logo

కరుణను స్మరిస్తూ భారీ మారథాన్‌

మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి జయంతి సందర్భంగా నగరంలో భారీ అంతర్జాతీయ మారథాన్‌ నిర్వహించారు. ఇందులో డీజీపీ తదితర పలువురు ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ నగదు బహుమతి ప్రదానం చేశారు

Updated : 09 Aug 2022 01:56 IST

ఎగ్మూరు ప్రభుత్వ పిల్లల ఆసుపత్రికి విరాళం అందజేస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్‌

చెన్నై, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి జయంతి సందర్భంగా నగరంలో భారీ అంతర్జాతీయ మారథాన్‌ నిర్వహించారు. ఇందులో డీజీపీ తదితర పలువురు ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ నగదు బహుమతి ప్రదానం చేశారు. కరుణానిధి 4వ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఈ మారథాన్‌ను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్‌ ఏర్పాటు చేశారు. బెసెంట్‌ నగర్‌లోని ఆల్కాట్‌ పాఠశాల ప్రాంగణం నుంచి 4 విభాగాలుగా పోటీలు జరిగాయి. 5 కి.మీ. మారథాన్‌ను చేపాక్‌-ట్రిప్లికేన్‌ ఎమ్మెల్యే ఉదయనిధి, 10 కి.మీ. పోటీని మున్సిపల్‌ పరిపాలనశాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ, 21 కి.మీ. మారథాన్‌ను ప్రజాపనులశాఖ మంత్రి ఏవీ వేలు, 42 కి.మీ. పోటీని క్రీడలశాఖ మంత్రి మెయ్యప్పన్‌ ప్రారంభించారు. మారథాన్‌ కొనసాగిన మార్గంలో తమిళ సంస్కృతిని ప్రతిబింబించేలా తిరువణ్ణామలై పెరియ మేళం, కారమడై తుడుంబాట్టం, రామనాథపురం జింబళా మేళం వంటి 8 రకాల మేళ వాద్యాలు వాయించారు. మారథాన్‌లో పాల్గొన్నవారి కోసం 12 చోట్ల తాగునీరు, పుచ్చకాయలు, బత్తాయి రసం, అరటిపళ్లు వంటివి అందించారు.

నగదు బహుమతుల ప్రదానం
5 కి.మీ. పోటీల్లో తొలి బహుమతిగా మణిశరత్‌కు రూ.25వేలు, రెండో బహుమతిగా ధనేచ్‌కు రూ.15 వేలు, 10 కి.మీ. పోటీలో తొలి మూడు స్థానాలు సాధించిన కోయంబత్తూరుకు చెందిన సతీశ్‌కుమార్‌కు రూ.50వేలు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన దశంత్‌కుమార్‌కు రూ.25వేలు, రాజస్థాన్‌కు ఎందిన రామ్‌పాల్‌కు రూ.15వేలు అందించారు. అలాగే 21 కి.మీ మారథాన్‌లో పుదుకోట్టైకు చెందిన సైనికుడు లక్ష్మణన్‌ గోవింద్‌కు రూ.లక్ష, రెండో బహుమతిగా తేనికి చెందిన సైనికుడు రాజ్‌కుమార్‌కు రూ.50వేలు, మూడో బహుమతిగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్‌కు రూ.25వేలు, 42 కి.మీ. పోటీలో జైపూర్‌కు చెందిన సబ్‌ ఇన్‌స్పెక్టరు షేర్‌సింగ్‌కు రూ.లక్ష, బహుమతులు, 12 మంది మహిళలకు ప్రత్యేక బహుమతిగా రూ.5 వేల చొప్పున ప్రదానం చేశారు.
ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖులు
మారథాన్‌లో డీజీపీ శైలేంద్రబాబు, ఇండియన్‌ ఆర్మీ దక్షిణ భారత ఏరియా చీఫ్‌ స్టాఫ్‌ మేజర్‌ జనరల్‌ దహియా, ఇండియన్‌ నేవీ ఉన్నతాధికారి కమాండర్‌ సురేశ్‌, ఇంగ్లండ్‌లోని అమెష్‌బరీ నగర డిప్యూటీ మేయర్‌ మోనికా దేవేంద్రన్‌, చూపు కోల్పోయిన పంజాబ్‌కు చెందిన క్రీడాకారుడు చావ్లా తదితరులు పాల్గొన్నారు. వారిని ముఖ్యమంత్రి సత్కరించి, ధ్రువపత్రాలు ప్రదానం చేశారు. అమెరికా, బ్రిటన్‌, జపాన్‌, ఫ్రాన్స్‌ తదితర దేశాల దౌత్యాధికారులు, మారథాన్‌కు విరాళాలు అందించిన దాతలను సత్కరించి జ్ఞాపికలు అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్ముడి, రఘుపతి, పెరియకరుప్పన్‌, మస్తాన్‌, అన్బిల్‌ మహేశ్‌ పొయ్యామొళి, కయల్‌విళి, ఎంపీలు టీఆర్‌ బాలు, తమిళచ్చి తంగపాండియన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts