logo

భావోద్వేగాల్ని మోసుకెళ్లారు..!

చెస్‌ ఒలింపియాడ్‌ చరిత్రలో చెన్నై చిరస్థాయిగా నిలిచిపోయింది. మరోవైపు క్రీడాకారుల గుండెల్నీ గెలిచేసింది. టోర్నీ ముగిసినా క్రీడాకారులందరూ ఎంతో భావోద్వేగంతో చెన్నైని మర్చిపోనంతగా వారిని ఆకట్టుకుంది. ఆటగాళ్లలో ఎవరిని కదిపినా.. ‘వీ లవ్‌ ఇండియా, వీ లవ్‌ చెన్నై’ అని చెప్పారు. సుమారు 13 రోజులపాటు తామెంతో ఉత్సాహంగా గడిపామని తెలిపారు

Updated : 11 Aug 2022 06:53 IST

అద్భుత జ్ఞాపకాలతో వెనుదిరిగిన చెస్‌ క్రీడాకారులు

బంగారు పతకంతో గుకేష్‌

చెస్‌ ఒలింపియాడ్‌ చరిత్రలో చెన్నై చిరస్థాయిగా నిలిచిపోయింది. మరోవైపు క్రీడాకారుల గుండెల్నీ గెలిచేసింది. టోర్నీ ముగిసినా క్రీడాకారులందరూ ఎంతో భావోద్వేగంతో చెన్నైని మర్చిపోనంతగా వారిని ఆకట్టుకుంది. ఆటగాళ్లలో ఎవరిని కదిపినా.. ‘వీ లవ్‌ ఇండియా, వీ లవ్‌ చెన్నై’ అని చెప్పారు. సుమారు 13 రోజులపాటు తామెంతో ఉత్సాహంగా గడిపామని తెలిపారు. 

- ఈనాడు, చెన్నై
టోర్నీలో పదో రౌండ్‌ ముగిసేటప్పుడు భారత ఆటగాడు గుకేష్‌ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఏడుస్తూనే హాల్‌ నుంచి బయటికెళ్లిపోయారు. ఇలా ఎందుకు జరిగిందని అక్కడున్న చాలామంది ఆరా తీశారు. అసలు విషయం ఆ తర్వాత బయటికొచ్చింది. దేశంలోనే తొలిసారిగా చెస్‌ ఒలింపియాడ్‌ జరుగుతున్న తరుణంలో ఇండియాకు స్వర్ణాన్ని సాధించిపెట్టాలని ఇండియా-బి జట్టు కూడా ఆరాటపడింది. కానీ చిన్న తప్పువల్ల ఆట చేజారింది. దీంతో ఆ కల నెరవేరలేదని గుకేష్‌ తట్టుకోలేకపోయినట్లు జట్టు ఆటగాళ్లు చెప్పారు. తానొక్కడే ఏడ్వలేదని, జట్టుమొత్తం ఏడ్చారని వారంటున్నారు. దీంతో ఫైనల్‌ రోజు మరింత కసిగా ఆడామని చెబుతారు. గుకేష్‌ వ్యక్తిగతంగా బంగారుపతకం సాధించినా, జట్టుపరంగా రజతం దక్కింది.

కొత్త స్నేహితులతో క్రీడాకారులు

పెద్దఎత్తున సంబరాలు..
పతకం దక్కడం భారత్‌కే గర్వకారణమైంది. చెన్నైనుంచి తీపి జ్ఞాపకం తీసుకెళ్తున్నామంటూ భారత ఆటగాళ్లు చివరిరోజు రాత్రి సంబరాలు చేసుకున్నారు. జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో కొందరైతే నృత్యాలు కూడా చేశారు. కోచ్‌ రమేష్‌బాబు, ఇతర జట్టు ఆటగాళ్లు చేసిన నృత్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. భారత జట్టుకిది మరిచిపోలేని టోర్నీ అని ఆటగాళ్లు కితాబిస్తున్నారు. మరోవైపు ఇదొక చారిత్రక టోర్నీ అంటూ భారత క్రీడాకారిణి తానియా సచ్‌దేవ్‌ ముఖ్యమంత్రి స్టాలిన్‌కు తెలిపారు. క్రీడలపై సీఎం విజన్‌ ఆదర్శనీయమని వివరించారు.
దిగులుగానే విదేశాలకు..
భారత క్రీడాకారులేకాదు, విదేశీ ఆటగాళ్లు సైతం చెన్నైని వీడేందుకు భావోద్వేగాలకు గురయ్యారు. చాలామంది ఈ విషయాల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ‘ఇంత భావోద్వేగంతో కూడిన ఒలింపియాడ్‌ మరేదీ ఉండదు’ అని న్యూయార్క్‌కు చెందిన గ్రాండ్‌మాస్టర్‌ గ్రిగోరియన్‌ పేర్కొన్నారు. ‘నేను ఇండియాను వదిలి వెళ్లదలచుకోవడం లేదు’ అంటూ సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌కు చెందిన దినా బెలంకయ ట్వీట్‌ చేసింది. ఇలా వందలామంది క్రీడాకారులు చెన్నైని, భారత్‌ను  గుర్తుచేసుకుని ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేశారు. తమకు కొత్త స్నేహితులు కూడా ఈ టోర్నీ ద్వారా పరిచయమయ్యారంటూ యూఎస్‌కు చెందిన కరిస్సా యిప్‌ తెలిపారు.
‘ఆహా’రాన్ని మర్చిపోలేం
ఆటే కాదు.. ఇక్కడి ఆతిథ్యం, ఆహారంపై క్రీడాకారులు ప్రశంసలు కురిపించారు. ‘చెస్‌ చాలా క్లిష్టమైన ఆట, కానీ టోర్నీ నిర్వాహణ మాత్రం అద్భుతంగా ఉంది’ అని దక్షిణాఫ్రికాకు చెందిన క్రీడాకారిణులు తెలిపారు. ఇక్కడ ఆతిథ్యం, ఆహారం సూపర్‌ అన్నారు. అభిమానులు ఎంతో గొప్పగా ఉన్నారంటూ వివరించారు. మరోవైపు ప్రత్యేకించి వాలంటీర్లకు ధన్యవాదాలు చెప్పాలని, వారికి చెస్‌మీద ఎంతో జ్ఞానముందని, చాలా స్నేహపూర్వకంగా వ్యవహరించారని లూథియానాకు చెందిన పీటర్‌ హెయిన్‌నీల్సన్‌ తెలిపారు. భారత్‌ ఇంత గొప్ప టోర్నీకి ఆతిథ్యమివ్వడం చారిత్రక విషయమని, తొలిసారి అన్నికేటగిరీల్లో తొలిస్థానం సంపాదించిన మహిళ సుసన్‌ పోల్గర్‌ తెలిపారు.

ఈ అతివలు ప్రత్యేకం
ఒలింపియాడ్‌లోఅద్భుతం జరిగిందంటూలీడ్‌ కామెంటేటర్‌ గ్రాండ్‌మాస్టర్‌ జుడిత్‌ పోల్గర్‌ తెలిపారు.13మంది మహిళలు ఓపెన్‌ కేటగిరీలో తలపడ్డారని సంతోషం వ్యక్తంచేశారు. చాలా ప్రతిభ కనబరిచారని, మంచి భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని