logo

సైక్లింగ్‌ పోటీల్లో పతకాల పంట

సైకిల్‌ నడపాలనే ఆసక్తితో మొదలైన అలవాటు నిరంతర కృషితో జిల్లా, రాష్ట్ర స్థాయిలో విజయం సాధించి పతకాలు అందుకునే స్థాయికి చేర్చింది. తర్వాత జాతీయ స్థాయిలో గెలుపొందడమే కాకుండా ప్రస్తుతం ఆసియా స్థాయిలో పోటీలకు అర్హత సాధించేలా చేసింది. తూత్తుకుడి జిల్లా ఒట్టపిట్టారం వద్ద ఉన్న కీళముడిమన్‌ గ్రామానికి చెందిన శ్రీమతి 12వ తరగతి విద్యార్థిని. ఈమె చిన్నతనం నుంచే సైకిల్‌ తొక్కడంలో

Published : 11 Aug 2022 01:17 IST

అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన రాష్ట్ర విద్యార్థిని  
ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే

పతకాలు చూపుతున్న శ్రీమతి

సైకిల్‌ నడపాలనే ఆసక్తితో మొదలైన అలవాటు నిరంతర కృషితో జిల్లా, రాష్ట్ర స్థాయిలో విజయం సాధించి పతకాలు అందుకునే స్థాయికి చేర్చింది. తర్వాత జాతీయ స్థాయిలో గెలుపొందడమే కాకుండా ప్రస్తుతం ఆసియా స్థాయిలో పోటీలకు అర్హత సాధించేలా చేసింది. తూత్తుకుడి జిల్లా ఒట్టపిట్టారం వద్ద ఉన్న కీళముడిమన్‌ గ్రామానికి చెందిన శ్రీమతి 12వ తరగతి విద్యార్థిని. ఈమె చిన్నతనం నుంచే సైకిల్‌ తొక్కడంలో అధికంగా ఆసక్తి చూపేది. సొంతంగా సైకిల్‌ లేకపోవడంతో పాఠశాలలో జరిగిన పోటీల్లో పాల్గొనేందుకు బంధువు నుంచి అడిగి తీసుకొంది. రాత్రి సమయాల్లో సాధన చేసి పోటీలో మొదటి బహుమతి అందుకుంది. తర్వాత జిల్లా, మండల స్థాయి పోటీల్లో పతకాలు, షీల్డ్‌లు సాధించింది. 2019 జనవరిలో రాష్ట్ర స్థాయిలో పోటీలకు ఎంపికైనా తగిన సైకిల్‌ కొనుగోలు చేయడానికి పేదరికం అడ్డురావడంతో పాల్గొనలేదు.


సైకిల్‌ నడుపుతూ...

వరుసగా పతకాలు

పోటీలకు తగిన సైకిల్‌ కొనివ్వాలని సాయం కోరుతూ పలువురిని కోరినా శ్రీమతికి నిరాశే ఎదురైంది. అప్పుడే తూత్తుకుడి ఎంపీ కనిమొళిని సంప్రదించింది. దీంతో రూ.5 లక్షల విలువైన రేసింగ్‌ సైకిల్‌ కొనిచ్చి ప్రోత్సహించారు. శిక్షణ పొంది రాష్ట్ర స్థాయిలో శ్రీమతి గెలిచి చూపించింది. జాతీయ స్థాయిలో పోటీ కోసం దిల్లీలోని అకాడమీలో శిక్షణ తీసుకుంది. 17ఏళ్ల వయసులోపు వారికి రాజస్థాన్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది. ముగ్గురితో కూడిన బృందం పోటీల్లో బంగారు పతకం, వ్యక్తిగత పోటీల్లో రజతం గెలిచింది. ఈ విజయం ద్వారా ఆసియా స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికైంది.


ఎంపీ కనిమొళి నుంచి సైకిల్‌ అందుకుంటున్న దృశ్యం

సహాయం మరువలేను...
తన క్రీడా ప్రయాణం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘‘నాన్న జేసుదాస్‌ దర్జీ పనిచేస్తున్నాడు. కరోనా దెబ్బకు సరిగ్గా పనులు లేకపోవడంతో వ్యవసాయం, ట్రాక్టర్‌ నడపడం వంటి పని చేశారు. అమ్మ తాయమ్మాల్‌ ఇంట్లోనే ఉంటుంది. నాకు ఒక చెల్లెలు. తను తొమ్మిదో తరగతి. చిన్నప్పటి నుంచే సైకిల్‌ నడపాలంటే చాలా ఇష్టం. కానీ మా ఇంట్లో సైకిల్‌ లేదు. మా బంధువు సైకిల్‌ తీసుకొని రాత్రి పూట సాధన చేసి తొక్కడం నేర్చుకున్నాను. 2020లో గ్రామంలో డీఎంకే తరఫున గ్రామసభ సమావేశం జరిగింది. అప్పుడు ఎంపీ కనిమొళి పాల్గొన్నారు. గ్రామంలో సమస్యలను అడిగి తెలుసుకొని వినతిపత్రాలు అందుకున్నారు. అప్పుడే నేను ఒక పేపర్‌పై విషయం రాసిచ్చాను. 10రోజుల్లో రూ.5లక్షల విలువైన రేసింగ్‌ సైకిల్‌ కనిమొళి కొనిచ్చారు. రాజస్థాన్‌లో జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో ఈ సైకిల్‌తో పాల్గొని బంగారు, వెండి పతకాలు గెలుపొందాను. ఆసియా స్థాయి పోటీలకు ఎంపిక అయ్యాయని కనిమొళి మేడమ్‌ని కలిసి చెప్పాను. అప్పుడు ఆమె నా భుజం తట్టి అభినందించారు. అంతేకాకుండా అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు రూ.15లక్షల విలువైన ట్రాక్‌ సైకిల్‌ కొనిచ్చారు. శిక్షణకు టీషర్ట్‌, డ్రస్‌, రన్నింగ్‌ షూస్‌, ట్రావెల్‌ బ్యాగ్‌ ఇచ్చారు. దిల్లీ వచ్చినప్పుడు నన్ను కలుస్తానని చెప్పారు. ప్రపంచ జూనియర్‌ మహిళల ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో గెలుపొంది కనిమొళికి అంకితం ఇస్తాను. మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించి దేశం, తమిళనాడు గర్వించేలా చేయడమే నా లక్ష్యం’’ అన్నారు.


 

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts