logo
Published : 10 Aug 2022 00:38 IST

అరుదైన వేడుకకు ఘనంగా వీడ్కోలు

చెన్నైలో ముగిసిన 44వ చెస్‌ ఒలింపియాడ్‌

సాంస్కృతిక ప్రదర్శన

ఈనాడు-చెన్నై, న్యూస్‌టుడే-చెన్నై: మహాబలిపురంలో నిర్వహించిన అత్యంత ప్రతిష్ఠాత్మక 44వ చెస్‌ ఒలింపియాడ్‌ టోర్నీ మంగళవారంతో ముగిసింది. వేడుకలు జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ సమక్షంలో చెస్‌ టోర్నీ విజేతలకు పతకాల్ని అందించారు.

 డ్రమ్స్‌ వాయిస్తున్న శివమణి అరుదైన వేడుకకు ఘనంగా వీడ్కోలు

 

ఆకట్టుకున్న జిమ్నాస్టిక్‌ క్రీడాకారుల ప్రదర్శన

జాతి గర్వించేలా..
ముగింపు వేడుకల్లో ఈసారి దేశ చరిత్రను సినీనటుడు కమల్‌హాసన్‌ స్వరంతో వినిపించి చూపరులకు ఆకట్టుకునే పలురకాల ప్రదర్శనలు ఇచ్చారు. 75వ స్వాతంత్య్ర దిన ఉత్సవాలు జరుపుకొంటున్న నేపథ్యంలో అసలు స్వాతంత్య్రం ఎలా సాధ్యమైంది, సమరయోధుల్లో ఎవరెవరు ఎలాంటి త్యాగాలు చేశారు, తదితర విషయాల్ని అత్యంత అద్భుతంగా చూపించారు. మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. దీనికి తగ్గట్లు విజువల్‌ ఎఫెక్ట్స్‌ అందరినీ కదిలించాయి. స్వాతంత్య్రానంతరం తమిళనాడును పాలించిన ముఖ్యమంత్రుల గురించీ చూపించారు. ఇందులో కరుణానిధి, ఎంజీఆర్‌, జయలలిత కూడా ఉన్నారు.

ఫిడె అధ్యక్షుడికి ముగింపు లేఖను అందిస్తున్న స్టాలిన్‌

మహాద్భుత టోర్నీ
దేశంలోనే తొలిసారిగా, గత 30 ఏళ్లలో ఏషియాలోనే అత్యంత ఘనమైన చెస్‌ ఒలింపియాడ్‌కు రాష్ట్రం ఆతిథ్యమిచ్చింది. ప్రజల అభిమానానికి దేశవిదేశాల క్రీడాకారులు, అతిథులు ముగ్ధులయ్యారు. ఈ టోర్నీలో 187 దేశాల నుంచి 2,200 మందిపైగా క్రీడాకారులు పాల్గొన్నారు. వీరికి ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేసింది. జులై 28వ తేదీన టోర్నీని ప్రారంభించగా.. మరునాడు ఆటలు మొదలయ్యాయి. 11 రౌండ్లలో ఈ టోర్నీ జరిగింది. క్రీడాకారులతోపాటు అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడె), ఆలిండియా చెస్‌ ఫెడరేషన్‌ (ఎఫ్‌ఐసీఎఫ్‌) ఈ టోర్నీ ఏర్పాట్లపై తమిళనాడును, ముఖ్యమంత్రిని అభినందనలతో ముంచెత్తాయి. విదేశీయులు ఎప్పుడొచ్చినా తమిళప్రజలు, సీఎం వారికి ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని క్రీడల శాఖ మంత్రి మెయ్యనాథన్‌ పేర్కొన్నారు.

పాఠశాలల్లో చెస్‌ కోర్సు
త్వరలో పాఠశాలల్లో ప్రత్యేకంగా చెస్‌ కోర్సును ప్రవేశపెడతామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇరైఅన్బు ప్రకటించారు. ఓ పుస్తకంలోని విషయాన్ని గుర్తుచేస్తూ.. ప్రస్తుత యువత పరధ్యానంలో ఉన్నారని, వారికి చెస్‌ జీవితాన్ని నేర్పుతుందని వెల్లడించారు. ఈ ఆట మేధస్సును పెంచుతుందని పరిశోధనలు కూడా చెబుతున్నాయని పేర్కొన్నారు. గ్రాండ్‌మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ రాసిన స్వీయచరిత్ర ‘మై మాస్టర్‌’ పుస్తకంలో చెస్‌, జీవితం ముడిపెట్టి చక్కగా వివరించారన్నారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని తమిళనాడులో చెస్‌ను విస్తృతంగా తీసుకెళ్తున్నామని వివరించారు. టోర్నమెంట్‌ డైరెక్టర్‌ భరత్‌సింగ్‌ చౌహాన్‌ మాట్లాడుతూ.. పోటీల గురించి ప్రకటించగానే బ్యాగు సర్దుకుని మహాబలిపురానికి వచ్చానన్నారు. 4 నెలలు ఇంటికి వెళ్లకుండా ఇక్కడి ఏర్పాట్లను చూసుకున్నానని వెల్లడించారు. ఇంత పెద్దటోర్నీలో భాగమైనందుకు గర్వంగా ఉందని, తమిళనాడు సీఎం లేకపోతే ఈ టోర్నీలో ఇంత ఘనంగా జరిగేదికాదన్నారు. ఏఐసీఎఫ్‌ అధ్యక్షులు సంజయ్‌కపూర్‌ మాట్లాడుతూ.. ఈ ఒలింపియాడ్‌తో భారత్‌ భవిష్యత్తులో మరింత పురోభివృద్ధి సాధిస్తుందన్నారు. ఫిడె అధ్యక్షులు ఆర్కడే డ్వొంకొవిచ్‌, ఫిడె ఉపాధ్యక్షుడు విశ్వనాథన్‌ ఆనంద్‌ తదితరులు ప్రసంగించారు.

భావోద్వేగంగా పతకాల వేడుక
టోర్నీలో విజేతలకు బంగారు, కాంస్యం, రజత పతకాల్ని అందించారు. భారత క్రీడాకారులు గుకేష్‌, నిహాల్‌ సెరిన్‌ బంగారుపతకాలు అందుకున్నారు. కాంస్య పతకాల్ని వైశాలి, ప్రజ్ఞానంద, అర్జున్‌, తానియా సచ్‌దేవ్‌, దివ్యా దేశ్‌ముఖ్‌ తదితరులు స్వీకరించారు. బెస్ట్‌ స్టైలిష్‌ యూనిఫామ్‌గా డెన్మార్క్‌ మహిళా జట్టు నిలిచింది. బెస్ట్‌ మెన్‌ యూనిఫామ్‌ ఉజ్బేకిస్తాన్‌, మంగోలియా జట్లు గెల్చుకున్నాయి. బెస్ట్‌ మహిళా యూనిఫామ్‌ అవార్డును ఉగాండా జట్టు స్వీకరించింది. తొలి భారత గ్రాండ్‌మాస్టర్‌ మాన్యుయెల్‌ ఆరోన్‌ను ముఖ్యమంత్రి స్టాలిన్‌ సన్మానించారు.

ఆకట్టుకున్న ప్రదర్శనలు
డ్రమ్స్‌ కళాకారుడు శివమణి, తదితరులు చేసిన ‘హార్ట్‌ బీట్‌ ఆఫ్‌ ఇండియా’ ప్యూజన్‌ మ్యూజిక్‌ ఆకట్టుకుంది. రూబిక్‌ క్యూబ్‌ను నిమిషంలోనే చేసి చిన్నారులు ఆకట్టుకున్నారు. తేలియాడే పియానోతో గాల్లో గుండ్రంగా తిరుగుతూ చేసిన విన్యాసం చూపరుల్ని ఆకట్టుకుంది. సాంస్కృతిక ప్రదర్శనలు అబ్బురపరిచాయి.

అవార్డు అందుకుంటున్న డెన్మార్క్‌ క్రీడాకారులు

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని