logo

మత్తుపదార్థాలకు అడ్డుకట్ట వేయండి

రాష్ట్రంలో మత్తుపదార్థాలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆదేశించారు. కలైవాణర్‌ ఆడిటోరియంలో వారితో బుధవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... రాష్ట్రంలో రోజురోజుకు మత్తుపదార్థాల విక్రయాలు, దానికి బానిసయ్యేవారి

Published : 11 Aug 2022 01:17 IST

కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం

కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షా సమావేశంలో ప్రసంగిస్తున్న స్టాలిన్‌

చెన్నై, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మత్తుపదార్థాలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆదేశించారు. కలైవాణర్‌ ఆడిటోరియంలో వారితో బుధవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... రాష్ట్రంలో రోజురోజుకు మత్తుపదార్థాల విక్రయాలు, దానికి బానిసయ్యేవారి సంఖ్య పెరగడం ఆవేదన కలిగిస్తోందన్నారు. దీనిని గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. భవిష్యత్తులో పెనుసమస్య కాకూడదని ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. గుజరాత్‌, మహారాష్ట్ర కన్నా తమిళనాడులో మత్తుపదార్థాలు తక్కువగా ఉన్నాయని సరిపెట్టుకోలేమని తెలిపారు. వాటికి ఒకరు బానిసైనా అది అవమానమేనని పేర్కొన్నారు. అన్నింటా అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రం ఇలాంటి విషయాల్లో మాత్రం  ప్రగతి సాధించకూడదని తెలిపారు. సమస్యల సాకుతో మత్తుకు బానిసకావడం పిరికితనమని, దానిని సమర్థించలేమని పేర్కొన్నారు. ఇది సమాజ సమస్య అని తెలిపారు. ఇదే హత్యలు, దోపిడీ, లైంగిక వేధింపులు వంటి పలు నేరాలకు కారణమవుతుందని చెప్పారు. నేరస్థుల్లో ఇలాంటి వారే ఎక్కువని వెల్లడించారు. తల్లిదండ్రులు, గురువులు కూడా విద్యార్థులపై పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. వ్యాపారులు, దుకాణదారులు కూడా వాటిని విక్రయించబోమని స్వీయ ప్రతిజ్ఞ చేయాలన్నారు. దుష్ప్రభావాల గురించి వైద్యులు, మానసిక వైద్యనిపుణులు ప్రచారం చేయాలని తెలిపారు. బాధితులకు పునరావాసం కల్పించడానికి ఎన్జీవోలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కీలక ఆదేశాలు
తమ జిల్లాలలో మత్తుపదార్థాలు లేకుండా కలెక్టర్లు, ఎస్పీలు చర్యలు చేపట్టాలని తెలిపారు. సంబంధిత వ్యాపారులను అరెస్టు చేసి ఆస్తులను స్తంభింపచేయాలని ఆదేశించారు. పొరుగు రాష్ట్రాల నుంచి మత్తుపదార్థాలను అక్రమంగా తరలించడాన్ని అడ్డుకునేందుకు సరిహద్దులపై  ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పొరుగు రాష్ట్రాల పోలీసుశాఖ సహకారాన్ని తీసుకోవచ్చని చెప్పారు. చెక్‌పోస్టుల్లో నిఘాను పటిష్ఠం చేయాలని కోరారు. తేని, దిండుగల్‌ వంటి కొండదిగువ ప్రాంతాలు, జనసంచారం లేని చోట్ల అంతర పంటలుగా గంజాయి సాగుచేసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆ భూముల్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని సూచించారు. కొరియర్‌ ద్వారా కూడా గంజాయి రవాణా జరుగుతున్నట్టు వార్తలు వినిపించడంతో ఆ సంస్థలకు హెచ్చరికలు జారీ చేయాలని తెలిపారు. తయారీదారుల జాబితా సిద్ధం చేసి సమాజానికి వెల్లడించాలన్నారు. వ్యాపారుల సామాజిక మాధ్యమాల ఖాతాలపై ఇంటెలిజెన్స్‌ నిఘా ఉంచాలని సూచించారు. విద్యా సంస్థల వసతి గృహాలపై నిఘా ఉంచాలని, వాటి వార్డెన్లకు మార్గదర్శకాలు విడుదల చేయాలని పేర్కొన్నారు. మత్తుపదార్థాలు గురించి సమాచారం ఇచ్చేందుకు టోల్‌ఫ్రీ నంబరు ప్రకటించాలని ఆదేశించారు. ఈ తరహా కేసులలో అరెస్టైనవారు వెంటనే బెయిల్‌పై విడుదల కాకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఎన్‌డీపీఎస్‌ కేసులు విచారించడానికి ప్రస్తుతం 12 ప్రత్యేక కోర్టులు ఉండగా, ఇకపై 2 జిల్లాలకు ఒక ప్రత్యేక కోర్టును తొలివిడతగా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మత్తుపదార్థాల నియంత్రణలో సమాచార సాంకేతిక ప్రాధాన్యత దృష్ట్యా ఈ విభాగానికి ప్రత్యేకంగా ‘సైబర్‌ సెల్‌’ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ప్రొహిబిషన్‌, మత్తుపదార్థాల నియంత్రణ విభాగాన్ని అనుసంధానం చేస్తూ జీవో విడుదల చేయనున్నట్టు తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఇరైయన్బు, డీజీపీ శైలేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

తిరుచ్చి జిల్లా యంత్రాంగానికి అభినందనలు

చెన్నై, న్యూస్‌టుడే: చెస్‌ ఒలింపియాడ్‌ అవగాహన కోసం పలు రికార్డులు సాధించిన తిరుచ్చి జిల్లా యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్‌ అభినందించారు. గతనెల 16న భారీ చదరంగ కార్యక్రమాన్ని యంత్రాంగం నిర్వహించింది. కంటోన్మెంట్‌లోని కేంబియన్‌ ఆంగ్లో ఇండియన్‌ మహోన్నత పాఠశాల ప్రాంగణంలో 2,140 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. ‘ఎలైట్‌’, ఆసియన్‌, ఇండియన్‌, తమిళన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ తదితర సంస్థలు ధ్రువపత్రాలు అందించాయి. వాటిని బుధవారం కలైవాణర్‌ ఆడిటోరియంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌కు మంత్రులు కేఎన్‌ నెహ్రూ, అన్బిల్‌ మహేశ్‌ పొయ్యామొళి చూపించారు. వెంట తిరుచ్చి కలెక్టరు ప్రదీప్‌కుమార్‌, నగర పోలీస్‌ కమిషనరు కార్తికేయన్‌, ఎస్పీ సుజీత్‌కుమార్‌ తదితరులు ఉన్నారు. వారిని సీఎం అభినందించారు.
ప్రజ్ఞానందకు జన్మదిన శుభాకాంక్షలు
చెన్నై: చదరంగ క్రీడాకారుడు ప్రజ్ఞానంద తన జన్మదినం సందర్భంగా బుధవారం కలైవాణర్‌ ఆడిటోరియంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు స్టాలిన్‌ స్వీటు తినిపించారు. శుభాకాంక్షలు తెలిపారు. వెంట మంత్రి మెయ్యనాథన్‌, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఇరైయన్బు ఉన్నారు.
ముత్తరసన్‌కు కూడా...
చెన్నై, న్యూస్‌టుడే: సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా మళ్లీ ఎన్నికైన ముత్తరసన్‌కు ముఖ్యమంత్రి స్టాలిన్‌ శుభాకాంక్షలు తెలిపారు. మూడోసారి ఆయన ఆ పదవికి ఎన్నికకావడాన్ని గుర్తు చేశారు. సమానత్వ దృక్పథ మార్గంలో తన లక్ష్యంవైపు విజయవంతమైన అడుగులు వేయాలంటూ ఆకాంక్షించారు.
బిహార్‌ ముఖ్యమంత్రికి..
చెన్నై, న్యూస్‌టుడే: బిహార్‌ ముఖ్యమంత్రికి స్టాలిన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. అందులో... బిహార్‌ ముఖ్యమంత్రిగా నితీశ్‌కుమార్‌, ఉప ముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్‌ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలని పేర్కొన్నారు. బిహార్‌లో మహాకూటమి పునరాగమనం దేశంలోని లౌకిక, ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతకు సానుకూల ప్రయత్నమని వ్యాఖ్యానించారు.

ధ్రువపత్రాలను ముఖ్యమంత్రికి చూపుతున్న దృశ్యం
 

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని