logo

పన్నీర్‌సెల్వంతో కలిసి పనిచేసే అవకాశాలు : టీటీవీ దినకరన్‌

ఒ.పన్నీర్‌సెల్వంతో కలిసి తాము పని చేయడానికి అవకాశాలున్నాయని ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన ఓ ఆంగ్ల దినత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో అన్నాడీఎంకేలో జరుగుతున్న కలహాలతో తనకు సంబంధ]ం లేదన్నారు. తాను నాలుగేళ్ల క్రితమే ప్రత్యేక పార్టీని ప్రారంభించానని

Published : 11 Aug 2022 01:17 IST

‌  టీటీవీ దినకరన్‌

మాట్లాడుతున్న శశికళ

విల్లివాక్కం, న్యూస్‌టుడే: ఒ.పన్నీర్‌సెల్వంతో కలిసి తాము పని చేయడానికి అవకాశాలున్నాయని ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన ఓ ఆంగ్ల దినత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో అన్నాడీఎంకేలో జరుగుతున్న కలహాలతో తనకు సంబంధ]ం లేదన్నారు. తాను నాలుగేళ్ల క్రితమే ప్రత్యేక పార్టీని ప్రారంభించానని గుర్తు చేశారు. పార్టీ సర్వసభ్య సమావేశం ఈ నెల 15వ తేదీన నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తమ పోరాటంలో విజయం సాధించి అన్నాడీఎంకేని చేజిక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే, ఏఎంఎంకే కలవడానికి దిల్లీలో కొందరు శ్రేయోబిలాషులు యత్నించడం నిజమేనన్నారు. డీఎంకే ప్రభుత్వం రాకూడదని దానికి సమ్మతించానని పేర్కొన్నారు. ఎడప్పాడి పళనిస్వామి వ్యక్తిగతంగా తనకి విరోధి కాదన్నారు. కానీ, ఆయనపై పలు ఆరోపణలున్నందువల్ల ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండకూడదని తెలిపానని చెప్పారు. ఆయనను ముందు నిలిపితే అన్నాడీఎంకే విజయం సాధించలేదని చెప్పానన్నారు. తమ యత్నాలకు ఎడప్పాడి మద్దతు ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. అందుకే దిల్లీలోని భాజపా అధిష్ఠానం ఆయనను పక్కన పెట్టిందని తెలిపారు. పార్టీలో పన్నీర్‌సెల్వం తర్వాత స్థానంలో ఎడప్పాడి సీనియర్‌గా ఉన్నందువల్ల శశికళ ఆయనను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినట్టు దినకరన్‌ గుర్తు చేశారు. శశికళ, పార్టీ కార్యకర్తలకు ఆయన తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. రాజకీయం కోసం ఆయన ఏమైనా చేస్తారని, శశికళకు వ్యతిరేకంగా వ్యవహరించిన ఎడప్పాడితో పన్నీర్‌సెల్వం చేతులు కలపడాన్ని తప్పుబట్టారు. ఆయనకు విషయం ఇప్పుడు అర్థమైందన్నారు. భవిష్యత్‌లో తాము పన్నీర్‌సెల్వంతో కలిసి పని చేయడానికి అవకాశాలున్నాయని చెప్పారు. కానీ, ఎడప్పాడిని నమ్మబోమని స్పష్టంచేశారు. 2016లో జయలలిత మృతి చెందినప్పుడు మంత్రులందరూ శశికళపై విశ్వాసం ఉంచినట్లు దినకరన్‌ గుర్తు చేశారు. అందుకే పన్నీర్‌సెల్వాన్ని పదవి నుంచి తప్పుకోవాలని చెప్పారని పేర్కొన్నారు. కానీ, ఆయన ధర్మయుద్ధం చేసి తప్పు చేశారని చెప్పారు. తర్వాత ప్రధాని మోదీ మాటలు విని ఎడప్పాడితో చేరారని పేర్కొన్నారు. పన్నీర్‌సెల్వం తనని సంప్రదించారని చెప్పడంలో వాస్తవం లేదన్నారు. ఆయన తనకు స్నేహితుడని, పదేళ్లు కలిసి పని చేశామని గుర్తుచేశారు. సమస్య చోటుచేసుకున్న సమయంలో వారంపాటు ఆయన మౌనం పాటిస్తే ప్రస్తుత రాజకీయ నాటకం జరిగేేది కాదని అభిప్రాయపడ్డారు. 2024లో కచ్చితంగా రాష్ట్రంలోని కూటమిలో మార్పులు చోటు చేసుకుంటాయని జోస్యం చెప్పారు. అన్నాడీఎంకే కార్యకర్తలు తనని నమ్ముతున్నారని చెప్పారు. ప్రజలు తనకి మద్దతు పలుకుతారన్న దిశగా శ్రమిస్తున్నట్టు దినకరన్‌ వివరించారు. 2024లో లోక్‌సభ ఎన్నికలు భాజపాకి చాలా ముఖ్యమని చెప్పారు. తగిన ప్రాధాన్యం ఇస్తే భాజపాతో పొత్తుకు ఆలోచిస్తానని పేర్కొన్నారు. లేదంటే ఒంటరి పోరు ఖాయమని స్పష్టం చేశారు.    
కార్యకర్తల మద్దతు మాకే: ఓపీఎస్‌
సైదాపేట, న్యూస్‌టుడే: అన్నాడీఎంకే కార్యకర్తలు తమవైపే ఉన్నారని నిర్వాహకులతో ఒ.పన్నీర్‌సెల్వం ధీమా వ్యక్తం చేశారు. బుధవారం పన్నీర్‌సెల్వం తన మద్దతుదారులతో సమావేశం నిర్వహించారు. పన్నీర్‌సెల్వం కొత్తగా నియమించిన జిల్లా కార్యదర్శులు పలువురు పాల్గొన్నారు. కార్యకర్తలంతా తమవైపే ఉన్నారని, ఆయా ప్రాంతాలకు వెళ్లి పార్టీ పనులు ముమ్మరం చేయాలని సూచించారు. కోర్టు కేసుల గురించి దిగులు చెందాల్సిన పనిలేదని, తీర్పులు అనుకూలంగానే వస్తాయని చెప్పారు. పళనిస్వామి సొంత జిల్లా సేలం నుంచి కూడా పలువురు నిర్వాహకులు సమావేశంలో పాల్గొన్నారు. రాజకీయ స్థితిగతుల గురించి పన్నీర్‌ వారిని అడిగి తెలుసుకున్నారు. మూడున్నర గంటలసేపు జరిగిన ఈ సమావేశంలో నిర్వాహకుల వ్యక్తిగత అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. బయటకు వచ్చిన నిర్వాహకులు ఉత్సాహంగా కనిపించారు. వారు విలేకరులతో మాట్లాడుతూ కార్యకర్తల మద్దతు ఎవరికి ఉందనేది చూడాలని, నిర్వాహకుల మద్దతు ఉంటే సరిపోదని పేర్కొన్నారు. కొన్ని రోజుల్లో అన్ని సమస్యలు తీరుతాయని తెలిపారు. అందరూ ఓపీఎస్‌ నేతృత్వంలో పనిచేస్తారని ధీమా వ్యక్తం చేశారు.  
అందర్నీ కలపడమే కర్తవ్యం: శశికళ
విల్లివాక్కం, ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: అన్నాడీఎంకే వారందర్నీ కలపడమే తన కర్తవ్యంగా భావిస్తున్నట్టు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ పేర్కొన్నారు. ఆమె బుధవారం ఓ కార్యక్రమం నిమిత్తం దిండిగల్లు వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. దిండిగల్లు లోక్‌సభ నియోజకవర్గంలో మొదటి సారిగా రెండాకుల చిహ్నంతో పోటీ చేసిన మాయద్దేవర్‌ ఘనవిజయాన్ని సాధించారని గుర్తు చేశారు. అదే అన్నాడీఎంకే విజయానికి నాంది పలికిందన్నారు. అందుకే ఆయనకు స్వయంగా వచ్చి నివాళి అర్పించినట్లు తెలిపారు. అన్నాడీఎంకే పేదల పార్టీ అని చెప్పారు. అధినేతలను కార్యకర్తలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. కార్యకర్తలు తనవైపు ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. 2024లో అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పడుతుందని పేర్కొన్నారు. అన్నాడీఎంకే విభజనకు డీఎంకే కారణమని ఆరోపించారు.  అన్నాడీఎంకేలో చీలికల సమస్య పరిష్కారం అవుతుందని, అమ్మ పాలన ఏర్పడుతుందని శశికళ అన్నారు. దిండుక్కల్‌ మాజీ ఎంపీ మాయదేవరన్‌కు నివాళులర్పించేందుకు బుధవారం ఆమె మదురై విమానాశ్రయానికి వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... త్వరలో అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని తెలిపారు.
మళ్లీ ప్రధాన కార్యదర్శి పదవి ఎందుకు?: హైకోర్టు    
ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: అన్నాడీఎంకేలో మళ్లీ ప్రధాన కార్యదర్శి పదవిని ఎందుకు సృష్టించారని ప్రశ్నించిన మద్రాసు హైకోర్టు, ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఈపీˆఎస్‌ వర్గాన్ని ఆదేశించింది. చెన్నైలో జులై 11వ తేదీన జరిగిన సర్వసభ్య సమావేశంపై ఓపీˆఎస్‌, వైరముత్తు వేసిన వ్యాజ్యం బుధవారం విచారణకు వచ్చింది. ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు వినిపించారు.

డీఎంకే కార్పొరేట్‌ సంస్థ: ఎడప్పాడి

కార్యక్రమంలో ప్రసంగిస్తున్న పళనిస్వామి

కాంచీపురం, న్యూస్‌టుడే: డీఎంకే కార్పొరేట్‌ కంపెనీ అని, పార్టీ కాదని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ధ్వజమెత్తారు. తిరుపత్తూర్‌, ధర్మపురి వేలూర్‌ జిల్లాల్లో పర్యటన ముగించుకొని మంగళవారం రాత్రి చెన్నైకు ఆయన తిరుగు పయనం అయ్యారు. కాంచీపురం సమీపంలో బాలిచెట్టి సత్రంలో జిల్లా అన్నాడీఎంకే నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. జిల్లా కార్యదర్శి వి.సోమ సుందరం నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అన్నాడీఎంకేలో తాను కింది స్థాయి నుంచి నేడు ప్రధాన కార్యదర్శి అయ్యానని పేర్కొన్నారు. ఇది అన్నాడీఎంకేలో మాత్రమే సాధ్యమని చెప్పారు. తమది ప్రజాస్వామ్య పార్టీ అని, డీఎంకే కార్పోరేట్‌ కంపెనీ అని ధ్వజమెత్తారు. అందులో కరుణానిధి, స్టాలిన్‌, ఉదయనిధి, ఇన్బనిధిలతో కలిపి అందరూ ‘నిధులు’ మాత్రమే ఉన్నారని వ్యాఖ్యానించారు. వారు మాత్రమే పదవుల్లోకి ఉంటారని పేర్కొన్నారు.  

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts