logo

పన్నీర్‌ రహస్య మంతనాలు?

శశికళ, టీటీవీ దినకరన్‌ను పన్నీర్‌సెల్వం రహస్యంగా కలిసి మాట్లాడినట్లు సమాచారం. జులై 11న జరిగిన సర్వసభ్య సమావేశం చెల్లదని ప్రకటించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు పన్నీర్‌సెల్వం.

Updated : 14 Aug 2022 05:30 IST

రాష్ట్రవ్యాప్త పర్యటనలు 

అన్నాడీఎంకేలో కొనసాగుతున్న అంతర్యుద్ధం

సైదాపేట, న్యూస్‌టుడే: శశికళ, టీటీవీ దినకరన్‌ను పన్నీర్‌సెల్వం రహస్యంగా కలిసి మాట్లాడినట్లు సమాచారం. జులై 11న జరిగిన సర్వసభ్య సమావేశం చెల్లదని ప్రకటించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు పన్నీర్‌సెల్వం. అదే సమయంలో రాష్ట్రవ్యాప్త పర్యటన చేసి పార్టీలో తన ఆధిపత్యం నిరూపించుకునేందుకు ఎడప్పాడి పళనిస్వామి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరూ ఊహించని విధంగా రహస్య సంప్రదింపులు జరిగినట్లు సమాచారం. త్వరలో విడుదల కానున్న కోర్టు తీర్పు అన్నాడీఎంకే భవిష్యత్తును తీర్మానించనున్న నేపథ్యంలో పార్టీలో జరిగే ఈ గందగోళం పరిస్థితులు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

భేటీ వెనుక ఆంతర్యం ఇదేనా.. 

ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే భవిష్యత్తు గురించి పన్నీర్‌సెల్వం, శశికళ రహస్యంగా చర్చించినట్లు పన్నీర్‌ సన్నిహితుల సమాచారం. జూన్‌ 23న జరిగిన సర్వసభ్య సమావేశం తర్వాత కొన్ని రోజులకు శశికళకు కావాల్సిన పాత్రికేయుడు ఒకరిని పన్నీర్‌ కలిసినట్లు తెలుస్తోంది. పార్టీ సంక్షేమం కోసం శశికళ మద్దతు ప్రస్తుతం మనకు అవసరమని, అందరమూ కలిసి పని చేసేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదని అతని వద్ద చెప్పారు. ఈ విషయం ఆ పాత్రికేయుడి ద్వారా శశికళ చెవిన పడింది. ఆ తర్వాతే టీనగర్‌లోని శశికళ, ఓపీఎస్‌ రహస్యంగా భేటీ అయినట్లు, ముందు ఆయన్ను నిర్వాహకులను సమన్వయపరిచే పని చూడమని చెప్పినట్లు సమాచారం. అప్పటి నుంచి ఫోన్‌ ద్వారా పన్నీర్‌, శశికళ మాట్లాడుకుంటున్నట్లు కూడా పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత పన్నీర్‌సెల్వం టీటీవీ దినకరన్‌ను కూడా కలిసినట్లు తెలుస్తోంది. ఎడప్పాడి పళనిస్వామి ఏక నాయకత్వంగా ఎంపికైతే మిమ్మల్ని పార్టీ నుంచి తొలగిస్తారని, అతన్ని మీరు పార్టీ నుంచి తొలగించండని పన్నీర్‌కు టీటీవీ ఉపాయం చెప్పినట్లు సమాచారం. దినకరన్‌ చెప్పినట్లే జులై 11న సర్వసభ్య సమావేశంలో పన్నీర్‌సెల్వం, అతని మద్దతుదారులను తొలగిస్తూ ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు. బదులుగా ఎడప్పాడి పళనిస్వామిని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ఓపీఎస్‌ ప్రటించారు. సమావేశం తర్వాత కూడా పన్నీర్‌, దినకరన్‌లు కలిసినట్లు తెలుస్తోంది.

భారీ ఏర్పాట్లలో పన్నీర్‌ 

ఎడప్పాడి పళనిస్వామికి పోటీగా తమ తరఫున మరో సర్వసభ్య సమావేశం జరిపేందుకు ఆలోచించారు పన్నీర్‌సెల్వం. అయితే సర్వసభ్య సభ్యుల మద్దతు లేకపోవటంతో అది వీలుకాలేదు. దీని గురించి పన్నీర్‌ మద్దతుదారుడు, మాజీ మంత్రి ఒకరు మాట్లాడుతూ... ఇంతరకు పార్టీ పరంగా 45 జిల్లాలకు కార్యదర్శులను నియమించినట్లు, మిగతా 30 జిల్లాలకు కూడా నియమించి, వార్డు స్థాయిలో కూడా కొత్త నిర్వాహకులను నియమించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు. కనీసం లక్ష మంది నిర్వాహకులను నియమించేందుకు ప్రణాళిక రచించామని పేర్కొన్నారు. ఈ పనులు ముగిసిన తర్వాత సెప్టెంబర్‌లో భారీ స్థాయిలో సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు. ఇందుకు పర్యటన ప్రణాళికను పన్నీర్‌ సిద్ధం చేసినట్లు తెలిపారు. ముక్కులత్తోర్‌ సామాజికవర్గ నేతలను కలిసి మద్దతు కూడగట్టే పనుల్లో పన్నీర్‌ మద్దతుదారుడు, తేని జిల్లా కార్యదర్శి సయ్యద్‌ఖాన్‌ ఉన్నారు. అలాగే కొంగు మండల నిర్వాహకులను సమన్వయపరిస్తేనే బలం చేకూరుతుందని పన్నీర్‌ మద్దతుదారులు ఆయనకు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల చెన్నై, కాంచీపురం, సేలం, నామక్కల్‌, వేలూర్‌, రాణిపేట్టై, నీలగిరి జిల్లాల నిర్వాహకులతో ఆలోచనలు జరిపారు. కోర్టు, ఎన్నికల కమిషన్‌ కేసులు, పార్టీ గుర్తు తదితరాల పరిస్థితి ఏంటనేది ఇంకా తెలియలేదు. ఈ నేపథ్యంలో తాను అన్ని సామాజిక వర్గాలకు చెందిన నాయకుడిగా తనను చూపించుకునే పనుల్లో పన్నీర్‌ ఉన్నారు. మరోపక్క రాష్ట్ర వ్యాప్త పర్యటనకకు ఎడప్పాడి పళనిస్వామి సిద్ధమవుతున్నారు. ధర్మపురి, సేలం, కృష్ణగిరి, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో సమావేశాలు నిర్వహించారు ఎడప్పాడి. దిండిక్కల్‌ జిల్లాలో జరిగిన సమావేశంలో కూడా భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు. తదుపరిగా పన్నీర్‌కు ఎక్కువ మద్దతు ఉందని భావిస్తున్న దక్షిణ జిల్లాల్లో పర్యటించేందుకు ఎడప్పాడి ఏర్పాట్లు చేస్తున్నారు.


కోర్టు తీర్పుపై ఉత్కంఠ 

ఈ నేపథ్యంలో జులై 11న జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం చెల్లదని ప్రటించాలని పన్నీర్‌సెల్వం వేసిన కేసు విచారణ న్యాయమూర్తి జస్టిస్‌ జయచంద్రన్‌ ముందు విచారణకు వచ్చింది. అందులో జయలలిత శాశ్వత ప్రధాన కార్యదర్శి అని చెప్పి ఎందుకు తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవిని సృష్టించారని, సర్వసభ్య సమావేశం నిబంధనల మేరకు జరిగిందా? తదితర ప్రశ్నలు న్యాయమూర్తి లేవనెత్తారు. రెండు వారాల లోపు సమావేశం గురించి మద్రాసు హైకోర్టు తీర్పు చెప్పాలని సుప్రీం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో ఇంకొన్ని రోజుల్లో మద్రాసు హైకోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. ఎలాంటి తీర్పు వచ్చినా దాన్ని వ్యతిరేకించి సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు పన్నీర్‌, పళనిస్వామి వర్గాలు సిద్ధంగా ఉన్నాయి.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని