logo
Updated : 12 Aug 2022 02:55 IST

మత్తుపదార్థాల నిర్మూలనకు చట్టాలు కఠినతరం

ముఖ్యమంత్రి స్టాలిన్‌ వెల్లడి

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోను ప్రారంభిస్తున్న సీఎం

చెన్నై, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మత్తుపదార్థాల నిర్మూలనకు చట్టాలను కఠినతరం చేయనున్నట్టు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. చెన్నైలోని కలైవాణర్‌ ఆడిటోరియంలో ‘మత్తుపదార్థాల రహిత తమిళనాడు’ పథక ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం జరిగింది. ఇందులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... రాష్ట్రంలో పెరుగుతున్న మత్తుపదార్థాల ఉపయోగాన్ని అడ్డుకోవడానికి ప్రజల సహకారం కూడా తప్పనిసరిగా ఉండాలన్నారు. మత్తుపదార్థాల నిర్మూలనకు చట్టాలను కఠినతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఆ మేరకు చట్ట సవరణలు చేయనుందని తెలిపారు. ప్రత్యేకంగా కోర్టులు, సైబర్‌ సెల్‌, ఇంటెలిజెన్స్‌ సెల్‌ను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. మత్తుపదార్థాల వ్యాపారుల ఆస్తులను స్వాధీనం చేసుకోనున్నట్టు తెలిపారు. సమాజానికి హాని కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి తమ ప్రభుత్వం జంకదని హెచ్చరించారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత 41,625 మంది అరెస్టయ్యారని చెప్పారు. రూ.50 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మత్తుపదార్థాలతో సమాజానికి ఏర్పడే హాని గురించి వివరించారు. విద్యార్థులతో తల్లిదండ్రులు ఎక్కువ సమయం గడపాలని, వారి బాగోగులు తెలుసుకోవాలని హితవు పలికారు. 45 నిమిషాల పాఠ్యసమయంలో కనీసం 5 నిమిషాలైనా విద్యార్థులతో బోధనేతర విషయాలు గురించి చర్చించాలని, దిగాలుగా కనిపించే వారితో వ్యక్తిగతంగా మాట్లాడాలని ఉపాధ్యాయులకు సూచించారు. పశ్చిమదేశాల్లో అవగాహన పెరగడంతో మత్తుపదార్థాల వాడకం తగ్గుముఖం పట్టిందని తెలిపారు. ప్రస్తుతం ఆసియా దేశాల్లో వాడకం పెరిగినట్టు అధ్యయనాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూడా అవగాహన పెరగాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, పాఠశాల, కళాశాల విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 30 లక్షల మంది విద్యార్థులు ఈ ప్రతిజ్ఞ చేసినందుకుగాను వరల్డ్‌ రికార్డ్స్‌ యూనియన్‌, ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థలు ధ్రువపత్రాలను ముఖ్యమంత్రికి అందించాయి. మత్తుపదార్థాల ఇంటెలిజెన్స్‌, ప్రొహిబిషన్‌ విభాగాలను అనుసంధానిస్తూ కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ బ్యూరో వెబ్‌సైట్‌ ద్వారా 30 గంటల అవగాహన ప్రచారాన్ని, ప్రచార డాక్యుమెంటరీని కూడా ఆవిష్కరించారు. కార్యక్రమంలో వీడియో కాన్ఫెరెన్స్‌ ధర్మపురి నుంచి పీఎంకే ఎమ్మెల్యే జీకే మణి ప్రసంగించారు. కార్యక్రమంలో మంత్రులు అన్బిల్‌ మహేశ్‌ పొయ్యామొళి, శేఖర్‌బాబు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఇరైయన్బు, హోంశాఖ అదనపు ప్రధానకార్యదర్శి ఫణీంద్ర రెడ్డి, డీజీపీ శైలేంద్రబాబు, గ్రేటర్‌ చెన్నై పోలీస్‌ కమిషనరు శంకర్‌ జివాల్‌, ఏడీజీపీ మహేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని