logo
Published : 12 Aug 2022 00:32 IST

పుత్తడి నేలలు

జాతీయస్థాయిలో రాష్ట్రానిదే అగ్రపీఠం

జీవవైవిధ్య పరిరక్షణకు భారీగా నిధులు

జీవవైవిధ్య కోణంలో తమిళనాడు పేరు దేశంలో మారుమోగిపోతోంది. అంతర్జాతీయ గుర్తింపు పొందిన చిత్తడినేలల సంఖ్య ఏకంగా 10కి చేరడం రికార్డుగా మారింది. ఉత్తరప్రదేశ్‌తో కలిసి ఈ నేలలు ఎక్కువగా ఉన్న టాప్‌ రాష్ట్రంగా తమిళనాడు గుర్తింపుపొందింది. తాజాగా 75 వసంతాల ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా వెల్లడించిన 75 చిత్తడినేలల్లో తమిళనాడు ప్రముఖంగా ఉంది. దీంతో రాష్ట్రంలో జీవవైవిధ్యపరంగా కొత్త అధ్యాయం మొదలైందనే చెప్పాలి.

  - ఈనాడు-చెన్నై, న్యూస్‌టుడే-ప్యారిస్‌

చిత్తడినేలల పరిరక్షణలో పకడ్బందీ ప్రణాళికతో రాష్ట్రం ముందుకెళ్తోందని తాజాగా వెల్లడైన జాబితా ద్వారా తెలుస్తోంది. గతంలో 4 ప్రాంతాలు ఈ తరహా గుర్తింపు పొందగా, ఇప్పుడు కొత్తగా మరో 6 వచ్చి చేరాయి. మరో ఆసక్తికర విషయమేంటంటే.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ఏకంగా 13 ప్రతిపాదనలు వెళ్లాయి. దీన్నిబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని ప్రాంతాల్ని ఆ కోవలో చేర్చాలని యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

రక్షణ ఖాయం..
తాజాగా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో చిత్తడినేలల్లో అంతర్జాతీయ గుర్తింపు ఉన్న రామ్‌సర్‌ స్థలాలుగా 10 ప్రాంతాలు చేరాయి. గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ మెరైన్‌ బయోస్పేర్‌ రిజర్వ్‌తోపాటు పళ్లికరణై రిజర్వ్‌ఫారెస్ట్‌, పిచ్చవరం మడఅడవులు ఉన్నాయి. ఇంకా పక్షుల అభయారణ్యాల్లో కరికిలి, కూత్తంకులం, ఉదయమార్తాండపురం, వేడందాంగళ్‌, వెల్లోడ్‌ ప్రాంతాలు చేరాయి. వీటితోపాటు కొడియాక్కరై వైల్డ్‌లైఫ్‌ బర్డ్‌ సాంచునరీ, వేంబన్నూర్‌ చిత్తడినేలలు జాబితాలో స్థానం పొందాయి. వీటిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించనున్నట్లు రాష్ట్రం తెలిపింది. అన్ని విధాలా రక్షణకు కేంద్ర సహకరిస్తుందని, ప్రతి స్థలానికి సంబంధించిన తాజా సమాచారం, నివేదికల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షిస్తుంటాయన్నారు.

పర్యావరణం కోసం పండుగకు దూరం
కూత్తంకులం పక్షుల అభయారణ్యం చాలా ప్రత్యేకమైంది. తిరునెల్వేలి నుంచి 25కి.మీ. దూరంలో ఉందీ ప్రాంతం. ఇది ఎంత సున్నితమైన ప్రాంతమంటే.. ఇక్కడికొచ్చే వలస పక్షులరక్షణ కోసం దీపావళిరోజు టపాసులు కూడా కాల్చకుండా చుట్టుపక్కల గ్రామస్థుల కలిసి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వాటికేమాత్రం హాని కలగించడంలేదు. ఇక్కడ 224 జాతుల పక్షులున్నట్లు గుర్తించారు. ఇలాంటి ప్రాంతానికిప్పుడు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది.

కొడియాక్కరై.. ఇక పరవళ్లు
ఈ జంతు, పక్షుల అభయారణ్యం 38,500 హెక్టార్లలో విస్తరించి ఉంది. తొలి అంతర్జాతీయ గుర్తింపు పొందిన చిత్తడినేలగా గుర్తింపు పొందింది. 364 జాతుల పూల, 198 రకాల ఔషధమొక్కలున్నాయి. వీటి రక్షణకు అటవీశాఖ ముందుకొచ్చి సస్యరక్షణ చర్యలు చేపట్టింది.

మరిన్ని..
వెల్లోడ్‌ పక్షుల అభయారణ్యం ఈరోడ్‌లో ఉంది. ఇక్కడ నీటిరక్షణ లేకపోవడంలో పక్షులకు తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతుండేవి. గత కొన్నినెలలుగా ఈ ఇబ్బందిని తొలగిస్తూ దిగువ భవానీ ప్రాజెక్టు కెనాల్‌ ద్వారా, వర్షాలతో కురిసిన నీటిద్వారా సమస్యను దూరంచేశారు. పక్షులు ఇక్కడ వసతి ఏర్పరచుకునేందుకు నీటివనరుల్ని వృద్ధి చెందించాల్సిన అవసరముంది.
* వేంబన్నూర్‌ చిత్తడినేలలు కన్యాకుమారిలో ఉన్నాయి ఇక్కడ ఆక్రమణలు పెరిగాయి. ఆ ప్రభావం తగ్గిందని చెబుతున్నారు. ఉదయమార్తాండపురం పక్షుల అభయారణ్యం.. తిరువారూరులో తీరానికి 10కి.మీ. దూరంలో, 45 ఎకరాల్లో విస్తరించి ఉంది. వలస సీజన్‌లో  50వేలకు పైగా పక్షులు వస్తాయని అంచనా. కాంచీపురం జిల్లాలోని కరికిలి అభయారణ్యంలో 100 రకాల  పక్షులున్నాయి.

పళ్లికరణై..పెద్ద సవాలు
చెన్నై నగరానికి పక్కనే ఉన్న ఈ చిత్తడినేలలు ఆక్రమణలకు గురవుతున్నాయి. నగర విస్తరణతో ప్రభావానికి గురవుతున్నాయి. నిపుణులు చెప్పేదాన్నిబట్టి ముప్పావు భాగం కుంచించుకుపోయాయి. పెరుంగుడి డంపింగ్‌యార్డుతోపాటు వేలచ్చేరి-తాంబరం మధ్య భారీగా ఆక్రమణలున్నాయి. దీంతో సహజత్వాన్ని కోల్పోయింది. దీన్ని కాపాడటం అత్యవసరంగా మారింది. ఇప్పుడు రామసర్‌ ట్యాగ్‌ రావడంతో వీటి రక్షణ సులువవుతుందని భావిస్తున్నారు.

గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌.. అద్భుతం
ప్రపంచంలోనే అత్యంత విలువైన జీవవైవిధ]్యమున్న ప్రాంతంగా గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ మెరైన్‌ బయోస్పేర్‌ రిజర్వ్‌ గుర్తింపు పొందింది. 4,223 జాతుల మొక్కలు, జంతువులున్నాయి. సముద్రగర్భంలో అమూల్యమైన జీవసంపద ఉన్నట్లు గుర్తించారు. జల కాలుష్యం ఇప్పుడు వేధిస్తున్నందున పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

వేడం దాంగళ్‌కు ‘జీవం’
దేశంలోనే పురాతన పక్షుల అభయారణ్యంగా వేడందాంగళ్‌ ప్రసిద్ధి చెందింది. గతంతో దీని పరిధి తగ్గించడంపై చాలాపెద్ద వివాదమే రేగింది. పర్యావరణవేత్తలు సైతం ఈ ప్రక్రియను వ్యతిరేకించారు. తర్వాత దీని విస్తీర్ణంలో ఎలాంటి తగ్గింపులు చేయబోమని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఇక్కడి జీవవైవిద్యం ప్రపంచ గుర్తింపు పొందింది.

పిచ్చవరం.. రక్షణ దిశగా
సుమారు వెయ్యి ఎకరాల్లో పిచ్చవరం మడఅడవులు విస్తరించాయి. బంగాళాఖాతం తీరంలో పక్షులు, జంతువులకు అత్యంత కీలకస్థలంగా మారాయి. కొన్నేళ్లుగా ఇక్కడి పర్యావరణం ఇబ్బందుల్లో పడింది. చుట్టుపక్కల పెద్దఎత్తున రొయ్యలచెరువులు వెలిశాయి. ఆక్రమ తవ్వకాలు, నీటి వాడకం పెరిగింది. మడ అడవులు చాలావరకు దెబ్బతిన్నాయి. దీంతో చుట్టుపక్కల వాతావరణ మార్పులు సంభవిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు సంరక్షణ చర్యల్ని చేపట్టారు.

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని