logo

వందేభారత్‌కు మరిన్ని హంగులు

ఐసీఎఫ్‌లో అధునాతన సాంకేతికతతో తయారుచేసిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ట్రయన్‌రన్‌ శుక్రవారం ప్రారంభమైంది. ఐసీఎఫ్‌ను సందర్శించిన కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌ ఈ రైలులో కొంతదూరం ప్రయాణించారు.

Published : 13 Aug 2022 07:04 IST

చెన్నై నుంచి మొదలైన ట్రయల్‌రన్‌

నగరంలో వందేభారత్‌ ట్రయల్‌రన్‌ విహంగవీక్షణం

ఈనాడు, చెన్నై: ఐసీఎఫ్‌లో అధునాతన సాంకేతికతతో తయారుచేసిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ట్రయన్‌రన్‌ శుక్రవారం ప్రారంభమైంది. ఐసీఎఫ్‌ను సందర్శించిన కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌ ఈ రైలులో కొంతదూరం ప్రయాణించారు. ఎదురెదురు రైళ్లు వచ్చినప్పుడు ప్రమాదాలు జరగకుండా ఈ రైలుకు ఉంచి ‘కవచ్‌’ సాంకేతికత విజయవతంగా పనిచేస్తోందని, ప్రయోగాత్మకంగా ఇది వెల్లడైందని చెప్పారు. అంతకుముందుగా ఆయన ఐసీఎఫ్‌లో ఉన్న వందేభారత్‌ రైలును పరిశీలించారు. అక్కడి అధికారులతో మాట్లాడారు. రైలు నాణ్యత చాలాబాగుందని చెబుతూ ఐసీఎఫ్‌ అధికారుల్ని, యంత్రాంగాన్ని ప్రత్యేకించి అభినందించారు. ఇక్కడి సిబ్బంది పనితీరుకు మెచ్చి రూ.10 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. ఈ రైలు చెన్నై నుంచి బయలుదేరి 15 వేల కి.మీ. పాటు ట్రయల్‌రన్‌లో పాల్గొంటుందని తెలిపారు. ఐసీఎఫ్‌ కేంద్రంగానే 75 వందేభారత్‌ రైళ్లను తయారుచేయిస్తున్నట్లు రైల్వేమంత్రి ప్రకటించారు. ఆయన వెంట ఐసీఎఫ్‌ జీఎం ఏకె అగర్వాల్‌, దక్షిణ రైల్వే జీఎం బీజీ మాల్యా, ఐసీఎఫ్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ మెకానికల్‌ ఇంజినీర్‌ ఎస్‌.శ్రీనివాస్‌, ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌ డీపీ దాస్‌ తదితరులున్నారు. ఐసీఎఫ్‌లో వందేభారత్‌ రైలును పరిశీలించేటప్పుడు కేంద్రమంత్రితో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కూడా ఉన్నారు.

వందేభారత్‌ రైలు కోచ్‌ను పరిశీలిస్తున్న రైల్వేమంత్రి

చిన్నారులతో కలిసి..
ప్రధాని మోదీ పిలుపు మేరకు ఇళ్లపై జాతీయ జెండాలు ఎగురవేసే కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో భాగంగా రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌ శుక్రవారం పలు ప్రాంతాలు పర్యటించారు. ఐసీఎఫ్‌ రైల్వేకాలనీలోని సిల్వర్‌ జూబ్లీ స్కూల్‌ ఆధ్వర్యంలో జరిగిన తిరంగా యాత్రలో  జెండాలు పట్టుకున్న పిల్లలతో హుషారుగా కదిలారు. ఐసీఎఫ్‌ పోస్టాఫీస్‌ను సందర్శించి అక్కడ మువ్వన్నెల పతాకాలను ఆన్‌లైన్‌లో యూపీఐ ఖాతా ద్వారా డబ్బుపంపి కొన్నారు. తిరువళ్లిక్కేణిలోని ఎమ్మార్టీఎస్‌ రైల్వేస్టేషన్‌లో జాతీయ జెండాను పట్టుకుని కదిలారు. అక్కడే ఏర్పాటుచేసిన మహాకవి భారతీయార్‌ ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. రైల్వేస్టేషన్‌లోనే జరిగిన కార్యక్రమంలో పలువురు స్వాతంత్య్ర సమరయోధులు, వారి కుటుంబసభ్యుల్ని సత్కరించారు. అనంతరం ఆయన భారతీయార్‌ స్మారక గృహానికి వెళ్లారు. అక్కడి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తన రచనలతో వేలాదిమంది యువతను కదిలించిన మహాకవిగా భారతీయార్‌ను కొనియాడారు. ఈ సందర్భంగా పిల్లలు పాడిన భారతీయార్‌ పాటల్ని విని సంతోషించారు. ఆయన వెంట దక్షిణ రైల్వే అధికారులున్నారు.

ఐసీఎఫ్‌ సిల్వర్‌ జూబ్లీ పాఠశాల పిల్లలతో మువ్వన్నెల జెండాలతో అశ్వినీవైష్ణవ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని