logo

విధులకు వెళ్లిన పది రోజుల్లో వీరమరణం

తల్లిదండ్రులను చూసి వెళ్లిన పది రోజుల్లో మదురై జిల్లాకు చెందిన సైనికుడు లక్ష్మణన్‌ వీరమరణం చెందారు. కశ్మీర్‌లో జరిగిన ఉగ్రమూక దాడిలో మరణించిన ముగ్గురు సైనికుల్లో మదురై జిల్లా తుమ్మకొండు పుదుపట్టికి చెందిన లక్ష్మణన్‌ కూడా ఉన్నారు.

Published : 12 Aug 2022 00:32 IST

లక్ష్మణన్‌ (పాత చిత్రం)

చెన్నై, న్యూస్‌టుడే: తల్లిదండ్రులను చూసి వెళ్లిన పది రోజుల్లో మదురై జిల్లాకు చెందిన సైనికుడు లక్ష్మణన్‌ వీరమరణం చెందారు. కశ్మీర్‌లో జరిగిన ఉగ్రమూక దాడిలో మరణించిన ముగ్గురు సైనికుల్లో మదురై జిల్లా తుమ్మకొండు పుదుపట్టికి చెందిన లక్ష్మణన్‌ కూడా ఉన్నారు. తండ్రి ధర్మరాజ్‌ రైతు. తల్లి ఆండాళ్‌. వారికి పుట్టిన కవలల్లో ఒకరు లక్ష్మణన్‌ కాగా మరొకరు రామ్‌. కామర్స్‌ డిగ్రీ చదివిన లక్ష్మణన్‌ 4ఏళ్ల కిందట సైన్యంలో చేరారు. ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు దుఃఖసాగరం మునిగారు. బంధుమిత్రులు, గ్రామస్థుల్లో విషాదఛాయలు అలముకున్నాయి. కుమారుడి మృతిని తట్టుకోలేకపోతున్నామని ధర్మరాజ్‌ కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామంలోని సమీప బంధువు సైన్యంలో ఉండటంతో ఆ స్ఫూర్తితో లక్ష్మణన్‌ కూడా చేరారని సోదరుడు రామ్‌ చెప్పారు. తల్లిదండ్రులను చూసేందుకు జులై 23న వచ్చిన లక్ష్మణన్‌ పది రోజుల క్రితమే తిరిగి వెళ్లారని తెలిపారు. అంతలోనే విషాదవార్త అందిందని ఆవేదన చెందారు. భౌతికకాయాన్ని శనివారం సొంతూరుకు తీసుకురానుండగా, సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు