరణకు గురైన శిశువుని 24 గంటల్లో రక్షించిన పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు. కోయంబత్తూరు పొళ్లాచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో కుమరన్‌ నగర్‌కు చెందిన దివ్యభారతికి గతనెల 30న ఆడశిశువు పుట్టింది. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున దివ్యభారతి నిద్రలేచి చూసేసరికి శిశువు కనిపించలేదు. వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చింది. ఆస్పత్రి బయట ఉన్న సీసీ కెమెరాలో ఇద్దరు మహిళలు సంచెలో శిశువుని తీసుకెళ్తున్నట్లు తెలిసింది. ఆరు ప్రత్యేక బృందాలు గాలించి శిశువుని కాపాడి ఓ మహిళను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో మహిళ కోసం గాలిస్తున్నారు. శిశువుని సోమవారం తెల్లవారుజామున ప్రభుత్వ ఆస్పత్రిలో తల్లిదండ్రులకు జిల్లా ఎస్పీ అప్పగించారు.


సెల్‌ఫోన్‌ చోరుల అరెస్టు

ఆవడి, న్యూస్‌టుడే: తిరువళ్ళూరు సమీపంలో రైలు ప్రయాణికుల సెల్‌ఫోన్లను చోరీ చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి కథనం మేరకు.. కొన్ని రోజులుగా ఆవడి-పట్టాభిరాం మధ్య నడుస్తున్న రైళ్లలో ప్రయాణికుల సెల్‌ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం పట్టాభిరాంకు రైలులో ప్రయాణిస్తున్న ఆవడికి చెందిన బాలాజీ, ఆంటోమరియా, విఘ్నేష్‌లు తమ సెల్‌ఫోన్లు చోరీ అయ్యాయని రైల్వే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు స్టేషన్‌లో నిఘా ఉంచారు. ఆ సమయంలో ప్లాట్‌ఫారంపై అనుమానాస్పదంగా నిలబడి ఉన్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. వారు ఆవడి నందవన మేటూరు ప్రాంతానికి చెందిన రాకేష్‌, సతీష్‌కుమార్‌గా తెలిసింది. వారిని సోమవారం ఉదయం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు


పొగాకు ఉత్పత్తులు తరలిస్తున్న ఇద్దరు... అరెస్టు

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: పొగాకు ఉత్పత్తులు కారులో తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి కథనం మేరకు... విళుపురంలో ఆదివారం అర్ధరాత్రి పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో విళుపురం నుంచి వళనూర్‌ వైపు అతివేగంగా వెళ్తున్న కారును ఆపి తనిఖీ చేశారు. అందులో రూ.1.50 లక్షల విలువైన పొగాకు ఉత్పత్తులు ఉన్నట్లు గుర్తించారు. కారులోని వారు పుదుచ్చేరికి చెందిన తారిబ్‌అలీ (35), వాతనూర్‌కు చెందిన సాదిక్‌ బాషా (38)గా తెలిసింది. వాటిని స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేశారు.


నగదు మోసానికి పాల్పడిన వ్యక్తి...

ప్యారిస్‌, న్యూస్‌టుడే: నగదు మోసం కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వారి కథనం మేరకు... కోయంబత్తూరుకు చెందిన అశోక్‌కుమార్‌ ఓ సంస్థలో పనిచేసే పళనివేల్‌ అనే వ్యక్తికి ఫోన్‌ చేసి.. మీరు బ్యాంకులో తాకట్టు పెట్టిన నగలపై రూ.13.10 లక్షలు చెల్లించారని, మిగిలిన రూ.3.5 లక్షలు చెల్లించి నగలు విడిపించుకోవాలని చెప్పాడు. అది నమ్మిన పళనివేల్‌ అతనికి ఆన్‌లైన్‌లో నగదు పంపాడు. అనంతరం పళనివేల్‌ బ్యాంకుకు వెళ్లి విచారించగా తను మోసపోయినట్లు తెలిసింది. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల దర్యాప్తులో.. నిందితుడు అశోక్‌కుమార్‌ అని తెలిసింది. అతను పలువురి వద్ద లక్షల నగదు రాబట్టి మోసగించాడని తేలింది. దీంతో నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


పోక్సో చట్టం కింద పాస్టర్‌...

ప్యారిస్‌, న్యూస్‌టుడే: బాలికను లైంగికంగా వేధించిన చర్చి పాస్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారి కథనం మేరకు.. కోయంబత్తూరు జిల్లా మలుమిచ్చింపట్టికి చెందిన స్టీఫెన్‌రాజ్‌ స్థానికంగా అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ప్రతి శుక్రవారం ఇంట్లో క్రైస్తవ ప్రార్థనలు నిర్వహించేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం చర్చికి వచ్చిన 17 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో అతను పారిపోయాడు. బాధితురాలి అమ్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని సోమవారం పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.


ఇద్దరు వేటగాళ్లు...

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: జింక మాంసాన్ని విక్రయించేందుకు ప్రయత్నించిన ఇద్దరు వేటగాళ్లను అటవీశాఖ అధికారులు సోమవారం అరెస్ట్‌ చేశారు. వారి కథనం మేరకు...తేని జిల్లా బోడి రేంజర్‌ సెల్వరాజ్‌ నేతృత్వంలో సిబ్బంది పలకురడి రోడ్డులో గస్తీ తిరుగుతున్నారు. ఆ సమయంలో రెండు ద్విచక్ర వాహనాల్లో నలుగురు వ్యక్తులు వచ్చారు. వారిలో ఇద్దరు పారిపోగా, అదుపులో తీసుకొన్న బోడీకి చెందిన శివకుమార్‌, సూర్యప్రకాష్‌లను తనిఖీ చేశారు. వారి వద్ద 40 కిలోల జింక మాంసాన్ని స్వాధీనం చేసుకొన్నారు. కేసు నమోదుచేసి కోర్టులో హాజరుపరిచారు. పరారీలో ఉన్న వారికోసం గాలిస్తున్నారు.


సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు హత్య

మహాబలిపురం, న్యూస్‌టుడే: కారు డ్రైవరు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు మధ్య జరిగిన గొడవలో ఐటీ ఉద్యోగి హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం మేరకు.. చెంగల్పట్టు జిల్లా గూడువాంజేరి సమీప కన్నివాక్కం కుందన్‌నగర్‌కు చెందిన ఉమేంద్రన్‌ (33) కోవైలోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య భవ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఉమేంద్రన్‌ వారాంతపు రోజుల్లో ఇంటికి వస్తుంటాడు. ఆ మేరకు ఆదివారం ఉదయం కన్నివాక్కానికి చేరుకొన్నాడు. తన కుటుంబంతో కలిసి అద్దె కారులో ముట్టుక్కాడు పరిధిలోని బోట్‌ హౌస్‌కు బయల్దేరాడు. వీరి వెంట బంధువు దేవిప్రియ కూడా ఉంది. ఓఎంఆర్‌లో ఓ షాపింగ్‌ మాల్‌లో ఉన్న సినిమా థియేటరులో సినిమా చూసి సాయంత్రం ఇంటికి తిరుగు పయనమయ్యారు. అద్దె కారును ఆన్‌లైన్‌లో బుక్‌ చేశాడు. కారు రాగానే ఉమేంద్రన్‌ అతని కుటుంబ సభ్యులు అందులో ఎక్కి కూర్చున్నారు. అప్పుడు కారు డ్రైవరు రవి ఓటీపీ చెప్పమని ఉమేంద్రన్‌ను అడిగాడు. ఈ విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఉమేంద్రన్‌ తన కుటుంబంతో పాటు కారులో నుంచి కిందకు దిగడంతో ఆగ్రహించిన డ్రైవర్‌ రవి అతనిపై డాడి చేయడంతో ఉమేంద్రన్‌ స్ప్పహతప్పి పడిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

తిరువళ్ళూరు, న్యూస్‌టుడే: తిరువళ్ళూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు.. తిరునిండ్రవూరు సమీప పాక్కం గ్రామానికి చెందిన గుణసుందరి (50) తన తమ్ముడు మురుగన్‌తో కలిసి ఆదివారం సాయంత్రం తిరుపాచ్చూరులో జరిగిన ఆలయ తిరునాలకు ద్విచక్రవాహనంపై వెళ్లింది. సోమవారం ఇద్దరూ తిరిగి వస్తుండగా తిరువళ్ళూరు-ఆవడి కాకలూరు బైపాస్‌ రోడ్డులో వెనుక వస్తున్న కారు వారి వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గుణసుందరి మృతిచెందింది. మురుగన్‌ పరిస్థితి విషమంగా ఉంది.


విష కీటకం కుట్టి విద్యార్థి...

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: విష కీటకం కుట్టి ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల కథనం మేరకు... మదురై జిల్లా పూమంగలపట్టి ప్రాంతానికి చెందిన సెంథమిల్‌సెల్వన్‌ కుమారుడు నితీష్‌ ఆ ప్రాంతంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో రెండ్రోజుల క్రితం నితీష్‌ పాఠశాల ప్రాంగణంలో ఆడుకుంటూ ఉండగా విష పురుగు కుట్టింది. సాయంత్రం ఇంటికి వచ్చినప్పటి నుంచి అతనికి రక్త విరేచనాలు అయ్యాయి. తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొంది సోమవారం డిశ్ఛార్జయ్యాడు. ఇంట్లో ఉన్నట్టుండి స్పృహతప్పిపడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.


అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

ప్యారిస్‌, న్యూస్‌టుడే: అప్పుల బాధతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. కళ్లకురిచ్చి అన్నానగర్‌కు చెందిన దినేష్‌కుమార్‌ (21) ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. అతను తనకు పరిచయమైన ఓ వ్యక్తి వద్ద నగదు అప్పుకు తీసుకున్నాడు. అసలుతోపాటు అధిక వడ్డీ చెల్లించినా అప్పు ఇచ్చిన వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో మనస్తాపానికి గురైన దినేష్‌కుమార్‌ సోమవారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను చనిపోవడానికి ముందు పోలీసులకు ఓ వీడియో రికార్డింగ్‌ పంపాడు. అందులో.. పన్నీర్‌సెల్వం అనే వ్యక్తి తన వద్ద లక్షల నగదు తీసుకుని మోసం చేశాడని, అదేవిధంగా వేల్‌మురుగన్‌ అనే వ్యక్తి వద్ద తాను రూ.10 వేలు అప్పుకి తీసుకుని లక్షల వడ్డీ కట్టానని చెప్పాడు. అయినా తనను బెదిరిస్తున్నాడని, వేరే మార్గం లేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు.


రెండో పెళ్లి చేసుకున్న మహిళ...

ఆవడి, న్యూస్‌టుడే: ఆవడి సమీపంలో వివాహం పేరిట మోసానికి పాల్పడిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. వారి వివరాల మేరకు... ముత్తాపుదుపేటకు చెందిన ఇంద్రాణి కుమారుడు ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగి. ఇతనికి వివాహమై ఆరేళ్ల క్రితం భార్యతో విడాకులు తీసుకున్నాడు. మళ్లీ రెండో వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన 54 ఏళ్ల సుగుణ మధ్యవర్తి ద్వారా ఇంద్రాణికి పరిచయమైంది. ఇంద్రాణి కుటుంబం పెళ్లిచూపులకు వస్తున్నారని తెలుసుకున్న సుగుణ తన పేరు శరణ్యగా మార్చుకొని వయస్సు తగ్గించుకోవడానికి మేకప్‌ వేసుకుని వారి ముందు నిలబడింది. వారికి ఆమె నచ్చడంతో ఇంద్రాణి తిరునిండ్రవూరులో కుమారుడికిచ్చి వివాహం చేసింది. ఆమెకు 25 సవర్ల నగలు కూడా ఇచ్చింది. కొన్ని రోజులు గడిచిన తరువాత శరణ్య భర్త వేతనం, బీరువా తాళాలు అప్పగించాలని, ఆస్తి తన పేరిట రాయాలని పట్టుపట్టింది. ఈ విషయంలో అత్త, భర్తతో తరచూ గొడవలు జరిగేవి. గత వారం అత్త ఇంద్రాణిని ఇంటి నుంచి గెంటేసింది. ఈ నేపథ్యంలో భర్త శరణ్యకు ఆస్తి రాసివ్వడానికి నిర్ణయించుకున్నాడు. అందుకు అవసరమైన ఆధార్‌ కార్డు, ఇతర ధ్రువపత్రాలను ఇవ్వమని అడిగాడు. లేవని చెప్పి కొన్ని రోజుల తరువాత ఆధార్‌ కార్డు భర్తకు ఇచ్చింది. అందులో భర్త పేరు రవి అని ఉంది. దీంతో భర్త సోమవారం ఆవడి మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో ఆమె అసలు పేరు సుగణ (54) అని, ఆమెకు రవితో ఇదివరకే వివాహమైందని, ఇద్దరు ఆడపిల్లలున్నట్లు తెలిసింది. డబ్బు కోసం ఇలా పెళ్లిళ్లు చేసుకుంటుందని తేలింది. దీంతో ఆమెను అరెస్టు చేశారు.


నగలు, నగదు చోరీ

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: ఓ ఇంటి తాళాలు పగులకొట్టి దుండగులు 40 సవర్ల నగలు, రూ.20 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసుల కథనం మేరకు.. మదురై జిల్లా వసంత్‌నగర్‌కు చెందిన శ్రీనివాస శంకర నారాయణన్‌ (55) కేటరింగ్‌ నడుపుతున్నాడు. జులై 2న తిరుచ్చిలోని తన బంధువు వివాహానికి కుటుంబంతోపాటు వెళ్లాడు. తిరిగి ఆదివారం రాత్రి ఇంటికి చేరుకున్నారు. అప్పుడు ఇంటి తాళాలు పగులకొట్టి ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందాడు. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని 40 సవర్ల నగలు, రూ.20 లక్షల నగదు కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


బెదిరింపులపై వివాహిత ఫిర్యాదు

ట్రిప్లికేన్‌, న్యూస్‌టుడే: సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలతో బెదిరిస్తున్న వ్యక్తిపై ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం మేరకు.... కొళత్తూం్‌కి చెందిన 28ఏళ్ల వివాహిత ఓ దుకాణంలో పనిచేసేది. భర్త పనికి వెళ్లకుండా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో దుకాణ యజమాని అరుణాచలంతో విహేతర సంబంధం ఏర్పడింది. సన్నిహితంగా మెలిగాక లైంగికంగా వేధిస్తున్నాడు. పని మానేసినా అతడి తీరు మారలేదు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న అరుణాచలం కోసం వారు గాలిస్తున్నారు.


విదేశీ కరెన్సీ పట్టివేత

ట్రిప్లికేన్‌, న్యూస్‌టుడే: చెన్నై విమానాశ్రయంలో వ్యక్తి నుంచి రూ.34.23 లక్షల విలువైన విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నట్లు ఏఐయూ అధికారులు తెలిపారు. వారి కథనం మేరకు... ప్రయాణికుల వద్ద ఏఐయూ అధికారులు తనిఖీలు చేపట్టారు. అప్పుడు చెన్నైకి చెందిన ఓ వ్యక్తి అక్రమంగా విదేశీ కరెన్సీ తరలించేందుకు యత్నించినట్లు గుర్తించారు. అనంతరం రూ.34.23 లక్షల విలువైన కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.


సిబ్బంది, యువకులు బాహాబాహీ

విల్లివాక్కం, న్యూస్‌టుడే దిండిగల్లులోని రాజేంద్రా సినిమా థియేటర్‌ వద్ధ సోమవారం సిబ్బంది, యువకులు పరస్పర దాడులకు పాల్పడ్డారు. దీంతో సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు పరారయ్యారు. సమాచారం అందుకొన్న పోలీసులు థియేటర్‌ వద్దకు చేరుకుని ఇరువర్గాల వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని