logo

పథకాల తీరుపై స్పష్టంగా చెప్పండి

ప్రభుత్వం ప్రకటించే పథకాలను విశ్లేషించి సానుకూల, ప్రతికూల అంశాలను స్పష్టంగా తెలియజేయాలని రాష్ట్ర ప్రణాళిక కమిషన్‌కు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సూచించారు. చెన్నై చేపాక్కంలోని రాష్ట్ర కమిషన్‌ కార్యాలయంలో శుక్రవారం కమిషన్‌ సమావేశం జరిగింది.

Published : 13 Aug 2022 05:45 IST

ప్రణాళిక కమిషన్‌కు సీఎం సూచన

కమిషన్‌ సమావేశంలో ప్రసంగిస్తున్న స్టాలిన్‌

చెన్నై, న్యూస్‌టుడే: ప్రభుత్వం ప్రకటించే పథకాలను విశ్లేషించి సానుకూల, ప్రతికూల అంశాలను స్పష్టంగా తెలియజేయాలని రాష్ట్ర ప్రణాళిక కమిషన్‌కు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సూచించారు. చెన్నై చేపాక్కంలోని రాష్ట్ర కమిషన్‌ కార్యాలయంలో శుక్రవారం కమిషన్‌ సమావేశం జరిగింది. కమిషన్‌ ఛైర్మన్‌నైన ముఖ్యమంత్రి స్టాలిన్‌ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 15 నెలల్లో ఇది మూడో సమావేశమని తెలిపారు. ప్రభుత్వం పయనించే మార్గాన్ని విశ్లేషించి సరైన మార్గాన్ని నిర్దేశించడానికి ఈ కమిషన్‌ సహకరిస్తోందని పేర్కొన్నారు. ఇ-వాహన, ఇండస్ట్రియల్‌ 4.ఓ, సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థలు, జౌళి, చేనేత, పర్యాటక విధానాలను త్వరలో రూపొందించి అందించాలని కోరారు. ప్రజలకు మేలు చేసేలా, రాష్ట్ర అభివృద్ధికి సహకరించేలా ఈ విధానాలు ఉండాలని తెలిపారు. వైద్యం, సామాజిక సంక్షేమం, ఉద్యోగావకాశాలు, పర్యావరణం వంటి కీలక రంగాలకు చెందిన కొన్ని విధానాలను కూడా దార్శనికతతో రూపొందించి ఖరారు చేస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ఆర్థిక విప్లవమని అభివర్ణించారు. దీనివల్ల లబ్ధిదారుల జీవన ప్రమాణాలు ఏ మేరకు మెరుగయ్యాయనే విషయాన్ని గుర్తించడానికి చేపట్టిన అధ్యయనాన్ని త్వరగా ముగించాలని సూచించారు. పౌరసరఫరాల పథకం, మక్కళై తేడి మరుత్తువం, ఇల్లం తేడి కల్వి తదితర ప్రభుత్వం అన్ని పథకాలు నిరాటంకంగా ప్రజలకు చేరే మార్గాన్ని గుర్తించాలని తెలిపారు. ప్రకటించే పథక సానుకూల, ప్రతికూల అంశాలను విశ్లేషించి ప్రభుత్వానికి వెల్లడించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు గురించి కథనాలు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రచురించడం ద్వారా ద్రావిడ మోడల్‌ సర్కారును ప్రచారం చేయాలని తెలిపారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం గురించి కథనాలు పలు వేదికలపై రావాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలపై ఇతర రాష్ట్రాల మేధావులు, సామాజిక కార్యకర్తల అభిప్రాయాలు, ఆలోచనలను తెలుసుకుని చెప్పాలన్నారు. అభివృద్ధిపరంగా జిల్లాల్లో అసమానతలు ఉండకూడదని, దాని కోసం జిల్లాల అవసరాలు గురించి అధ్యయనం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించాలని సూచించారు. ఇక్కడి పథకాలను ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నట్టే అక్కడి ఉత్తమ పథకాలు గురించి కూడా తెలియజేయాలని కోరారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఇరైయన్బు, కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ జయరంజన్‌, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర మంతికి లేఖ.. శ్రీలంక అరెస్టు చేసిన రాష్ట్ర జాలర్లను త్వరగా విడిపించడానికి చర్యలు చేపట్టాలంటూ కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్‌ను  ముఖ్యమంత్రి స్టాలిన్‌ కోరారు. ఈ మేరకు శుక్రవారం రాసిన లేఖలో... చేపలు పట్టేందుకు 6వ తేది సముద్రంలోకి వెళ్లిన రాష్ట్రానికి చెందిన 9 మంది జాలర్లను 10వ తేది శ్రీలంక నావికా దళం అరెస్టు చేసిందని తెలిపారు. ఆ జాలర్లను, వారి బోట్లను త్వరగా విడిపించడానికి దౌత్య చర్యలను వెంటనే చేపట్టాలని కోరారు.

మార్కెట్లోకి ప్రభుత్వ ఉప్పు.. రాష్ట్ర ఉప్పు సంస్థ తరఫున మార్కెట్లోనూ ఉప్పు విక్రయాలను ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రారంభించారు. తమిళనాడు సాల్ట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ద్వారా అయోడైజ్డ్‌ కల్లు ఉప్పు, అయోడైజ్డ్‌ ఫ్రీ ఫ్లో ఉప్పు, డబుల్‌  ఫోర్టిఫైడ్‌ సాల్ట్‌లను రేషన్‌ దుకాణాలు ద్వారా, మధ్యాహ్న భోజన పథకానికి విక్రయిస్తున్నారు. వాటిని మార్కెట్‌లోనూ విక్రయించనున్నట్టు గత ఏడాది కార్మికశాఖ పద్దుల సందర్భంగా శాసనసభలో ప్రకటించారు. ఆ మేరకు ‘నెయ్‌దల్‌ ఉప్పు’ పేరిట అయోడైజ్డ్‌ కల్లు ఉప్పు, అయోడైజ్డ్‌ ఫ్రీ ఫ్లో ఉప్పు విక్రయాలను ముఖ్యమంత్రి స్టాలిన్‌ సచివాలయంలో శుక్రవారం ప్రారంభించారు. ఉప్పు ఉత్పత్తి ఉండని అక్టోబరు నుంచి డిసెంబరు వరకు కయ్యల కార్మిక కుటుంబాలకు రూ.5వేల చొప్పున సాయం అందజేత పథకాన్ని కూడా ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి గణేశన్‌, ఎంపీ కనిమొళి, ప్రధాన కార్యదర్శి ఇరైయన్బు తదితరులు పాల్గొన్నారు. హజ్‌ ప్రయాణికులకు రాయితీ అందజేత.. ఈ ఏడాదిలో రాష్ట్ర హజ్‌ కమిటీ ద్వారా హజ్‌ ప్రయాణం చేపట్టిన 1,649 మందికి రూ.27,628 చొప్పున రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ మొత్తం రూ.4.56 కోట్ల అందజేతను ముఖ్యమంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి మస్తాన్‌ తదితరులు పాల్గొన్నారు. ఉలేమాలకు సైకిళ్ల పంపిణీ.. బీసీ, ఎంబీసీ, మైనారిటీల సంక్షేమశాఖ తరఫున ఉలేమాలు, ఉద్యోగుల సంక్షేమ బోర్డు సభ్యులకు సైకిళ్ల అందజేత పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. రూ.5 కోట్ల వ్యయంతో 10,583 మంది ఉలేమాలకు సైకిళ్ల అందజేతకు సూచనప్రాయంగా ముగ్గురు ఉలేమాలకు వాటిని స్టాలిన్‌ అందించారు.

ఏనుగులను కాపాడాలని పిలుపు.. ఏనుగులను కాపాడాలంటూ ముఖ్యమంత్రి స్టాలిన్‌ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఆయన ఓ ట్వీట్‌ చేశారు. అందులో... రాష్ట్ర ఐదో ఏనుగుల రిజర్వుగా తిరునెల్వేలి జిల్లాలోని అగతియమలైను ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో ప్రకటించడం ముదావహమని తెలిపారు. వన పర్యావరణ వ్యవస్థ సమతుల్యంలో ఏనుగులు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రకృతి సంపదైన ఆ క్షీరదాలను ఎంతటి మూల్యం చెల్లించైనా కాపాడాలని పిలుపునిచ్చారు.

సీపీఐ నేతల కృతజ్ఞతలు.. ముఖ్యమంత్రి స్టాలిన్‌ను సీపీఐ నేతలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీపీఐ సీనియర్‌ నేత నల్లకన్ను, రాష్ట్ర కమిటీ కార్యదర్శి ముత్తరసన్‌ తదితరులు శుక్రవారం స్టాలిన్‌ను కలిశారు. తిరుప్పూరులో జరిగిన సీపీఐ రాష్ట్ర 25వ మహానాడులో వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా పాల్గొని జీవాకు శివగంగై జిల్లా శిరావయల్‌లో స్మారక మండపం నిర్మించనున్నట్టు ప్రకటించినందుకు కృతజ్ఞత తెలిపారు. ‘తగైసాల్‌ తమిళర్‌’ పురస్కారాన్ని నల్లకన్నుకు ప్రకటించినందుకూ కృతజ్ఞత చెప్పారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీ టీకేఎస్‌ ఇళంగోవన్‌ ఉన్నారు. ఈ సమావేశం గురించి తన ట్విట్టర్‌ పేజీలో స్టాలిన్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని