logo

వరుస సెలవులతో పెరిగిన విమాన ఛార్జీలు

చెన్నై నుంచి ఇతర నగరాలు, పట్టణాలకు విమాన ఛార్జీలు బాగా పెరిగాయి. రక్షాబంధన్‌, వారాంతపు సెలవులు, స్వాతంత్య్ర దినం కలిసి రావడం, వరుస సెలవులతో పలు ప్రాంతాలకు డిమాండు కూడా తోడైంది.

Updated : 12 Aug 2022 02:56 IST

వడపళని, న్యూస్‌టుడే: చెన్నై నుంచి ఇతర నగరాలు, పట్టణాలకు విమాన ఛార్జీలు బాగా పెరిగాయి. రక్షాబంధన్‌, వారాంతపు సెలవులు, స్వాతంత్య్ర దినం కలిసి రావడం, వరుస సెలవులతో పలు ప్రాంతాలకు డిమాండు కూడా తోడైంది. శుక్రవారం సాయంత్రం, శనివారం ఉదయం కొన్ని ప్రాంతాలకు ఒక సారి వెళ్లేందుకు రూ. 10వేల వరకు టిక్కెట్టు ఛార్జీగా ఉంది. ముంబైకి రూ. 8,000 - 9,600, దిల్లీకి రూ. 9,500 - 10,000/-, బెంగళూరుకు రూ. 6,000 - రూ. 9,000గా ఉంది. రాష్ట్రంలోని మదురై, ట్యుటికోరిన్‌లకు రూ. 10 వేలు ఛార్జీ కింద వసూలు చేస్తున్నారు. కృష్ణజయంతి, వినాయక చవితి, వారాంతపు సెలవులు కలిసి రావడంతో ఆగస్టు నెలంతా ఛార్జీలు ఇంకా పెరిగే అవకాశాలున్నాయని పలువురు ట్రావెల్‌ ఏజెంట్లు పేర్కొన్నారు. డిమాండు బాగా ఎక్కువగా ఉండటంతో వచ్చే నెలలో రాయితీ కల్పించేందుకు కొన్ని విమాన సంస్థలు ఆలోచిస్తున్నాయి. ఈజ్‌ మై ట్రిప్‌ ట్రావెల్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు నిశాంత్‌ పిట్టి మాట్లాడుతూ వారాంతంలో 70 శాతం వరకు బుకింగులు ఎక్కువయ్యాయన్నారు. గోవా, రాజస్థాన్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కూర్గ్‌, కేరళ ప్రాంతాలకు ఎక్కువమంది టిక్కెట్లను బుక్‌ చేసుకున్నారు. హోటళ్ల రిజర్వేషన్లు కూడా డిమాండుగా ఉన్నాయి. బుకింగ్‌ డాట్‌ కామ్‌లో  ఆగస్టులో ముంబైకి సమీపంలో ఉన్న లోనావాలా, కొచ్చికి విశ్రాంతి, తీర్థయాత్రల కోసం తిరుపతి, షిర్డి, రిషికేష్‌, వారసత్వ యాత్ర (హెరిటేజ్‌ ట్రిప్‌)గా జైపూర్‌, ఉదయ్‌పూర్‌, ఆగ్రా, బీచ్‌ సందర్శించేందుకు పుదుచ్చేరి, గోవా, పురి, కొండ ప్రాంతాలైన ఊటీ, కొడైక్కెనాల్‌, మున్నార్‌ వంటి ప్రాంతాలకు రిజర్వేషన్లు జోరుగా ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు విమానాలు, హోటళ్లు నిండి పోయాయని మదురై ట్రావెల్స్‌ ప్రతినిధి శ్రీహరన్‌ బాలన్‌ పేర్కొన్నారు. చివరి క్షణాల్లో బుకింగ్‌ కోసం వచ్చే వారికి ఇబ్బందులు తప్పవని,  సీట్లు బాగా తక్కువగా ఉన్నాయని చెప్పారు. ఆగ్నేయాసియా దేశాల నుంచి పర్యాటకుల రాక కూడా ఎక్కువ కావడంతో డొమెస్టిక్‌ విమాన ఛార్జీలు, హోటల్‌ రూము అద్దెలు కూడా పెరిగాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని